దిల్లీ:50 వేల మంది పోలీసులు.. జల ఫిరంగులు

తాజా వార్తలు

Updated : 06/02/2021 12:46 IST

దిల్లీ:50 వేల మంది పోలీసులు.. జల ఫిరంగులు

దిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలలకు పైగా హస్తిన సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతన్నలు నేడు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా నేడు చక్కా జామ్‌(రాస్తారోకో)కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీలో గత నెల 26న చోటుచేసుకున్న ఘటనల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో దాదాపు 50వేల మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది మోహరించారు. రైతులు ఆందోళన చేస్తున్న సరిహద్దుల్లో డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. గాజీపుర్‌ సరిహద్దుల్లో మరిన్ని బారీకేడ్లను ఏర్పాటు చేశారు. జలఫిరంగులు సిద్ధంగా ఉంచారు.

భద్రత నీడలో ఎర్రకోట..

గణతంత్ర దినోత్సవం నాడు రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి అలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. చారిత్రక ఎర్రకోట వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

మెట్రోస్టేషన్లు అప్రమత్తం..

చక్కా జామ్‌ దృష్ట్యా దిల్లీ వ్యాప్తంగా మెట్రో స్టేషన్లలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిస్థితుల దృష్ట్యా స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. అటు సింఘు, టిక్రీ సరిహద్దుల్లోనూ భారీగా భద్రత బలగాలు పహారా కాస్తున్నాయి.

దేశవ్యాప్తంగా నేడు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైతులు రహదారులను దిగ్బంధనం చేయనున్నారు. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లకు మినహాయింపునిస్తూ దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆందోళన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేతలు తెలిపారు. అంబులెన్సులు, పాఠశాల బస్సులు వంటి అత్యవసర, తప్పనిసరి సేవలకు ఆటంకం కలిగించబోమని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) స్పష్టం చేసింది. చక్కా జామ్‌ను పూర్తి శాంతియుతంగా నిర్వహిస్తామని ఎస్‌కేఎం సీనియర్‌ నేత దర్శన్‌ పాల్‌తో పాటు బీకేయూ నేత రాకేశ్‌ టికాయత్‌ శుక్రవారం వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు చక్కా జామ్‌ ముగియగానే ఒక నిమిషం పాటు హారన్‌ మోగించనున్నట్లు రైతు నేతలు తెలిపారు. చక్కా జామ్‌కు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది.

ఇవీ చదవండి..

సంయమనం పాటించండి!

పోలీసులు మేకులు బిగిస్తే.. రైతులు పూల మొక్కలు నాటారు!



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని