భార‌త్‌లో ఒక్క‌రోజే 23వేల కేసులు!

తాజా వార్తలు

Published : 04/07/2020 10:29 IST

భార‌త్‌లో ఒక్క‌రోజే 23వేల కేసులు!

రికార్డుస్థాయిలో న‌మోద‌వుతున్న కొవిడ్‌ కేసులు
24గంటల్లో 22,771 కేసులు, 442 మ‌ర‌ణాలు..

దిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. నిత్యం 20వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లోనే 22,771 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో శ‌నివారంనాటికి దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 6,48,315కు చేరింది. వీరిలో నిన్న ఒక్క‌రోజే 442మంది కన్నుమూసినట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 3,94,227 మంది కోలుకోగా మ‌రో 2,35,433 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు తెలిపింది. కేవ‌లం శుక్రవారం ఒక్క‌రోజే దాదాపు 14వేల మంది కోలుకున్నారని ప్ర‌భుత్వం తెలిపింది. అయితే ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 60శాతం దాట‌డం ఊర‌ట క‌లిగించే విష‌యం. 

తమిళ‌నాడు: ల‌క్ష కేసులు దాటిన రెండో రాష్ట్రం..

దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న విష‌యం తెలిసిందే. నిత్యం రాష్ట్రంలో రికార్డుస్థాయిలో క‌రోనా కేసులు న‌మోదౌతున్నాయి. గ‌త రెండురోజులుగా రాష్ట్రంలో 6వేల‌కు పైగా పాజిటివ్ కేసులు బయటపడటం ప‌రిస్థితికి అద్దంప‌డుతోంది. నిన్న ఒక్క‌రోజే మ‌హారాష్ట్రలో 6వేల పాజిటివ్ కేసులు రికార్డుకాగా మొత్తం కేసుల సంఖ్య 1,92,990కు చేరింది. వీరిలో ఇప్ప‌టి వ‌ర‌కు 8376 మంది కన్నుమూశారు. ఇక త‌మిళ‌నాడులోనూ నిత్యం 4వేల‌కుపైగా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. గ‌డిచిన 24గంట‌ల్లో 4329 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య ల‌క్షా 2వేల‌కు చేరింది. దేశంలో ల‌క్ష కేసులు దాటిన రెండో రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 1385మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజ‌ధాని దిల్లీలోనూ క‌రోనా కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేరువైంది. తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు ఒక్క‌సారిగా పెరిగాయి.

95ల‌క్ష‌ల కొవిడ్ ప‌రీక్ష‌లు..

ఇక దేశంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త పెరుగుతున్న దృష్ట్యా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్యను ప్ర‌భుత్వం పెంచింది. జులై3 ఒక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా 2,42,383 ప‌రీక్ష‌లు జ‌రిపిన‌ట్లు భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 95,40,132 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు వెల్లడించింది.

ఇవీ చ‌ద‌వండి..
ఆగ‌స్టు 15నాటికి క‌రోనా వ్యాక్సిన్‌!

క‌రోనా.. ఇళ్ల‌లోనే చికిత్స‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని