Vaccine: కోటి డోసులకు గ్లోబల్‌ టెండర్‌
close
Updated : 20/05/2021 10:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: కోటి డోసులకు గ్లోబల్‌ టెండర్‌

21 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో
కొవిడ్‌ టీకా కొనుగోలుకు కార్యాచరణ  

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ టీకాలను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకోసం ‘గ్లోబల్‌ టెండర్‌’ విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి సాధ్యమైనంత వేగంగా కోటి కొవిడ్‌ టీకా డోసులను సమకూర్చుకునేలా కార్యాచరణ రూపొందించింది. గ్లోబల్‌ టెండరుకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌లో ఈ-టెండర్‌ విధానం అందుబాటులో ఉంటుంది. జూన్‌ 4 సాయంత్రానికి ఆసక్తి కలిగిన ఉత్పత్తి సంస్థలు టెండరులో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) తెలిపింది. రాష్ట్రంలో 45 ఏళ్ల పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్లు అందజేస్తోంది. 18-44 ఏళ్ల మధ్యవయస్కులకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుక్కోవాలని సూచించింది. రాష్ట్రంలో ఆ వయసులవారు సుమారు 1.90 కోట్లమంది ఉంటారని అంచనా. ఇంతమందికి రెండు డోసుల టీకాలను అందజేయాలంటే.. వృథా పోనూ మొత్తం 4 కోట్ల డోసులు అవసరమవుతాయి. ఇందుకోసం రూ. 2500 కోట్లను కేటాయించింది. గ్లోబల్‌ టెండర్‌ విధానంలో సమకూర్చుకుంటే శరవేగంగా పంపిణీ చేయడానికి అవకాశాలుండంతోపాటు కొవిడ్‌ మూడో, నాలుగో ఉద్ధృతులను ఎదుర్కోవడానికి కూడా సన్నద్ధమైనట్లు అవుతుందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.

ఎన్ని సంస్థలైనా సరఫరా చేయొచ్చు
వేర్వేరు సంస్థలు తమ సరఫరా సామర్థ్యం మేరకు టెండరులో పొందుపర్చవచ్చు. సరఫరాలో మాత్రం భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ ఔషధ నియంత్రణ సంస్థల నిబంధనలను అనుసరించాలి. ఈ రెండు సంస్థలు అనుమతి లభించిన సంస్థలకు మాత్రమే సరఫరాకు తుది అర్హత లభిస్తుంది.
మన దేశంలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన సంస్థలతో పాటు విదేశాల్లో అనుమతి పొందిన సంస్థలు కూడా పాల్గొనవచ్చు.
ఒకవేళ విదేశీ సంస్థలకు టెండరులో అవకాశం లభిస్తే.. ఆ టీకాలను మన దేశ పరిస్థితులకు తగ్గట్లుగా సరఫరా చేయడానికి ఉత్పత్తి సంస్థ ముందుగానే అంగీకరించాలి. ఉదాహరణకు మన దేశంలో 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో టీకాలను భద్రపరుస్తున్నారు. కొన్ని విదేశీ సంస్థల టీకాలను మైనస్‌ డిగ్రీల్లో భద్రపర్చాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాటిని రాష్ట్రంలో పంపిణీ కేంద్రాల స్థాయి వరకూ సరఫరా చేయాల్సిన బాధ్యత సంబంధిత ఉత్పత్తి సంస్థదే.
మైనస్‌ డిగ్రీల్లో నిల్వకు అవసరమైన డీప్‌ ఫ్రీజర్లను, ఇతర పరికరాలను ఆ సంస్థే సమకూర్చుకోవాలి. వీటి రవాణా, మరమ్మతులు, బిగించడం వంటివి ఆ సంస్థే చూసుకోవాలి.
విదేశీ సంస్థలకు అవకాశం ఇవ్వడం వల్ల ఎక్కువ సంస్థలు టెండరులో పాల్గొనే అవకాశాలుంటాయి. కొద్ది మోతాదు చొప్పున ఎక్కువ సంస్థలు సరఫరా చేయడం వల్ల ఆశించినన్ని డోసులు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలుంటాయి.
ముందే నిర్దేశించిన తేదీల్లో సరఫరా చేయకపోతే ఉత్పత్తి సంస్థలకు జరిమానా విధిస్తారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని