close

ప్ర‌త్యేక క‌థ‌నం

జలాశయాలకు జోరుగా వరద

కృష్ణాలో 2 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం 
ఉప్పొంగుతున్న కడెం ప్రాజెక్టు 
భద్రాచలం వద్ద 46.7 అడుగులకు గోదావరి 
ఈనాడు - హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం

గువ నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఏ ప్రాజెక్టు వద్ద చూసినా ఒకే స్థాయిలో ప్రవాహం వస్తోంది. మూడు రోజులుగా ఆలమట్టి నుంచి రెండు లక్షల క్యూసెక్కులకుపైగా వరద దిగువకు ప్రవహిస్తోంది. శుక్రవారం పొద్దుపోయాక శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద కూడా రెండు లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల, శ్రీశైలం ఇలా నదిలో ఏ ప్రాంతంలో చూసినా ఏక కాలంలో ఇరవై టీఎంసీల స్థాయిలో జల ప్రవాహం కొనసాగుతుండటం విశేషం. రెండు వైపులా పరుచుకుని నది ఉగ్రరూపం దాల్చుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులో 58 టీఎంసీలు ఉండగా శనివారం అదే సమయానికి 78 టీఎంసీలకు చేరుకుంది. 24 గంటల వ్యవధిలో 20 టీఎంసీల జలాలు ప్రాజెక్టులోకి చేరుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవాహం ఇంకా కొన్ని రోజులు నిలకడగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


 

ఎల్లంపల్లికి భారీగా నీరు 
కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. శనివారం రాత్రి 8 గంటలకు 80 వేల క్యూసెక్కులకు పైగా ఎల్లంపల్లి ప్రాజెక్టు వైపునకు వదులుతున్నారు. ఎల్లంపల్లిలోనూ నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటానికి మరో ఏడు టీఎంసీల వ్యత్యాసం మాత్రమే ఉంది. శనివారం సాయంత్రానికి 74 వేల క్యూసెక్కులకు పైగా ఎగువ నుంచి వస్తుండగా ఆదివారం నాటికి ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం రాత్రి లేదంటే సోమవారం ఉదయం నాటికి దిగువకు నీటిని విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లలో 65 గేట్లను మూడు రోజులుగా తెరిచే ఉంచారు. శనివారం ఇన్‌ఫ్లో 4.53 లక్షల క్యూసెక్కులు ఉండగా 4.89 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద గోదావరి 30 అడుగులకు చేరింది. మానేరు నుంచి వస్తున్న వరదతో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ నుంచి పగలంతా 14 గేట్ల ద్వారా 63 వేల క్యూసెక్కుల వరదను మేడిగడ్డవైపు వదిలారు. సాయంత్రానికి గేట్లు మూసేశారు. పేరూరు వద్ద గోదావరిలో ఆరు లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. భద్రాచలం వద్ద గోదావరి నది ఉరకలెత్తుతోంది. శనివారం రాత్రి 8 గంటలకు వరద ప్రవాహం 46.7 అడుగులకు చేరుకుంది. ఉదయం 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అధికారులు అప్రమత్తమై వరద సహాయక చర్యలకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

మధ్యతరహా ప్రాజెక్టులకు జలకళ

గోదావరి, కృష్ణా పరీవాహకంలో కురుస్తున్న వర్షాలకు మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటోంది. కుమురం భీం ప్రాజెక్టు, పెద్దవాగు, వట్టివాగు, స్వర్ణ, తాలిపేరు, గుండ్లవాగు, పాలెంవాగు ప్రాజెక్టులు మత్తడి పోస్తున్నాయి. వర్షాలు ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు ప్రాజెక్టులు నిండటంతో వీటి కింద ఇప్పటికే వరి నారు పోసుకున్న రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం తదితర జిల్లాల్లో మధ్య తరహా ప్రాజెక్టులే ఆయకట్టుకు ఎక్కువ మేర సాగునీటిని అందిస్తున్నాయి. రాష్ట్రంలో మధ్య తరహా ప్రాజెక్టుల కింద 4.27 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గోదావరి పరీవాహకంలోని 11 జిల్లాల పరిధిలో 28 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3.09 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా పరీవాహకంలో ఏడు జిల్లాల పరిధిలో 8 ప్రాజెక్టులు ఉండగా 1.17 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం 62,060 ఎంసీఎఫ్‌టీల (మిలియన్‌ ఘనపుటడుగులు)నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 30,624 ఎంసీఎఫ్‌టీల నిల్వ చేరుకుంది. ఇప్పటికే నిండిన ప్రాజెక్టుల కింద 1.05 లక్షల ఎకరాల ఆయకట్టుకు భరోసా చేకూరింది. ఖమ్మం జిల్లాలోని వైరా, మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువు, వరంగల్‌ గ్రామీణ జిల్లాలోని పాకాల సరస్సు, భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని లక్నవరం, రామప్ప సరస్సు, మంచిర్యాల జిల్లాలో నీల్వాయి ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. 

రేపు అల్పపీడనం 
ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శనివారం పగలంతా రాష్ట్రంలో వర్షాలు కురిశాయి. మొత్తం 666 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నార్నూర్‌లో 109, హీరాపూర్‌లో 107, గుడిహత్నూర్‌లో 95, లచ్చోడలో 87, కెరమెరిలో 71.8, సిరికొండలో 61, రాంనగర్‌లో 60, ఆదిలాబాద్‌లో 58 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.