close

ఆదివారం, ఆగస్టు 18, 2019

ప్రధానాంశాలు

ట్రిపుల్‌ ఐటీ..సాంకేతికతతో పోటీ   

ఉపాధి అవకాశాలపై దృష్టి

డ్రోన్‌, రోబో టెక్నాలజీపై పరిశోధనలకు చర్యలు

నేటి నుంచి తరగతులు ప్రారంభం

ట్రిపుల్‌ ఐటీ డీఎం డైరెక్టర్‌ ఆచార్య సోమయాజులు

డీవీఎల్‌ఎన్‌ సోమయాజులు

 

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (ట్రిపుల్‌ ఐటీ డీఎం) కళాశాలను కర్నూలు బి.తాండ్రపాడులోని జగన్నాథగట్టుపై ఏర్పాటు చేసింది. వేసవి సెలవులు పూర్తై సోమవారం నుంచి రెండు, మూడు నాలుగో ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపస్‌కు అంతర్జాతీయ విద్యాసంస్థలు, పరిశ్రమలు రానున్నాయి. సెంటీలియన్‌ నెట్‌వర్క్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ట్రిపుల్‌ ఐటీ డీఎం సంయుక్తంగా డ్రోన్‌, రోబో టెక్నాలజీపై పరిశోధనలు చేసేందుకుగాను సోమవారం ఒప్పందం కుదరనుంది. 2019-20 విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీ ప్రోగ్రాం ప్రారంభంకానుంది. వచ్చే ఏడాదిలో ఎంటెక్‌ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవనున్న నేపథ్యంలో ట్రిపుల్‌ ఐటీ డీఎం డైరెక్టర్‌ ఆచార్యులు డీవీఎల్‌ఎన్‌ సోమయాజులు ‘న్యూస్‌టుడే’తో పలు విషయాలను పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే..

ప్రశ్న : ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ట్రిపుల్‌ ఐటీ డీఎం కళాశాలను ప్రారంభించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లనున్నారు?

జవాబు : ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో తాగునీటి సమస్య వేధిస్తోంది. శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది. ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రం అందించాం. ఆయన సానుకూలంగా స్పందించి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులతో 30 వేల మొక్కలు నాటించాలని ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ ఏడాది నుంచి ఉపాధి అవకాశాలపై దృష్టికి పెడుతున్నాం. రాయలసీమ జిల్లాల్లో సాంకేతిక పరిజ్ఞానం కోర్సులు అందిస్తున్న ఏకైక కళాశాల మనదే. దీనిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

ప్ర : కళాశాల ఆవరణలో అభివృద్ధి పనుల పరిస్థితి ఎలా ఉంది?

జ : నాలుగు నెలల కాలంలో ట్రిపుల్‌ ఐటీ డీఎం పరిధిలో అభివృద్ధి వేగంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందుతున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నాం. భవన నిర్మాణాల కోసం ఇటీవల కేంద్రం రూ.218 కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. పరిపాలన, ఇతర భవనాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

ప్ర : కళాశాలలో చదువుకునే బాలబాలికలకు శాశ్వత వసతిగృహాలు లేవు. తాత్కాలికంగా అద్దె భవనంలో ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిర్మాణంలో ఉన్న భవనాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?

జ : ఈ విద్యాసంవత్సరంలో బాలబాలికలకు వసతిగృహాల నిర్మాణాలు పూర్తవుతాయి. జీ+9 వసతిగృహాలు రెండు ఉన్నాయి. ముందుగా జీ+4 నిర్మించాలని సలహా ఇచ్చాం. పూర్తిస్థాయిలో నిధులు వస్తే నిబంధనల ప్రకారం భవనాలు పూర్తి చేయిస్తాం. వాస్తవానికి మూడు వసతిగృహాలు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే రెండు పూర్తయ్యాయి. జులై చివరిలోపు వాటిని అప్పగిస్తామని గుత్తేదారుడు హామీ ఇచ్చారు. మొదటగా అబ్బాయిలను వసతిగృహంలో ప్రవేశానికి అవకాశం ఇస్తాం. ఈ ఏడాది అమ్మాయిలను అద్దె భవనంలో ఉంచి అక్కడినుంచి మినీ అద్దె బస్సుల ద్వారా కళాశాలకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం.

ప్ర : కళాశాలలో శాశ్వత అధ్యాపకుల భర్తీ జరగడం లేదు. ఒప్పంద అధ్యాపకులతోనే బోధన సాగుతోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?

జ : కళాశాలలో బోధనకుగాను ప్రభుత్వం 15 పోస్టులు మంజూరు చేసింది. ఇప్పటికే 11 మందిని భర్తీ చేశాం. వీటితోపాటు అప్లికేషన్‌ ఓరియంటెడ్‌, ఇండస్ట్రీయల్‌ ఓరియంటెడ్‌ కోర్సులు విద్యార్థులకు అందివ్వాల్సి ఉంది. దీనికిగాను పరిశ్రమల రంగంలో పరిజ్ఞానం ఉన్న నలుగురు అతిథి బోధకులను తీసుకున్నాం.

ప్ర : ప్రస్తుతం నూతన విద్యార్థుల ప్రవేశ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటివరకు ఎంతమందిని ఎంపిక చేసుకున్నారు?

జ : ట్రిపుల్‌ ఐటీ డీఎం కళాశాలలో అన్ని సీట్లు భర్తీ అవుతాయి. శనివారం 17వ రౌండ్‌ ఫలితాలు విడుదల చేయగా అన్నింటిలో కలిపి మొత్తంగా 32 మంది విద్యార్థులు చేరారు. ఈనెల చివరిలోపు విద్యార్థులందరూ కళాశాలలో రిపోర్టు చేస్తారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

ప్ర : నూతనంగా ప్రవేశాలు పొందే విద్యార్థులకు మీరిచ్చే సూచనలేంటి?

జ : విద్యార్థులు భవిష్యత్తులో స్థిరపడాలంటే కష్టపడి చదువుకోవాలి. ప్రథమ ఏడాదిలో స్కిల్‌ ఓరియంటెడ్‌ రూపంలో సాధన చేసేలా ఆలోచనలు ఉండాలి. మిగిలిన ఏడాదిల్లో ఉపాధి అవకాశాలకు కళాశాల బాధ్యత తీసుకుంటుంది. ఇప్పటికే ట్రిపుల్‌ ఐటీ కళాశాల నుంచి విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారిలో 43 మంది రూ.6 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సంపాదించారు. వీరిలో కంప్యూటర్‌ సైన్సు విద్యార్థి గూగుల్‌లో ఇన్‌టెన్‌షిప్‌నకు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 1,400 మందిలో కర్నూలు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఉండటం గర్వకారణం. ఇతనికి ప్రతినెలా రూ.2.50 లక్షల వేతనం అందనుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.