ఆక్స్‌ఫర్డ్‌ను వదలుకొని...

ప్రధానాంశాలు

ఆక్స్‌ఫర్డ్‌ను వదలుకొని...

డాక్టర్‌ హర్‌దయాళ్‌... చెప్పగానే గుర్తుపట్టేంత ప్రాచుర్యం పొందని పేరిది. భారత స్వాతంత్య్రోద్యమంలో మరుగునపడి, చరిత్రకెక్కని పేరిది. గాంధీ, నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌లకంటే ముందే... భారత స్వాతంత్య్ర పోరాటాన్ని అంతర్జాతీయంగా అందరి దృష్టికి తెచ్చిన అపార ప్రజ్ఞాశాలి.... గదర్‌ ఉద్యమ రూపకర్త లాలా హర్‌దయాళ్‌!

1884, అక్టోబరు 14న దిల్లీలో ఏడుగురు అన్నదమ్ముల మధ్య ఆరోవాడిగా జన్మించిన హర్‌దయాళ్‌ సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి సంస్కృతంలో పట్టా సంపాదించారు. లాహోర్‌ పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేశాక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి రెండు స్కాలర్‌షిప్‌లు వచ్చాయి. ఆర్యసమాజ్‌ ప్రభావంలో ఉన్న ఆయన వాటిని వదులుకొని 1908లో భారత్‌ వచ్చేశారు. అప్పటికింకా భారత్‌లో జాతీయోద్యమం పూర్తిగా ఊపందుకోలేదు. స్వాతంత్య్రం కంటే కూడా... బ్రిటిష్‌ ప్రభుత్వంలో భారతీయులకు సైతం అవకాశం కల్పించాలనే సంస్కరణలను కోరుతున్న దశ అది. కానీ హర్‌దయాళ్‌ మాత్రం... ‘‘మన లక్ష్యం బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని, పాలనను సంస్కరించటం కాదు. దాన్ని పూర్తిగా పారదోలడమే’’ అంటూ ఇండియన్‌ సోషియోలజిస్ట్‌లో వ్యాసం రాశారు. తొలి ప్రపంచయుద్ధానికి ముందే... భారత్‌ను బ్రిటన్‌ చెర నుంచి విముక్తి చేయాలని తపించారాయన. ఇందుకు విప్లవమార్గంలో సహాయ నిరాకరణే శరణ్యమని భావించారు.  దీంతో ఆయనపై బ్రిటిష్‌ పాలకులు ఆంక్షలు విధించటం మొదలెట్టారు.

లాలాలజపతిరాయ్‌... ఆయన్ను విదేశాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. 1909లో పారిస్‌కు వెళ్లి వందేమాతరం పత్రికకు ఎడిటర్‌గా పనిచేసిన హర్‌ దయాళ్‌ వివిధ దేశాలు తిరిగి...బుద్ధిజంపైనా, ప్రభుత్వరహిత  వ్యవస్థలు, మార్క్స్‌పైనా పరిశోధించి... చివరకు 1911లో అమెరికాకు చేరుకున్నారు. పారిశ్రామికోద్యమంలో భాగమయ్యారు. స్టాన్‌ఫర్డ్‌లో సంస్కృతం, భారతీయ తత్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు.

గదర్‌ రూపకల్పన

అదే సమయంలో చాలామంది పంజాబీ విద్యార్థులు, రైతులు అమెరికా, కెనడాలకు వలసవచ్చేవారు. వారిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సాయం చేయటానికి గురుగోవింద్‌సింగ్‌ సాహిబ్‌ విద్యా ఉపకారవేతనాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. వీటిని ఉపయోగించుకొన్న వారిలో... మన తెలుగువాడైన దర్శి చెంచయ్య కూడా ఉన్నారు. విప్లవ పోరాటపథంలో భారత్‌కు స్వాతంత్య్రం తేవాలని తారక్‌నాథ్‌దాస్‌ తదితరులతో కలసి కాలిఫోర్నియా వేదికగా... 1913లో గదర్‌పార్టీకి రూపకల్పన చేశారు హర్‌ దయాళ్‌. అనేకమంది యువ భారతీయులకు ఆ సమయంలో ఇదో ఆశాకిరణంలా కనిపించింది. బ్రిటిష్‌ ప్రభుత్వానికి మాత్రం గుండెలో గునపంలా మారింది. ఆయుధాలు పంపి సిపాయిల్లో తిరుగుబాటుకు ప్రణాళిక రచించారు. దిల్లీలో అడుగుపెట్టిన రోజే... వైస్రాయి లార్డ్‌ హార్డింగ్‌పై దాడి జరిగింది. దీని వెనకాల సూత్రధారి హర్‌దయాళ్‌ అని గుర్తించిన బ్రిటన్‌ ప్రభుత్వం... ఆయన్ను అప్పగించాల్సిందిగా అమెరికాపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. కమ్యూనిస్టు అనుకూల వైఖరి అవలంబిస్తున్నారంటూ... అమెరికా ప్రభుత్వం ఒత్తిడి తేవటంతో జర్మనీ వెళ్లిన హర్‌దయాళ్‌... అక్కడే విప్లవవాదులందరినీ ఏకం చేసి బెర్లిన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ వాటన్నింటినీ బ్రిటన్‌ తన గూఢచర్యంతో విజయవంతంగా దెబ్బతీసింది. లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా... అనేక మందికి స్ఫూర్తినిచ్చారు హర్‌దయాళ్‌. 1939 మార్చి4న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 54వ ఏటే కన్నుమూసిన ఆయన మేధో మార్గంలో భారత పరిస్థితుల గురించి, స్వాతంత్య్ర ఆవశ్యకత గురించి ప్రపంచంలోని అనేక దేశాలకు అర్థం చేయించటంలో సఫలమయ్యారు.

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ స్కాలర్‌షిప్‌లు ఇచ్చినా... భారత స్వాతంత్య్రం కోసమని వదలుకొన్న హర్‌దయాళ్‌ ప్రతిభను చూసి ఆంగ్లేయులు సైతం ఆచ్చెరువొందేవారు. సంస్కృతం, ఉర్దూ, పారసీ, ఫ్రెంచ్‌, అరబిక్‌, గ్రీక్‌, పాళి, స్వీడిష్‌... ఇలా 17 భాషల్లో అపారపాండిత్యంగల ఆయనకు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక 1919లో... ‘అపర మేధావి... అన్నింటికిమించి సంస్కారి’ అంటూ కితాబిచ్చింది. స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసిన తొలి భారతీయుడు హర్‌దయాళే!


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని