close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

ప్రధానాంశాలు

మార్గదర్శి... భవితకు స్ఫూర్తి

ఎల్లవేళలా తోడూ, నీడగా నిలిచే కన్న తండ్రి
ఈ రోజే ఎందుకంటే..?

తండ్రి విలువను ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో ప్రతియేటా జూన్‌ మూడో ఆదివారాన్ని ప్రపంచ తండ్రుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. తొలిసారిగా వాషింగ్‌టన్‌లో ఓ యువతి ఇందుకు చొరవ చూపింది. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రే అన్నీ అయ్యి ఆరుగురు కూతుళ్లను పెంచి పెద్ద చేశారు. అందుకే ఆయన పుట్టిన రోజును తండ్రుల దినోత్సవంగా జరిపారు. కాలక్రమంలో 1966లో ఈ దినోత్సవానికి అధికారిక గుర్తింపు లభించింది.

‘సహజంగా చిన్న పిల్లనైనా, అమ్మాయినైనా, పెద్ద మహిళనైనా..‘అమ్మా...’ అనే పిలుపుతోనే పిలుస్తాం.. ‘నాన్న’ అనే పిలుపు మాత్రం వేరెవ్వరికీ రాదు. అలా పిలవం కూడా. కేవలం కన్న తండ్రిని మాత్రమే ‘నాన్న’ అని పిలుస్తాం! ఆ పిలుపు నాన్నకే సొంతం.. నాన్న..! చేయి పట్టుకొని నడిపించే మార్గదర్శకుడు..! సర్వకాల సర్వావస్థలలో అభయ ప్రదాత..! పిల్లలకు ఏం కావాలో తెలుసుకొని.. భవిష్యత్తులో వాళ్లేం కావాలో తెలియజెప్పే స్ఫూర్తి దాత..! బిడ్డల ఎదుగుదలను చూసి.. తనలో తానే మురిసిపోతాడు..! తన పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగితే నలుగురికి చెప్పుకొని ఆనందిస్తాడు..! నాన్న నావికుడు.. నిత్య శ్రామికుడు.. అనునిత్యం జీవన విలువలు నేర్పే మార్గదర్శకుడు.. ఆపదలో ఆప్యాయత కురిపించినా.. అవసరాన్ని బట్టి అనురాగంతో మురిపించినా.. మంచి చెడుల విచక్షణ వివరించినా.. అన్నీ ఆయనకే చెల్లుతాయి.. బిడ్డల ఉన్నతికి అహర్నిశలు శ్రమించే సారథి.. వారధి నాన్న..! అమ్మ తరువాతి స్థానం ఆయనదే. అనుబంధం పంచుతాడు. బుద్ధికి పదును పెడతాడు. అందుకే నాన్న ఓ మంచి స్నేహితుడు.. సన్నిహితుడు.. మార్గదర్శకుడు.. విలువలు నేర్పే గురువు.. అన్నీ ఆయనే.. ఇలా విశిష్ట పాత్రలను మన జీవితంలో పోషిస్తున్న నాన్న సేవల సమాహారం ప్రతి కొడుకు గుర్తించతగినదే.. వేనోళ్ల కీర్తించతగినదే. నేడు ‘ప్రపంచ తండ్రుల దినోత్సవం’ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం..

- న్యూస్‌టుడే, వికారాబాద్‌

ఊహ తెలియని వయసునుంచీ అన్నీ తానై...
- శివాని, భవాని, అల్లీపూర్‌, ధారూర్‌
మేమిద్దరం కవలలం. మా అమ్మ మనీల ఊహ తెలియని వయస్సులోనే అనారోగ్యంతో పదేళ్ల కిందట మృతి చెందింది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన మా నాన్న దోమ చంద్రశేఖర్‌ తల్లిలేని లోటు తెలియకుండా పెంచాడు. పలువురు పెళ్లి చేసుకోమ్మని చెప్పినా మా శ్రేయస్సు కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా మా కోసమే జీవిస్తున్నాడు. మా కోసం మా నాన్న పడుతున్న కష్టాన్ని గుర్తించి మేము కూడా కష్టపడి చదివి వికారాబాద్‌లోని సంగం లక్ష్మిభాయి బాలికల గురుకుల పాఠశాలలో పదోతరగతి చదివాం. ప్రస్తుతం ఇంటర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలో ప్రవేశం పొందడానికి నిరీక్షిస్తున్నాం. మా ఉన్నతికి బాటలు వేస్తున్న నాన్నే మాకు సర్వస్వం.

నిరంతర స్ఫూర్తి..;  సృజన, ఎంబీబీఎస్‌, స్పందన, బీటెక్‌, వికారాబాద్‌
మీరేం సాధించాలనుకున్నా.. అంతా మీ ఇష్టం. అయితే లక్ష్యాన్ని విస్మరించకుండా ముందుకు సాగమని.. ఇతర అవసరాలు ఏమున్నా నేనున్నా.. అంటూ నాన్న అందించిన స్ఫూర్తే నేను (స్పందన) ఎంబీబీఎస్‌ పూర్తి చేసి వైద్యురాలిగా స్థిరపడేందుకు దోహద పడింది.  అలాగే మరొక అమ్మాయి సృజన, బీటెక్‌ పూర్తి చేసి మంచి పేరున్న సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. ఇందుకు నాన్న ప్రోత్సాహమే కారణంగా నిలిచింది. మా నాన్న వినోద్‌కుమార్‌ వికారాబాద్‌ వ్యవసాయశాఖ సహాయ సంచాలకునిగా విధులు నిర్వహిస్తున్నారు. తామిద్దరం ఆడపిల్లలమే అయినా మమ్మల్ని ఎప్పుడూ నిరాశకు గురిచేయక నిత్యం ఆత్మస్థైర్యాన్ని నింపి స్వతంత్రంగా జీవించేలా మార్గదర్శనం చేశారు. చేసే పనిని నిజాయితీగా, అంకితభావంతో చేయాలని నాన్న చెప్పిన మాటలను ఎన్నటికీ మర్చిపోలేం. ఆచరణలో అమలు చేస్తాం. ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ దక్కదని, అదృష్టంగా భావించి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని, సేవా భావంతో మెలగాలని నాన్న అవకాశం లభించినప్పుడల్లా నూరిపోశారు. ఆయన మాటలను సదా ఆచరిస్తాం.

కలను నెరవేర్చాం: సత్తయ్య, ఎంపీడీఓ, వికారాబాద్‌
ఎన్ని కష్టాలు పడ్డా సరే..! కొడుకులను ఉన్నత విద్యా వంతులను చేసి సంబురపడాలి..! అనేది మా నాన్న ఆశయం. పూడూర్‌ మండలం అంగడిచిట్టెంపల్లికి చెందిన మా నాన్న మల్ల శివయ్య సాధారణ రైతు. తాను చదువుకోకున్నా ముగ్గురు కొడుకులను చదివించాలనుకున్నాడు. ఇందుకు ఎన్నో కష్టాలు అనుభవించాడు. తెల్లవారు జామున నిద్రలేపి తమ దగ్గరే కూర్చొని వినబడేటట్లుగా గట్టిగా చదవమనేవాడు. మా నాన్న ఆశ వమ్ము కాలేదు. ముగ్గురం పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాం. నేను 2007లో గ్రూప్‌-1 సాధించి ఎంపీడీఓగా ఎంపికయ్యా. మా పెద్ద తమ్ముడు మల్లేశం పాఠశాల సహాయకునిగా ధారూర్‌ మండలం నాగసమందర్‌ జి.ప.ఉ.పాఠశాలలో, రెండో తమ్ముడు రాంచంద్రయ్య వికారాబాద్‌ మండలం సిద్దులూర్‌ జి.ప.ఉ.పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మంచిగా చదవాలి బిడ్డా.. అని తరచూ మా నాన్న కర్తవ్యాన్ని గుర్తు చేయడంతోనే ఈ స్థాయికి చేరుకున్నాం. మా నాన్న అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించి ఉన్నతికి బాటలు వేశారు. మా నాన్న కలను నెరవేర్చాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.