Top TenNews @ 9 AM
close

తాజా వార్తలు

Published : 22/05/2021 08:55 IST

Top TenNews @ 9 AM

1. Covid: యువ ఉద్యోగులపై కొవిడ్‌ పంజా

రెండోదశ కొవిడ్‌ కల్లోలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు ప్రభావితం అవుతున్నారు. గతంతో పోలిస్తే కేసులతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. ఈ దఫా యువ ఉద్యోగులు గణనీయ సంఖ్యలో ప్రాణాల్ని కోల్పోతున్నారు. ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా కరోనా కాటును తప్పించుకోలేకపోతున్నారు. రాలిపోతున్న ఉద్యోగుల్లో నాలుగు పదుల వయసుకు ఐదారేళ్లు అటూఇటుగా ఉంటున్నవారే అధికం. మహిళలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్య, పోలీసుశాఖలకు చెందిన ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉంది.

2. ‘నైరుతి’ ఆగమనం

నైరుతి రుతుపవనాలు అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావారణ పరిశోధన శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. త్వరలోనే రుతుపవనాలు కేరళను తాకనున్నాయని చెప్పడానికి ఇది స్పష్టమైన సంకేతంగా పేర్కొంది. ‘‘దక్షిణ బంగాళాఖాతంలోని వివిధ ప్రాంతాలు, నికోబార్‌ దీవులు, పూర్తిస్థాయిలో దక్షిణ అండమాన్‌ సముద్రం, ఉత్తర అండమాన్‌ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ఈనెల 21న ప్రవేశించాయి’’ అని ఐఎండీ వెల్లడించింది. దేశంలో 4 నెలల వర్షపాత కాలం ప్రారంభానికి ఇది సూచిక.

3. రూ.75కే యాంటీబాడీ పరీక్ష !

కొవిడ్‌-19 యాంటీబాడీలను మాత్రమే గుర్తించే చౌక కిట్‌ను రక్షణ పరిశోధన అబివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. కొవిడ్‌ వైరస్‌ స్పైక్‌, న్యూక్లియోకాప్సిడ్‌ ప్రొటీన్లను 97 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తున్నట్లు పరీక్షల్లో తేలింది. డీఆర్డీవోకు చెందిన దిల్లీలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజియాలజీ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు దేశీయంగానే ‘డిప్కోవన్‌’ కిట్‌ను అభివృద్ధి చేశారు. వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వెయ్యి మంది కొవిడ్‌ రోగులపై విస్తృతంగా పరీక్షించిన తర్వాత గత నెలలో ఐసీఎంఆర్‌ దీన్ని ఆమోదించింది. తాజాగా డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ), సెంట్రల్‌ డ్రగ్స్‌ స్లాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి ఆమోదం లభించడంతో కిట్ల తయారీకి, మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది.

* ఓడిద్దాం.. ఒంటరితనాన్ని

4. TS Lockdown: 15వేల వాహనాల జప్తు 

లాక్‌డౌన్‌ సమయంలో కారణం లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రెండ్రోజుల క్రితం డీజీపీ మహేందర్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాటికి సుమారు 15 వేల వాహనాలను జప్తుచేసినట్లు సమాచారం. మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నారు. కొందరికి నిజంగానే అత్యవసర పనులుంటున్నా కొందరు మాత్రం అకారణంగా బయట తిరుగుతున్నారు. ఇలా వచ్చే వాహనాన్ని గుర్తిస్తే తాత్కాలికంగా జప్తు చేస్తున్నారు. రూ.వెయ్యి జరిమానా చెల్లించినా సరే లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాతే వాటిని వదిలివేయాలని నిర్ణయించారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే అందుకు కారకులైన వాహనదారులపై ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయడంపైనా దృష్టి సారించారు.

5. Corona symptoms: వేచి చూడకండి.. వేగిరపడండి

కొవిడ్‌ చికిత్సలో లక్షణాలు కనిపించిన తొలి 5-8 రోజులు అత్యంత కీలకమని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. మందులు వాడుతున్నా కూడా తీవ్రమైన జ్వరం వస్తున్నా లేక భరించలేని ఒళ్లునొప్పులు వేధిస్తున్నా.. గతంలో ఎన్నడూ లేనంత నిస్సత్తువ ఆవహిస్తున్నా.. ఒక్కరోజు కూడా జాప్యం చేయొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ జ్వరం 101-102 డిగ్రీలు దాటుతుంటే 5 రోజుల వరకూ కూడా ఆగకూడదని నిపుణులు చెబుతున్నారు. తీవ్ర జ్వరం వరసగా 3 రోజులు వచ్చినా వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఎన్నిరోజులు ఆలస్యం చేస్తే.. ఊపిరితిత్తులు అంతగా దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

6. కొవిడ్‌ బాధితులను క్షణాల్లో గుర్తిస్తున్న శునకాలు!

 కొవిడ్‌ బాధితులను గుర్తించేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం శునకాలను రంగంలోకి దించింది!  మురికివాడలు, నిర్మాణ ప్రాంగణాలు, మార్కెట్లలో కరోనా బాధితులను గుర్తించేందుకు కనైన్‌ డిటెక్టింగ్‌ స్క్వాడ్‌ను మోహరించింది. చులాలాంగ్‌కార్న్‌ యూనివర్సిటీ పశుసంవర్ధక పరిశోధకులు.. మనుషుల చెమట నుంచి వచ్చే వాసన ద్వారా కొవిడ్‌ బాధితులను గుర్తించేలా కొన్ని లేబ్రడార్‌ రిట్రీవర్స్‌ జాతి శునకాలకు శిక్షణ ఇచ్చారు. ఈ నెల 10 నుంచి ఇప్పటివరకూ  వెయ్యి మందిని ఇవి గుర్తించాయట! ‘వ్యక్తుల స్వేదాన్ని మెటల్‌ కంటైనర్‌లో ఉంచుతున్నాం. శునకాలు వాటిని వాసన చూసి క్షణాల్లో బాధితులను గుర్తించేస్తున్నాయి.  భారత్‌, ఫిన్‌లాండ్‌, దుబాయ్‌, జర్మనీల్లో ఇలాంటి ప్రయోగాలు చేశారని తెలిసింది. ఇప్పుడు మేం కూడా ఈ ప్రయత్నంలో సఫలమయ్యాం’’ అని ప్రధాన పరిశోధనకర్త ప్రొఫెసర్‌ కీవాలీ చదరాంగ్‌ తెలిపారు.

7. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌.. ఇక సెలవు

సుమారు పాతికేళ్లుగా నెటిజన్లకు సేవలందిస్తున్న ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ బ్రౌజర్‌ను 2022 జూన్‌ 15 నుంచి నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఈ వెబ్‌ బ్రౌజర్‌ను విండోస్‌ 95తో కంపెనీ విడుదల చేసింది. ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 11 డెస్క్‌టాప్‌ అప్లికేషన్‌కు వీడ్కోలు చెప్పబోతున్నాం. విండోస్‌ 10కి చెందిన కొన్ని వెర్షన్లలో 2022 జూన్‌ 15 నుంచి దీని సేవలు అందుబాటులో ఉండవ’ని మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ సియాన్‌ లిండర్‌సే తెలిపారు. ‘విండోస్‌ 10లో ఇక ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు సంబంధించిదంతా మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌లో చూస్తాం. మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ వేగవంతమైనదే కాదు.. మరింత సురక్షితమైనది. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు మించి వినూత్న బ్రౌజింగ్‌ అనుభూతిని అందిస్తుంద’ని సియాన్‌ వెల్లడించారు.

 

*కలల వెంట తను... రెక్కలు తెగి నేను!

 

8. కొవిడ్‌ నేర్పిన పాఠాలు..ఇల్లు ఎలా ఉండాలంటే..?

కొవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో సొంతిల్లు ఎంత అవసరమో తెలిసేలా చేస్తే.. రెండో ఉద్ధృతిలో  ఎలాంటి ఇల్లు అవసరమో గుర్తించేలా చేసిందంటున్నారు నిర్మాణదారులు. కొవిడ్‌ భయాలు.. లాక్‌డౌన్‌ ఆంక్షలతో కుటుంబ సభ్యులు రోజుల తరబడి ఇంటికే పరిమితం అవుతున్నారు.. నాలుగు గోడల మధ్య కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఇంటి నిర్మాణం ఉండాలి. కరోనా ఒక్కటే కాదు ఇతరత్రా అనారోగ్యాల బారిన పడకుండా ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండాలంటే తగిన వెంటిలేషన్‌ తప్పనిసరి. సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నా, నిర్మాణం పూర్తైన ఇంటిని కొనుగోలు చేస్తున్నా ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు.

9. Cyclone alert: తుపాను పొంచి ఉంది.. జాగ్రత్త

శ్రీకాకుళం,రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 24 వ తేదీ కల్లా తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం చెబుతున్నందున ఆంధ్రప్రదేశ్‌ సహా తీర ప్రాంతంలో ఉన్న అయిదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, అండమాన్‌ నికోబార్‌ దీవుల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.  ఈ నెల 26న ఒడిశా-పశ్చిమబెంగాల్‌ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు.

10. TS Lockdown: లాక్‌డౌన్‌ మరింత కఠినం

రాష్ట్రంలో ఆదాయం కోల్పోతున్నా నష్టాన్ని లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు సూచించారు. కొన్ని జిల్లాల్లో సరిగా అమలు కావడంలేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉదయం సడలింపు సమయం ముగిశాక 10.10 గంటల తర్వాత పాస్‌లు ఉన్నవారు మినహా మరెవ్వరూ రోడ్డు మీద కనిపించకూడదని చెప్పారు. యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌ తదితర జిల్లాల్లో కరోనా కేసులు తగ్గడం లేదని, వెంటనే ఆ జిల్లాలకు వెళ్లి పరిస్థితులను సమీక్షించాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని సీఎం ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని