
తాజా వార్తలు
ఎవరి జీవితం ధన్యం?
ఇస్లాం సందేశం
మోక్ష మార్గాన్ని సాధించుకోవాలంటే దగ్గరి దారి అంటూ లేదు. దేవుడిచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మాత్రమే జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. కష్టాల్లో నిజాయతీగా బతకాలి. సుఖాల్లో కృతజ్ఞతతో మెలగాలి. అలాంటివారంటేనే దైవానికి ఇష్టం అంటారు ముహమ్మద్ ప్రవక్త (స). తను నిర్వర్తించే పనుల్లో నిజాయితీగా ఉండటం దైవారాధనతో సమానమంటారాయన. బాధ్యతల్ని గాలికొదిలేసి చేసే యాత్రలు, దైవారాధనలు పరలోకంలో చెల్లని నాణేలు అవుతాయి. ఖురాన్ గ్రంథాన్ని, ప్రవక్త జీవితాచరణను అనుసరించాలి. ‘తల్లి పాదాల చెంత స్వర్గముంది. తండ్రి స్వర్గానికి ముఖద్వారం’ అని తల్లిదండ్రుల సేవలోనే ముక్తిమోక్షాలు దాగున్నాయని చెప్పారు ప్రవక్త. ‘ఆడపిల్లను పెంచి, ఆమెకు సరైన విద్యాబుద్ధులు నేర్పి తగిన వరుడికిచ్చి వివాహం జరిపిస్తే ఆ ఆడపిల్ల నరకానికి అడ్డుగోడ అవుతుంద’న్నారు. ‘అనాథల తలను ప్రేమగా నిమిరితే లెక్కలేనన్ని పుణ్యాలు లభిస్తాయ’ని సెలవిచ్చారు. తల్లిదండ్రులు, రక్తసంబంధీకులు, వితంతువులు, అనాథలు, సమాజంలో నిరాదరణకు గురవుతున్న వారిని ఆదుకోవడంలోనే జీవితం పునీతమవుతుందని ప్రవక్త చెప్పారు.
- ఖైరున్నీసా బేగం