
భూ కబ్జాల్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయముంది
ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో భూ ఆక్రమణలు పెరిగాయని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని వక్తలు ఆరోపించారు. భూ యజమానుల పట్ల అధికారులు సానుభూతి చూపుతూనే కబ్జాదారులకు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ భూ పరిరక్షణ సమితి’ ఆధ్వర్యంలో కలిసి పోరాడుదాం- భూ బకాసులను తరిమికొడదాం అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం భూముల పరిరక్షణ కోసం ఆర్డినెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేసి ఎవరి భూములు వారికి చెందేలా చూడాలని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం కబ్జారాయుళ్లకు అండగా నిలుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా కబ్జాలకు అడ్డాగా మారిందన్నారు. సమావేశంలో తెతెదేపా అధ్యక్షలు ఎల్.రమణ, కాంగ్రెస్ నేత మధుయాసి్కిగౌడ్, గాదె ఇన్నయ్య, పల్లెరవి పాల్గొన్నారు. భూ బాధితులు గోడు వెల్లబోసుకున్నారు.