close

ప్ర‌త్యేక క‌థ‌నం

రోదసిలో మన స్థావరం

కష్టాలు, వైఫల్యాలు ఎదురైనా వెరవక స్వయంశక్తితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనేక విజయాలు సాధిస్తోంది. 1963 నవంబర్‌ 21న కేరళలోని తుంబాలో ఉన్న ఈక్వెటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం నుంచి సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగంతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుంది. వచ్చే నెలలో చంద్రుడి మీదకు ల్యాండర్‌, రోవర్‌ను పంపుతోంది. 2022 నాటికి ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి (గగన్‌యాన్‌) సిద్ధమవుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి భూకక్ష్యలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు యోచనను ప్రకటించింది. ఇప్పటి వరకు మూడు దేశాలే సొంతంగా అంతరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకోగలిగాయి.

అంతరిక్ష కేంద్రాల నిర్మాణం ప్రారంభ దశలోనే ఉంది. ప్రస్తుత అంతరిక్ష కేంద్రాల్లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. భవిష్యత్‌ అంతరిక్ష కాలనీలకు కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి అవసరం. అందుకోసం రాబోయే రోదసి కేంద్రాలకు భ్రమణ సామర్థ్యం ఉండాలి. దీని వల్ల కృత్రిమ గురుత్వాకర్షణ ఏర్పడుతుంది. 

ఏమిటీ అంతరిక్ష కేంద్రం?

నిజానికి ఇదో భారీ వ్యోమనౌక. అది భూమి చుట్టూ నిర్దేశిత కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. అక్కడ వ్యోమగాములు బస చేయడానికి, పరిశోధనలు చేయడానికి ఏర్పాట్లు ఉంటాయి. అనేక భాగాలతో ఇది కూడి ఉంటుంది. భారీ సౌర ఫలకాల ద్వారా విద్యుత్‌ అందుతుంది.

ఏ వాహక నౌక?

భారత్‌ వద్ద ఉన్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్‌కు 4 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. దీన్ని మరింత మెరుగు పరచేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. చంద్రయాన్‌-2, గగన్‌యాన్‌కు ఈ వాహక నౌకనే ఉపయోగించనుంది. భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికీ దీన్నే వాడే వీలుంది.

నిర్మాణం ఎలా?

అంతరిక్ష కేంద్రం మొత్తాన్నీ ఒక్కసారి తరలించలేం. రాకెట్‌ ద్వారా దశలవారీగా తరలించాలి. భూమి మీద నుంచే నియంత్రిస్తూ పరస్పరం అనుసంధానించాలి. కొన్ని దశల అనుసంధానానికి వ్యోమగాములను పంపాల్సి ఉంటుంది. పూర్తిగా సిద్ధమయ్యాక వ్యోమగాములు నివసించవచ్చు.

ఎందుకీ కేంద్రాలు? 
అంతరిక్ష కేంద్రాలను నిర్మించి, నిర్వహించడానికి అనేక కారణాలున్నాయి. పరిశోధన, పారిశ్రామిక అవసరాలు, అంతరిక్ష అన్వేషణ, రోదసి పర్యాటకం వంటివి ఇందులో భాగం. భారరహిత స్థితి వల్ల మానవ శరీరంపై దీర్ఘకాలంలో పడే ప్రభావాలను అధ్యయనం చేయడానికి తొలితరం రోదసి కేంద్రాలను ఉద్దేశించారు. వ్యోమగాములు అంగారకుడు లేదా ఇతర గ్రహాల వద్దకు వెళ్లాలనుకుంటే నెలలు లేదా సంవత్సరాల పాటు సూక్ష్మగురుత్వాకర్షణ వాతావరణంలో గడపాల్సి ఉంటుంది. దీనివల్ల మన ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. 
రోదసిలోని సూక్ష్మ గురుత్వాకర్షణ వల్ల విస్పష్టమైన స్ఫటికాలు ఏర్పడతాయి. అవి మెరుగైన సెమీ కండక్టర్ల నుంచి వేగవంతమైన కంప్యూటర్లు, సమర్థ ఔషధాల ఉత్పత్తికి దోహదపడతాయి. 
భూ వాతావరణం, నేల తీరుతెన్నులు, అడవులు, సాగరాలు, పర్యావరణం గురించి అధ్యయనం చేయడానికి అంతరిక్ష కేంద్రాలు ఉపయోగపడతాయి. 
నేల మీద తలెత్తే వాతావరణ అవరోధాల ఇబ్బంది అంతరిక్ష కేంద్రాలకు ఉండదు. దీంతో ఆ కేంద్రాల్లో టెలిస్కోపులు ఏర్పాటు చేసి సుదూర విశ్వాన్ని స్పష్టంగా వీక్షించడానికి వీలవుతుంది. 
కక్ష్యలోని అంతరిక్ష కేంద్రాలు రోదసి హోటళ్లుగా కూడా ఉపయోగపడతాయి. వర్జిన్‌ గెలాక్టిక్‌ వంటి కంపెనీలు అక్కడికి పర్యాటకులను తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. 
ఈ కేంద్రాలను స్పేస్‌పోర్టులుగా కూడా ఉపయోగించే వీలుంది. వేరే గ్రహాల వద్దకు వెళ్లడానికి, రోదసిలో కొత్త నగరాలు, కాలనీలను ఏర్పాటు చేసుకునే క్రమంలో ఇవి మజిలీలుగా ఉపయోగపడొచ్చు.

మూడేళ్లుగా కసరత్తు 
అంతరిక్ష కేంద్రాల నిర్మాణం, నిర్వహణకు డాకింగ్‌ పరిజ్ఞానం చాలా కీలకం. దీనివల్ల కక్ష్యలోని రోదసి కేంద్రం లేదా దాని విడిభాగాలతో వాహకనౌకలు అనుసంధానం కావడానికి వీలవుతుంది. వ్యోమగాములను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లి, తిరిగి భూమికి తీసుకురావడానికి వీలవుతుంది. వారికి అవసరమైన సరకులు, ఆహారం, నీరును చేరవేయవచ్చు. ఈ సామర్థ్యాన్ని సమకూర్చుకునే దిశగా ‘స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌’ (స్పేడెక్స్‌) పేరిట మూడేళ్ల కిందట భారత్‌ ఒక ప్రాజెక్టును చేపట్టింది. ఈ డాకింగ్‌ ఆటోమేటిక్‌గా, రోబోటిక్‌ పరిజ్ఞానంతో సాగాలి. ఈ క్రమంలో వ్యోమనౌకలు ఢీ కొట్టుకోకుండా చూడాలి.

అంతరిక్ష కేంద్రాల ప్రస్థానమిదీ.. 
మొట్టమొదటి రోదసి కేంద్రాన్ని సోవియట్‌ యూనియన్‌ 1971లో  ప్రవేశపెట్టింది. సెల్యూట్‌-1 అనే ఈ కేంద్రం పొడవు 15 మీటర్లు. 
అమెరికా తొలి అంతరిక్ష కేంద్రం పేరు స్కైలాబ్‌. దీన్ని 1973లో ప్రయోగించారు. వినియోగం పూర్తయ్యాక 1979లో అది భూవాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయింది. 
1986లో రష్యా మిర్‌ అంతరిక్ష కేంద్రాన్ని ప్రయోగించింది. 2000 నవంబర్‌ 16న అది భూ వాతావరణంలోకి వచ్చి మండిపోయింది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) 
వివిధ దేశాల మధ్య సహకారంతో శాశ్వతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని 1984లో నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ ప్రతిపాదించారు. దీనికి రష్యా, ఐరోపా అంతరిక్ష సంస్థ, జపాన్‌, బ్రెజిల్‌, కెనడా సహా 18 దేశాలు చేతులు కలిపాయి. మానవ మేధస్సుకు, అంతర్జాతీయ సహకారానికి ఐఎస్‌ఎస్‌ ఒక వేదికగా నిలిచింది.

2011లో తియాంగాంగ్‌-1, 2016లో తియాంగాంగ్‌-2 అనే వ్యోమనౌకలను ప్రయోగించడం ద్వారా సొంత అంతరిక్ష కేంద్రాలను కలిగిన మూడో దేశంగా చైనా అవతరించింది. 2017 సెప్టెంబర్‌లో తియాంగాంగ్‌-1 భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది.

ఐఎస్‌ఎస్‌తో అందిన ప్రయోజనాలు 
ఐఎస్‌ఎస్‌ కోసం అభివృద్ధి చేసిన నీటి శుద్ధి వ్యవస్థల ద్వారా  అనేక దేశాల్లో సురక్షిత తాగునీటిని అందించొచ్చు. 
మానవ శరీరంలో లక్షకుపైగా ప్రొటీన్లు ఉంటాయి. ప్రతి ప్రొటీన్‌లోనూ మన ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వీటి అధ్యయనం చాలా తేలిక. ప్రత్యేకమైన, సంక్లిష్టమైన ప్రొటీన్‌ స్ఫటికాల వృద్ధి సాధ్యమవుతుంది. ఉదాహరణకు హెమటోపోయిటిక్‌ ప్రొస్టాగ్లాండిన్‌ డి సింథేజ్‌ అనే ప్రొటీన్‌ను రోదసిలో రూపొందించారు. కండరాల క్షీణత వంటి రుగ్మతలకు ఔషధాల రూపకల్పనకు ఇది వీలు కల్పిస్తుంది. 
ఐఎస్‌ఎస్‌ వ్యోమగాములకు వేగంగా వైద్యం అందించడానికి అడ్వాన్స్‌డ్‌ డయగ్నోస్టిక్‌ అల్ట్రాసౌండ్‌ ఇన్‌ మైక్రోగ్రావిటీ ఇన్వెస్టిగేషన్‌ అనే వ్యవస్థను రూపొందించారు. ఇలాంటి ప్రత్యేక విధానాలు భూమి మీదున్న మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి సుదూరం నుంచి వైద్యం అందించడానికి వీలు కల్పిస్తాయి. 
ఐఎస్‌ఎస్‌లో ఆస్టియోపొరోసిస్‌పై జరిగిన పరిశోధనల వల్ల ప్రొలియా అనే ఔషధాన్ని రూపొందించ గలిగారు. 
వేలాది మంది మరణాలకు కారణమవుతున్న సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్‌పై ఐఎస్‌ఎస్‌లో జరిగిన పరిశోధన వల్ల ఈ రుగ్మతకు కొత్త టీకా సాకారమైంది.

ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన భారత సంతతివారు: 
కల్పనా చావ్లా 
సునీతా విలియమ్స్‌

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.