డీజిల్‌ కుంభకోణంలో 25 మందిపై ఛార్జిషీటు

ప్రధానాంశాలు

Published : 30/07/2021 05:41 IST

డీజిల్‌ కుంభకోణంలో 25 మందిపై ఛార్జిషీటు

విశ్రాంత డైరెక్టర్‌పై కూడా
శ్రీరాంపూర్‌ సింగరేణి వ్యవహారం దర్యాప్తులో కదలిక

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి శ్రీరాంపూర్‌ ఏరియాలో రూ.200 కోట్ల డీజిల్‌ కుంభకోణంలో తాజాగా 25 మందిపై ఛార్జిషీటు దాఖలయినట్టు తెలుస్తోంది. గత ఏడాది మార్చిలోనే రాష్ట్ర విజిలెన్సు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఈ కేసు దర్యాప్తును పూర్తిచేసింది అప్పటి డైరెక్టర్‌, జీఎం, జీఎం వద్ద పనిచేసిన స్టాఫ్‌ ఆఫీసర్‌, ఆర్థిక శాఖలో పనిచేసే ఉద్యోగులు కుంభకోణం సూత్రధారులుగా పేర్కొంటూ నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. దీనిపై సింగరేణి శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించింది. 2017లో పనిచేసిన డైరెక్టర్‌ మనోహర్‌తో పాటు, మరో 24 మందిపై ఛార్జిషీటు దాఖలైంది. ఇందులో భాగస్వాములుగా ఉన్న జీఎం, డీజీఎంలు, ప్రాజెక్టు ఆఫీసర్ల స్థాయిని రెండు టైమ్‌ స్కేళ్ల మేరకు తగ్గించినట్లు చెబుతున్నారు. శాఖాపరమైన విచారణను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో అందరిపైనా ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదై ఉన్నాయి.
శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్ట్‌ గనిలో మట్టి తవ్వకానికి అవసరమయ్యే డీజిల్‌ను సింగరేణి సంస్థ సరఫరా చేస్తుంది. టెండరులో కాంట్రాక్టరు పేర్కొన్న పరిమాణం కన్నా తక్కువ డీజిల్‌ వినియోగిస్తే, పొదుపు చేసిన మేరకు బేసిక్‌ డీజిల్‌ ధరను బోనస్‌గా ఇస్తారు. 2016 జూన్‌లో ఈ కాంట్రాక్టు దక్కించుకున్న సుశీ ప్రసాద్‌ సంస్థ పెద్దమొత్తంలో బోనస్‌ పొందింది. ఒక దశలో ఈ మొత్తం రూ.150 కోట్లకు చేరుకుంది. దీనిపై విచారణ చేపట్టినప్పుడు టెండరులో ఉద్దేశపూర్వకంగా వాస్తవ వినియోగం కన్నా 35 శాతం అధికంగా పేర్కొన్న విషయం బయట పడింది. డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) అధ్యక్షతన ఒక కమిటీ, జీఎం విజయ్‌పాల్‌ రెడ్డి అధ్యక్షతన మరో కమిటీ విచారణ నిర్వహించాయి. డీజిల్‌ బోనస్‌గా కాంట్రాక్టరు రూ.200 కోట్లు లబ్ధి పొందారని అంచనా కొచ్చారు. డైరెక్టర్‌ స్థాయిలో ఉన్న ఒక అధికారి తను పదవీ విరమణ చేయటానికి దాదాపు మూడు నెలల ముందు ఈ టెండరు వ్యవహారం జరగడం, పదవీ విరమణ తర్వాత ఆయన కాంట్రాక్టరుకు సంబంధించిన గ్రూపులో ఉన్నతహోదాలో చేరటం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన