
తాజా వార్తలు
గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తన అపార్ట్మెంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. విజయ్ కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమంటూ సహచర సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన విజయ్‌కుమార్ 2012 బ్యాచ్ ఎస్ఐగా హనుమాన్‌జంక్షన్‌లో తొలి బాధ్యతలు చేపట్టారు. నూజివీడుకు చెందిన బ్యూటీషియన్‌తో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో విజయ్‌కుమార్ అప్పట్లో సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి విధుల్లో చేరిన విజయ్‌కుమార్ గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించారు. ఏలూరుకు చెందిన మహిళతో 3 నెలల క్రితం విజయ్‌కు వివాహమైంది. భార్యను కాపురానికి తీసుకురాకుండా బ్యూటీషియన్‌తో కలిసి ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. బ్యూటీషియన్ ఒత్తిడి వల్లే విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భౌతికకాయాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయ్‌కుమార్ మరణవార్త తెలుసుకున్న సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఏరియా ఆసుపత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం: ఎస్పీ
గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎస్ఐ విజయ్ కుమార్ భౌతిక కాయాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పరిశీలించారు. విజయ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో విజయకుమార్ మృతిపై దర్యాప్తు జరుగుతుందన్నారు. డిపార్ట్మెంట్లో మంచి పేరు ఉన్న విజయ్ కుమార్ చిన్న వయసులో మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.
ఇవీ చదవండి..
కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
అంతమొందించి.. ఆపై నాటకం