
తాజా వార్తలు
అలా చూడొద్దు!
ఇస్లాం సందేశం
ఒకానొక మహిళ చేతిలో పళ్లెంలో ఏవో పదార్థాలు తీసుకెళుతోంది. పళ్లెంపై ఏదో గుడ్డ కప్పి ఉండటంతో పళ్లెంలో ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం అటుగా వెళుతున్న ఓ పండితుడికి కలిగింది. ‘అమ్మా ఈ పళ్లెంలో ఏముంది’ అని అడిగారాయన. ‘ఇందులో ఉన్నదేమిటో చెప్పదలుచుకున్నప్పుడు ఇలా కప్పి తీసుకెళ్లాల్సిన అవసరమేముంది’ అని బదులివ్వడంతో పండితుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆమె చెప్పిన మాటల్లో జీవితానికి పనికొచ్చే చిట్కాలున్నాయి.
‘ఏదైనా వస్తువు, మాట రహస్యంగా ఉంచదలిచినప్పుడు దాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేయకూడదన్న నిగూడార్థం ఇందులో ఉంది. ఒకరి వెంట పడి వారి లోపాలను, బలహీనతలను బహిర్గతం చేయరాదన్న సందేశం ఇందులో ఉంది. ప్రతి ఒక్కరిలో మంచి, చెడు అలవాట్లుంటాయి. మనం మన చెడ్డ అలవాట్లు, లోపాలు ఒకరిముందు బహిర్గతం కాకుండా జాగ్రత్తపడతాము. పైనున్న ఆ దేవుడు మనలోని ఆ దుర్గుణాలపై పరదా కప్పి మన గౌరవ మర్యాదలను కాపాడతాడు. ఒకవేళ అంతరంగంలో మనం చేసే తప్పులు, పొరపాట్లు, చెడ్డ పనులు అన్నీ బహిర్గతమైతే ఒకరినొకరం అసహ్యించుకుంటాం. అందుకే ఒకరి లోపాలు వెతుక్కుంటూ, వారిని అభాసుపాలు చేసే చిల్లర పనులు మానుకోవాలి అంటారు పెద్దలు.
- ఖైరున్నీసాబేగం