close
వరదను వదలొద్దు

శ్రీశైలానికి గోదారి.. వయా ప్రకాశం బ్యారేజీ?
  వరద జలాల తరలింపుపై కొత్త యోచన
  పరిశీలనలో మరో రెండు ఆలోచనలు
  250-300 టీఎంసీల నీటిని తరలించడమే లక్ష్యం
  జూన్‌-ఆగస్టు మధ్య అనువైన కాలంగా భావన
  28న కేసీఆర్‌-జగన్‌ భేటీ నేపథ్యంలో అధికారుల కసరత్తు
  సీఎంల ప్రధాన చర్చ దీనిపైనే!

3 రకాల ఆలోచనలు

1. ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత గోదావరి నీటిని శ్రీశైలానికి మళ్లించడం
2. దుమ్ముగూడెం నుంచి గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు మళ్లించి అక్కడి నుంచి శ్రీశైలానికి తరలించడం
3. పోలవరం నుంచి గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి అక్కడి నుంచి నది ద్వారానే నాగార్జునసాగర్‌కు తీసుకురావడం

ఈనాడు - హైదరాబాద్‌

గోదావరి వరద నీటిని కృష్ణా నదిలోకి మళ్లించాలన్న యోచనకు పదును పెరుగుతోంది. పలు ఆలోచనలపై కసరత్తు చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యంగా మూడు రకాల ఆలోచనలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు ఎక్కువ నీటి వినియోగం జరగాలంటే గోదావరి నీటిని ఎక్కడి నుంచి మళ్లించేలా చేపడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నదానిపై చర్చిస్తున్నారు.

ఎజెండాపై ముఖ్యమంత్రుల సూచన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య  గోదావరి జలాల వినియోగంపై చర్చ జరిగింది. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని, ఇక్కడి నుంచి నేరుగా శ్రీశైలానికి నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుందని, పూర్తి సహకారంతో కరవు జిల్లాలకు గోదావరి వరద జలాలను వినియోగించుకోవచ్చన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీనిపై ఉన్నతస్థాయి అధికారులతో కూడా ఆయన చర్చించారు. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం నీటి మళ్లింపు సామర్థ్యాన్ని రోజుకు ఒక టీఎంసీకి పెంచడంపైనా ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ నెల 28న హైదరాబాద్‌లో సమావేశం కావాలని నిర్ణయించిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఇందుకు సంబంధించిన ఎజెండా ఇతర అంశాలపై సిద్ధం కావాలని అధికారులకు సూచించారు.

వరద నీటి మళ్లింపుపైనే ప్రధాన చర్చ?
గోదావరి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించడంపైనే ముఖ్యమంత్రుల మధ్య ప్రధాన చర్చ ఉంటుందని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. వరద ఉండే మూడు నెలల సమయంలో 250 నుంచి 300 టీఎంసీల నీటిని మళ్లించడమే లక్ష్యంగా కొత్త పథకానికి రూపకల్పన చేయాలన్నది యోచనగా చెప్తున్నారు. నీటి అవసరం ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం, కృష్ణాలో లభ్యమయ్యేనీరు, అదనంగా ఎంతమేరకు అవసరం అన్నదాని ఆధారంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. జల వివాదాలకు సంబంధించిన ఇతర అంశాలకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు.

సమాచారాన్ని సిద్ధం చేసుకుంటున్న అధికారులు
ఈ నెల 28న సమావేశం గురించి అధికారికంగా సమాచారం లేకున్నా సీఎంల సూచన మేరకు రెండు రాష్ట్రాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌తోనూ, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుతో చర్చించారు. నీటిని మళ్లించే ప్రతిపాదనల గురించి ప్రస్తుతం రెండు రాష్ట్రాల ఇంజినీర్లు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకొంటున్నారు.

సాగర్‌కు గత ఎనిమిదేళ్లలో 150 టీఎంసీల కంటే తక్కువే

* నాగార్జునసాగర్‌లోకి జూన్‌ నుంచి ఆగస్టు నెలల మధ్య వచ్చిన   కృష్ణా జలాలను పరిశీలిస్తే  2007-08 నుంచి 2017-18 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో 150 టీఎంసీల కంటే తక్కువే వచ్చాయి.
* ఐదు సంవత్సరాల్లో సుమారు 50 టీఎంసీలు మాత్రమే వచ్చాయి.
* 2012-13లో 7.24 టీఎంసీలు వస్తే, 2015-16లో 4.35 టీఎంసీలు, 2017-18లో 3.21 టీఎంసీలు మాత్రమే వచ్చాయి.
* ఈ సంవత్సరాల్లో శ్రీశైలంలోకి కూడా ఏమీ ప్రవాహం లేదు. ఆలమట్టి ఎత్తు పెంపు తర్వాత, తుంగభద్ర ఎగువన కర్ణాటక వినియోగం పెరిగిన అనంతరం ఆగస్టు వరకు   శ్రీశైలానికి నీటి లభ్యత మరింత తగ్గిపోయింది.

నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలానికి ఎలాగంటే?

ప్రస్తుతం కృష్ణా నది విషయంలో శ్రీశైలం జలాశయం నిండిన తర్వాత నాగార్జునసాగర్‌కు జలాలు వస్తాయి. తాజా ఆలోచన ప్రకారం గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజీకి తీసుకువచ్చిన నీటిని కృష్ణా నది ద్వారానే పులిచింతలకు, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించి, ఇక్కడి నుంచి శ్రీశైలంలోకి ఎత్తిపోత ద్వారా నింపడంపై ఆలోచిస్తున్నారు. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. నీటిమట్టాన్ని 560 అడుగుల వరకూ నిర్వహిస్తే ఇందులో నిల్వ చేసిన నీటిని రివర్సబుల్‌ టర్బైన్స్‌ ద్వారా శ్రీశైలంలోకి ఎత్తిపోయవచ్చు. ప్రస్తుతం విద్యుత్తు ఉత్పత్తి ద్వారా వదిలిన నీటిని తిరిగి శ్రీశైలంలోకి ఎత్తిపోసే వ్యవస్థ ఉంది. దీనినే వినియోగించుకొని నీటి ఎత్తిపోత చేపట్టడానికి అవకాశం ఉందనే అభిప్రాయాన్ని రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఏది సరైన సమయం?

శ్రీశైలంలోకి ఆగస్టు రెండో వారం తర్వాతే నీటి ప్రవాహం ఉంటోంది. ఈలోగా సుమారు 45 రోజులు నాగార్జునసాగర్‌కు, అక్కడి నుంచి శ్రీశైలానికి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌ ద్వారా ఎత్తిపోయవచ్చు. తద్వారా సాగర్‌ కుడి, ఎడమకాలువ, సోమశిల, ఎ.ఎం.ఆర్‌.పి ప్రాజెక్టుల కింద జాప్యం కాకుండా నీటిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శ్రీశైలానికి వచ్చే నీటిని ఆ ప్రాజెక్టుపై ఆధారపడిన కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, ప్రస్తుతం తెలంగాణలో నిర్మాణంలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలకు ఇవ్వొచ్చు. దీనిపై ఇంజినీర్లు అధ్యయనం చేస్తున్నారు. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా శ్రీశైలానికి నీటిని మళ్లించడం కంటే నాగార్జునసాగర్‌ ద్వారా మళ్లించడమే ఉత్తమం అన్న అంశంపై రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.