సివిల్‌ నేరమైతే ఎస్సీ-ఎస్టీ చట్ట విచారణను నిలిపివేయవచ్చు

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:09 IST

సివిల్‌ నేరమైతే ఎస్సీ-ఎస్టీ చట్ట విచారణను నిలిపివేయవచ్చు

 సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం స్పష్టీకరణ

దిల్లీ: ఒక నేరాభియోగం ఎస్సీ-ఎస్టీ చట్టం కిందికి వచ్చినా ప్రాథమికంగా అది ప్రైవేటు, లేదా సివిల్‌ నేరంగా కనిపించినప్పుడు; బాధిత పక్ష సామాజిక వర్గం వల్ల ఆ నేరం జరిగినట్లు అనిపించనప్పుడు విచారణ నిలిపివేతకు న్యాయస్థానాలు అధికారాన్ని ఉపయోగించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం సోమవారం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. కులం ప్రాతిపదికన జరిగే అకృత్యాలను నివారించి, పునరావాసం కల్పించడానికే ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నిర్మూలన చట్టాన్ని తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. విచారణ కొనసాగించడం వల్ల చట్టబద్ధమైన ప్రక్రియ దుర్వినియోగమవుతుందని కోర్టు భావించినప్పుడు విచారణను కొట్టివేయవచ్చని తెలిపింది. అయితే- బాధితులపై బల ప్రయోగం జరిగినట్లు ఏమాత్రం అనిపించినా నిందితులకు ఉపశమనం ఇవ్వరాదని విస్పష్టంగా చెప్పింది. ఎస్సీ-ఎస్టీ చట్టం కింద తనకు విధించిన శిక్షను మధ్యప్రదేశ్‌ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ ఒక వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం విచారించింది. స్థల వివాదంలో ఇరుగుపొరుగువారి మధ్య తలెత్తిన తగాదా చివరకు ‘కులం పేరుతో దూషణ’ కింద కేసుకు దారి తీసింది. నిందితులకు దిగువ కోర్టు.. ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. దానిపై నిందితుల అప్పీలును మధ్యప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన