close

సోమవారం, అక్టోబర్ 14, 2019

ప్రధానాంశాలు

పారాహుషార్‌..!

వరుసగా నాలుగు రోజులు మూతపడనున్న బ్యాంకులు

ఏటీఎంలలోనూ నగదు కష్టమే

ఖమ్మం గాంధీచౌక్‌, న్యూస్‌టుడే

దేశవ్యాప్తంగా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో లావాదేవీలు నిలిచిపోయి ఖాతాదారులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. జిల్లా ప్రజలు ఈ ఇబ్బందులను అధిగమించాలంటే ముందే మేల్కొనటం మంచిది. ఈ నెల 26, 27 (గురు, శుక్రవారాలు) తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు అధికారులు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 9 యూనియన్లలో అధికారులకు చెందిన నాలుగు సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. క్లరికల్‌ విభాగానికి చెందిన మరో ఐదు సంఘాలు కూడా వారం రోజులపాటు సమ్మె చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. అధికారులు సమ్మె చేస్తే బ్యాంకులు మూతపడతాయి. ఎప్పుడు కూడా ఆఫీసర్స్‌, క్లరికల్‌ విభాగం వారు కలిసి సమ్మె చేస్తారు. రెండు రోజులు అధికారుల సమ్మె, 28న నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. 29వ తేదీన ఆదివారం కావటంతో వరుసగా నాలుగు రోజుల బ్యాంకులు తెరుచుకోక ఖాతాదారులు పలు సమస్యలు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. అందుకు తగినట్టు ముందే లావాదేవీలు పూర్తి చేసుకోవటం ద్వారా ఇబ్బందులు అధిగమించే అవకాశం ఉంటుంది.

జమ.. ఉపసంహరణ ప్రధానం

బ్యాంకుల్లో ప్రధానంగా నగదు జమ, ఉపసంహరణ, ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ, ఆర్‌టీజీఎస్‌, నఫె్ట్‌, డీడీలు తీయటం, ఐటీ చలాన్ల లాంటి లావాదేవీలు నిత్యం జరుగుతుంటాయి. వీటిలో నగదు జమ, ఉపసంహరణ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు తప్ప మిగతా లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించుకునే వెసులుబాటుంది. కాకుంటే ఇలాంటి లావాదేవీలు 15నుంచి 20శాతం వరకు మాత్రమే ఉంటాయి. ఆన్‌లైన్‌ లావీదేవీలు నిర్వహించుకునే వారి సంఖ్య ఇప్పుడు పెరిగింది. సుమారు 50నుంచి 60శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో నిర్వహించుకుంటున్నారు.

రైతులకు ఇబ్బందులు

పట్టణాలతోపాటు బ్యాంకులు మండల కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌ కావటంతో ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు నిత్యం కూలీలకు ఇచ్చేందుకు నగదు అవసరం ఉంటుంది. బ్యాంకులు మూతపడితే రైతులు ఇబ్బంది పడతారు. అందువల్ల ముందే నగదు లావీదేవీలు చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏటీఎం కార్డులు కూడా మనుగడలో లేకుంటే వాటిని యాక్టివేట్‌ చేసుకోవటం మంచిది. వాటి ద్వారా కొంత వరకు అవసరాలు తీరే అవకాశం ఉంది. మందుల కొనుగోలు, ఆసుపత్రి అవసరాలకు ఏటీఎంలను ఉపయోగించుకోవచ్ఛు ఇది వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆదేశాలిచ్చాం

చంద్రశేఖర్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, ఖమ్మం

బ్యాంకు అధికారుల సమ్మె, రెండు రోజుల సెలవులతో నాలుగు రోజులపాటు బ్యాంకులు మూతపడే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాలోని అన్ని బ్యాంకులను ఆదేశించాం. ఏటీఎంలలో నగదు నిల్వలను పూర్తి స్థాయిలో ఉంచాలని, నగదు జమ, ఉపసంహరణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని కోరాం. అవకాశం ఉన్నవారు డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించుకోవటం మంచిది. రెండు రోజుల నుంచి కూడా బ్యాంకు అసోసియేషన్‌ నాయకులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.