వృద్ధుల హత్య కేసుల్లో లోతుగా దర్యాప్తు
logo
Published : 22/06/2021 04:13 IST

వృద్ధుల హత్య కేసుల్లో లోతుగా దర్యాప్తు

త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం

పెనమలూరు, న్యూస్‌టుడే: సంచలనం రేపుతున్న వృద్ధుల హత్యల కేసుల దర్యాప్తు ఓ కొలిక్కి వస్తోంది. పోరంకి, కంచికచర్లలో హత్యకు గురైన వారి కేసుల దర్యాప్తులను పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దర్యాప్తు మంగళవారం పూర్తి చేసి ఈ కేసులో నిందితులైన ఐదుగురు యువకులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయడానికి  10 మంది సీఐలను నగర, జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు నియమించినట్లు సమాచారం. పోరంకిలో జరిగిన నాలుగు హత్య కేసుల దర్యాప్తులో భాగంగా సీఐలు, ఎస్‌ఐలు రెండు బృందాలుగా ఏర్పడి ఆది, సోమవారాల్లో ఆయా ప్రాంతాలను నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన ఇద్దరు వృద్ధ మహిళల మెడల్లో తెంచుకుపోయిన ఆభరణాల్లో కొన్ని రోల్డుగోల్డు నగలు ఉండటంతో తర్వాత గుర్తించిన హంతకులు వీటిని మురుగు కాల్వల్లోకి విసిరేసినట్లు గుర్తించిన పోలీసులు వీటిని వెలికితీయడానికి నిర్ణయించినట్లు సమాచారం. కేసుల్లో సాక్ష్యాలుగా బంగారు ఆభరణాలతో పాటు మురుగు కాల్వల్లో పడేసిన రోల్డుగోల్డు నగలు కీలకం మారే అవకాశం ఉండటంతో వీటిని స్వాధీనం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. సోమవారం ఓ పోలీస్‌ బృందం బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడానికి.. వీటిని కుదువ పెట్టిన ఫైనాన్స్‌ సంస్థల  తలుపులు తట్టినట్లు తెలుస్తోంది. హత్యలు, అరాచకాలకు పాల్పడిన ఈ ఐదుగురు యువకులపై పోలీసులు మొత్తం 21 కేసులు నమోదు చేయడానికి సోమవారం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ఆరు హత్యలు కాగా.. మిగతావి చైన్‌స్నాచింగ్‌, చోరీలు, చోరీ యత్నాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని