Oxygen: కరోనా వేళ.. ఆక్సిజన్‌ తొలగించి మాక్‌ డ్రిల్‌!
close

తాజా వార్తలు

Published : 08/06/2021 22:41 IST

Oxygen: కరోనా వేళ.. ఆక్సిజన్‌ తొలగించి మాక్‌ డ్రిల్‌!

సరఫరా లేకపోవడంతో నీలం రంగులోకి బాధితుల శరీరం

ఏప్రిల్‌ నెలలోని ఘటన.. ఆడియో రూపంలో వెలుగులోకి

ఆగ్రా: ఓ ప్రైవేటు ఆసుపత్రి ఆక్సిజన్ కొరతను వంకగా చూపుతూ.. ఐదు నిమిషాలు సరఫరా నిలిపివేసి, 22మంది ప్రాణాలమీదకి తీసుకువచ్చిన ఘటన తాజాగా ఆడియో రూపంలో వెలుగులోకి వచ్చింది. తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన ఆ ఆసుపత్రి యజమానిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన యూపీ ప్రభుత్వం..దర్యాప్తునకు ఆదేశించింది. ఇంతకీ విషయం ఏంటంటే..

కరోనా రెండో దశలో దేశవ్యాప్తంగా కొవిడ్ బాధితులను మెడికల్ ఆక్సిజన్ కొరత వేధించింది. తమ వద్ద ఆక్సిజన్ నిండుకుందని ఆసుపత్రులు చేతులెత్తేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇదే సమయంలో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఒక ప్రముఖ ఆసుపత్రి మాత్రం ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్న బాధితులపై మాక్ డ్రిల్స్ నిర్వహించింది. దానికి సంబంధించిన ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. మోదీ నగర్‌లో పూర్తిగా నిండుకుంది. బాధితులను తీసుకెళ్లమని వారి కుటుంబ సభ్యులకు చెప్పాం. కానీ ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు నేనొక ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది ఒకరకమైన మాక్‌ డ్రిల్. ఏప్రిల్ 26 ఉదయం ఏడుగంటల సమయంలో ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేశాం. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఎవరు బతికుంటారో, ఎవరు చనిపోతారో మేం కనుగొంటాం. ఆక్సిజన్ సపోర్టుపై ఉన్న 22 మంది రోగులను గుర్తించాం. వారు చనిపోతారని గ్రహించాం. సరఫరా నిలిపివేయగానే.. బాధితులకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వారి శరీరం నీలం రంగులోకి మారింది. ఐసీయూ వార్డులోని మిగతా రోగుల కోసం సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చుకోవాలని వారి కుటుంబ సభ్యులకు సూచించాం’ అని ఆగ్రాలోని ఓ ప్రముఖ ఆసుపత్రి యజమాని ఆ ఆడియోలో మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఈ వైఖరిని తీవ్రంగా పరిగణించిన యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఆ ఆడియోలో మాటలను వక్రీకరించినట్లు ఆసుపత్రి యజమాని మీడియాకు వెల్లడించారు. ‘నా మాటలను వక్రీకరించారు. మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం సీరియస్‌గా ఉన్న రోగులను గుర్తించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించాం. ఏప్రిల్ 26న నలుగురు, ఏప్రిల్ 27న ముగ్గురు కొవిడ్‌తో మరణించారు’ అని చెప్పుకొచ్చారు. అలాగే 22 మంది మృతి చెందారనే వార్తలపై ప్రశ్నించగా..కచ్చితంగా తెలియదన్నారు. దీనిపై మృతుల బంధువులు షాక్‌కు గురయ్యారు. ఇదొక హత్యానేరమని, తమకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా..‘ఆ ఆసుపత్రిలో పెద్ద ఐసీయూ వార్డు ఉంది. వేరే మరణాలు కూడా సంభవించి ఉండొచ్చు. ఆడియో టేపును క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం’ అని జిల్లా మేజిస్ట్రేట్ వెల్లడించారు.

మానవత్వం కొరవడింది: రాహుల్‌..

మాక్‌ డ్రిల్ కారణంగా మరణాలు చోటుచేసుకున్న ఘటనపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భాజపా పాలనలో ఆక్సిజన్‌తో పాటు మానవత్వం కొరవడింది. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ రాహుల్ ట్వీట్  చేశారు. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ కూడా ఈ ఘటనపై మండిపడ్డారు. ఆ 22 మంది మరణానికి ఎవరు బాధ్యులంటూ ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని