Road Accident: వీడ్కోలు పలికి.. తిరిగి వెళ్తూ అన్నదమ్ముల దుర్మరణం 

తాజా వార్తలు

Updated : 29/09/2021 08:03 IST

Road Accident: వీడ్కోలు పలికి.. తిరిగి వెళ్తూ అన్నదమ్ముల దుర్మరణం 

విమానాశ్రయం నుంచి వస్తుండగా ఘటన 

వెల్గటూరు, శామీర్‌పేట, న్యూస్‌టుడే : జీవనోపాధికి దుబయ్‌ వెళ్తున్న తండ్రిని విమానాశ్రయం వరకు సాగనంపడానికి వెళ్లిన తనయుడు, అన్న కుమారుడు వీడ్కోలు చెప్పిన కొద్దిసేపటికే తిరిగిరాని లోకాలకు వెళ్లడం తీవ్ర విషాదం నింపింది. వెల్గటూరు మండలం స్తంభంపల్లికి చెందిన శేరి సుదర్శన్‌(33), శేరి రాజేందర్‌(35) అనే ఇద్దరు యువకుల దుర్మరణంతో రెండు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా.. స్తంభంపల్లికి చెందిన శేరి అనంతికి ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు.. కాగా అనంతి జీవనోపాధికి కొన్నేళ్లుగా దుబయ్‌ వెళ్తున్నాడు. గత ఆగస్టు 12న చిన్న కుమార్తె పెళ్లి కోసం వచ్చిన అనంతి మంగళవారం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం విమానం ఎక్కాల్సి ఉండగా, కొవిడ్‌ నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణకు కొన్ని గంటల ముందు విమానాశ్రయానికి చేరాల్సి ఉంది. దీంతో సోమవారం రాత్రి స్తంభంపల్లికి నుంచి అనంతి అన్న కుమారుడు రాజేందర్‌కు చెందిన కారులో ధర్మపురి మండలం నాగారాం గ్రామానిక చెందిన మరో యువకుడు వంశీతో కలిసివెళ్లారు. తెల్లవారుజామున విమానాశ్రయంలో అనంతిని సాగనంపి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి-మజీద్‌పూర్‌ మధ్య(ట్రక్కు బే)లో కంటైనర్‌ నిలిపి ఉంది. కారు డ్రైవర్‌ రాజేందర్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో అదుపుతప్పి కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. వాహనం ముందు భాగం నుజ్జయింది. ఇద్దరు సోదరులు సుదర్శన్, రాజేందర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. సుదర్శన్‌కు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. స్తంభంపల్లి 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. దుర్ఘటన విషయం తెలుసుకున్న తండ్రి హతాశుడయ్యాడు.  

ఉపాధి బాటలోనే ఆగిన ఊపిరి.. 

శేరి రాజేందర్‌ జీవనోపాధి కోసం కొన్నేళ్లుగా దుబయ్‌ వెళ్లి పెళ్లి తర్వాత వలసబాట వీడాడు. ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవాడైన రాజేందర్‌ వివాహానంతరం స్వగ్రామంలోనే ఉంటున్నాడు. జీవనోపాధికి 2020 ఆగస్ట్‌లో కారు తీసుకొని కిరాయితో జీవనోపాధి పొందుతున్నాడు. ఇదేక్రమంలో తన సొంత బాబాయ్‌ దుబయ్‌ వెళ్తుండటంతో సోదరుడు సుదర్శన్‌తో కలిసి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. తాను పొందే ఉపాధి బాటలోనే రోడ్డు ప్రమాదం రూపంలో ఊపిరి ఆగడంతో జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ప్రస్తుతం రాజేందర్‌ భార్య రవళి గర్భిణి.. అందరికీ తలలో నాలుకలా మెదిలే ఈ ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో అసువులు బాయడంతో స్తంభంపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి. మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమకూర్చారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని