
తాజా వార్తలు
వాతావరణం క్రమక్రమంగా మారుతోంది. శీతగాలులు గిలిగింతలు పెడుతున్నాయి. ఇలాంటప్పుడు మొదట ఎక్కువగా ప్రభావితమయ్యేది చర్మమే. దాంతోపాటు జుట్టూ తన సహజ గుణాన్ని కోల్పోతుంది. మరి ఈ కాలంలో అందం గురించి అతివలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందామా!
మేకప్ వేసుకునే ముందు, తీసేసిన తరువాత తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులను ఎంచుకోవాలి.
చలికాలంలో సరైన సౌందర్య పోషణ తీసుకోకపోతే చర్మం పొలుసులుగా ఊడిపోతుంది. పెదాలు పొడిబారతాయి. పొడిచర్మం ఉన్నవారు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వివాహ మూహూర్తాలు చాలానే ఉన్నాయి. ఈ సమయంలో కాబోయే పెళ్లి కూతుళ్లు తమ సౌందర్య సంరక్షణ కోసం ఇంకాస్త ఎక్కువ సమయాన్నే కేటాయించుకోవాలి. వీరేకాదు...అందరూ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తల్ని పాటించాలి.
ఆహారపరంగా...
చలికాలం చర్మ సంరక్షణ అంటే పై పూతలే కాదు. తీసుకునే ఆహారం నుంచే ఆ జాగ్రత్త మొదలవ్వాలి. రోజులో కనీసం ఏడెనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. అప్పుడే శరీరం డీహైడ్రేట్ కాకుండా తాజాగా, తేమగా ఉంటుంది. ఆహారంలో బాదం, వాల్నట్స్ అవిసెగింజలు, నెయ్యి లాంటివాటిని చేర్చుకోవాలి. ఇవి సహజంగానే నూనెలను కలిగి ఉంటాయి. తాజా ఆకుకూరలు, కాయగూరల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, సిలు శరీరానికి తగినంతగా అందుతాయి. వీటితో పాటు మాంసకృత్తులు, ఫ్యాటీయాసిడ్లు, జింకు వంటి ఖనిజాలు కలిగిన సమతులాహారాన్ని ఎంచుకోవాలి. ఇవన్నీ చర్మానికి నిగారింపు తెచ్చిపెడతాయి. జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
------------------------------------------------
స్క్రబ్ తప్పనిసరి...
ఈ కాలంలో చర్మంపై పేరుకుపోయే మృతకణాలను తొలగించడానికి తరచూ స్క్రబ్ చేస్తూ ఉండాలి. ముఖం, పెదాలు, చేతులు, కాళ్లూ... ఇలా శరీరం మొత్తాన్ని స్క్రబ్ చేయాల్సిందే. ఇందుకోసం రసాయనాలతో చేసిన స్క్రబ్‌లను వాడితే శరీరంలోని సహజ నూనెలు బయటకు వెళ్లిపోతాయి. అలాకాకుండా సహజ పదార్థాలతో వీటిని తయారు చేసుకోవచ్ఛు ఉదాహరణకు ఆలివ్ నూనె/తేనెకు చక్కెర కలుపుకోవచ్ఛు ఆ మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఇలా పదినిమిషాలు చేసి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. వీటికి కాసిని గులాబీరేకల్నీ జతచేసుకోవచ్ఛు.
---------------------------------------------------------
పెదాలు...
మనలో చాలామంది పెదాలను సరిగా పట్టించుకోరు. ఈ కాలంలో వీటికి సరైన పోషణ అందించకపోతే పగిలిపోతాయి. తీవ్రత ఎక్కువై కొన్నిసార్లు రక్తమూ రావొచ్ఛు అలా కాకుండా ఉండాలంటే పెదాలకూ స్క్రబ్ అవసరమే. ఇందుకోసం మొదట వాటిపై పెట్రోలియం జెల్లీ రాయాలి. ఆ తరువాత చక్కెరలో కొన్ని నీళ్లు కలిపి దాన్ని టూత్‌బ్రష్‌తో పెదాలపై మృదువుగా రుద్దాలి. తరువాత చల్లటి నీటితో కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి. ఇలా చేసిన వెంటనే లిప్‌బామ్/పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. వారంలో ఒకటిరెండుసార్లు ఈ పద్ధతిలో పెదాలను శుభ్రం చేసుకోవాలి. రోజూ తప్పనిసరిగా పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి.
--------------------------------------------------------------------
సన్‌స్క్రీన్ లోషన్ అవసరమే...
చలికాలంలో సూర్య ప్రతాపం అంతగా ఉండదు కాబట్టి సన్‌స్క్రీన్ లోషన్ అవసరం ఉండదనుకుంటాం. అది సరికాదు. కాలం ఏదైనా దీన్ని తప్పనిసరిగా రాసుకోవాలి. ఎస్పీఎఫ్ 30కిపైగా ఉన్న రకాన్ని ఎంచుకోవాలి. స్నానం చేసిన వెంటనే శరీరానికంతటికి మాయిశ్చరైజర్ రాయాలి. ఆ తరువాత సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. జిడ్డుచర్మం ఉన్నవారు నీటి ఆధారిత, పొడిచర్మం ఉన్నవారు నూనెఆధారిత మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి.
ఈ కాలంలో చాలామంది బాగా మరిగిన నీళ్లను స్నానానికి ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మం, జుట్టు మరింత పొడిబారతాయి.
పాదాలు... మన శరీరంలో ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యేవి ఇవే. గోరువెచ్చటి నీటిలో కాళ్లను కాసేపు పెట్టి, స్క్రబ్ చేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రాత్రిపూట పెట్రోలియం జెల్లీ రాసి సాక్సు వేసుకోవడం తప్పనిసరి. ఇలా చేస్తే కాళ్లు పగలవు. పొడిచర్మం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొందరిలో సమస్య ఎక్కువైతే పాదాల పగుళ్ల నుంచి రక్తం రావొచ్ఛు అలాంటివారు పగుళ్లపై వైట్ పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. దానిపై శాలిసిలిక్ యాసిడ్‌తో కూడిన గాఢత తక్కువగా ఉండే స్టిరాయిడ్ క్రీమ్‌ని రాసుకుని సాక్సు వేసుకుంటే పగుళ్ల సమస్య ఉండదు.
చేతులు... పొడి చర్మతత్వం ఉన్నవారు....ఈ కాలంలో రోజులో అయిదారుసార్లు పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరినూనెలాంటి వాటిని చేతులకు రాసుకోవాలి. అప్పుడే అవి తేమ కలిగి పొలుసు రాలకుండా ఉంటాయి. కొంతమంది హ్యాండ్‌వాష్, శానిటైజర్లని ఎక్కువగా వాడతారు. ఈ కాలంలో వీటిని తక్కువగా ఉపయోగించాలి లేదంటే చేతులు మరింతగా పొడిబారతాయి.
జుట్టు... చలికాలంలో జుట్టు పొడిగా, పీచులా తయారవుతుంది. దురదా వస్తుంది. చుండ్రు సమస్య పట్టిపీడిస్తుంది. తలస్నానం గోరువెచ్చటి నీటితో చాలా త్వరగా ముగించేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు. స్నానానికి ముందు గోరువెచ్చటి కొబ్బరినూనె/ఆలివ్ నూనెను తలకు అప్లై చేసి మర్దన చేసుకుని టవల్ చుట్టుకోవాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఈ నూనెలో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ని కలుపుకోవచ్ఛు చుండ్రు ఉన్నవారు ఈ నూనెలో టీట్రీ ఆయిల్‌ను కలిపి పెట్టుకుంటే సమస్య తగ్గుతుంది. గాఢత తక్కువగా, పీహెచ్ 5 నుంచి 5.5 ఉన్న షాంపూలను వాడాలి. తలస్నానం చేశాక కండిషనర్ వాడకం తప్పనిసరి. సీరం రాసుకోవడం వల్ల జుట్టుకి రక్షణ అందుతుంది. మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే హైడ్రేటెడ్ షాంపూలను వాడాలి. ఈ కాలంలో జుట్టుకు స్టైలింగ్ పరికరాలను వాడకుండా ఉంటే చాలామంచిది. తప్పనిసరి అనుకుంటే జుట్టు 60 శాతం ఆరిన తరువాత సీరం రాసుకుని బ్లో డ్రై చేసుకోవాలి.
మరిన్ని జాగ్రత్తలు...
* చలికాలంలో శరీరాన్ని పూర్తిగా కప్పి మందంగా ఉండే దుస్తుల్ని ఎంచుకోవాలి. తలకి స్కార్ఫ్, చేతులకు గ్లవ్స్, పాదాలకు సాక్స్ వాడాలి.
* రాత్రి పడుకోబోయే ముందు మేకప్ తీసి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని ఆపైన మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
* గాఢత తక్కువగా ఉండే, పీహెచ్ 5 నుంచి 5.5 ఉండే సబ్బులనే వాడాలి. ఫోమ్ ఉండే ఫేస్‌వాష్‌లకు ఈ కాలంలో దూరంగా ఉండాలి.
* ఏసీలో పనిచేసేవారు మాయిశ్చరైజర్ తరచూ రాసుకుంటూ ఉండాలి. చర్మతత్వాన్ని బట్టి దీన్ని ఎంచుకోవాలి.
* చలికాలంలో ఆల్కహాల్ ఉన్న బ్యూటీ క్రీమ్స్ వాడటం మంచిది కాదు.
* బ్లాక్, వైట్ హెడ్స్ వారానికి ఒకసారి తొలగించుకోవాలి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
