
తాజా వార్తలు
రైతుల ర్యాలీకి అనుమతిపై మీదే అధికారం!
దిల్లీ పోలీసులకు సుప్రీం హితవు
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోకి ఎవరిని.. ఎప్పుడు.. అనుమతించాలనేది పూర్తిగా స్థానిక పోలీసుల అధికార పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా.. వద్దా.. అనేది పోలీసులే నిర్ణయించాలని సూచించింది. జనవరి 26న రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దిల్లీ పోలీసులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజున ర్యాలీ అనేది పూర్తిగా శాంతిభద్రతల అంశమని ధర్మాసనం తెలిపింది. పోలీసులు ఏం చేయాలో కోర్టు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 26న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి తీరుతామని రైతు నాయకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా చేస్తే గణతంత్ర ఉత్సవాలకు ఆటంకం కలుగుతుందని, నిలుపుదల చేయించాలని కేంద్రం తరఫున దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. మరోవైపు రైతుల ఆందోళన వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మంగళవారం భేటీ కానుంది.
ఇవీ చదవండి...
రైతుకు కన్నీరు.. వ్యాపారికి పన్నీరు