
తాజా వార్తలు
మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. భవానీ నగర్లో మూడేళ్ల బాబును తన పిన్ని భవనంపై నుంచి కిందకు తోసేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈది బజార్లోని కుమ్మరివాడలో అహ్మద్ ఉద్దీన్ అనే వ్యక్తికి ఐష అనే మహిళతో ఏడాది క్రితం వివాహం జరిగింది. భర్త సోదరుడు మహ్మద్ ఎతేశ్యాం కుమారుడు నామానుద్దీన్ తరచూ వీరి ఇంటికి వెళ్తుంటాడు. ఉదయం ఇంటికి వచ్చిన నమాన్ను భవనంపైకి తీసుకెళ్లిన ఐష రెండు అంతస్తుల పైనుంచి కిందకి తోసేసింది. దీంతో బాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలు ఐషను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని తానే భవనం పైనుంచి కిందకి విసిరేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. వివాహం జరిగి ఏడాది అవుతున్నా తనకు పిల్లలు పుట్టనందునే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఘటనపై భవానీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.