close

తాజా వార్తలు

రివ్యూ: పడి పడి లేచె మనసు 

రివ్యూ: పడి పడి లేచె మనసు 

సినిమా పేరు: ప‌డి ప‌డి లేచె మ‌న‌సు

న‌టీన‌టులు: శ‌ర్వానంద్, సాయిపల్లవి, ముర‌ళీ శ‌ర్మ‌, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి, ప్రియారామ‌న్ త‌దిత‌రులు 

స‌ంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్ 

ఛాయాగ్ర‌హ‌ణం: జ‌య‌కృష్ణ గుమ్మ‌డి 

కూర్పు: ఎ.శ్రీక‌ర్‌ప్ర‌సాద్‌ 

సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, కృష్ణ‌కాంత్ 

నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి 

ద‌ర్శ‌కుడు: హ‌ను రాఘ‌వ‌పూడి 

సంస్థ‌: శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్

విడుద‌ల‌: 21 డిసెంబ‌రు 2018

ప్రేమ‌క‌థా చిత్రాలు తీయ‌డంలో తానెంత ప్ర‌త్యేక‌మో తొలి రెండు సినిమాలతో చాటి చెప్పారు హ‌ను రాఘ‌వ‌పూడి. శ‌ర్వానంద్ కూడా ప్రేమ‌క‌థ‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోగ‌ల‌న‌ని ‘మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు’తో నిరూపించారు. ఈ ఇద్ద‌రి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మ‌రొక ప్రేమ‌క‌థే ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’. సాయిప‌ల్ల‌వి కూడా తోడవ‌డంతో సినిమా విడుద‌ల‌కి ముందే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌చార చిత్రాల‌తో మ‌రిన్ని అంచ‌నాలు పెంచేసింది. మ‌రి అస‌లు చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం ప‌దండి... 

రివ్యూ: పడి పడి లేచె మనసు 

క‌థేంటంటే: సూర్య (శ‌ర్వానంద్‌) ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. తొలి చూపులోనే వైద్య విద్యార్థిని అయిన వైశాలి (సాయిప‌ల్ల‌వి)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. సూర్య ప్రేమ‌లో నిజాయ‌తీని గ‌మ‌నించిన వైశాలి కూడా అత‌న్ని ప్రేమిస్తుంది. ఇంత‌లో వైశాలి మెడిక‌ల్ క్యాంప్ కోస‌మ‌ని నేపాల్ వెళుతుంది. ఆమెను వెతుక్కుంటూ వెళ‌తాడు సూర్య‌. వైశాలి పెళ్లి ప్రస్తావ‌న తెస్తుంది. పెళ్లి అంటే రాజీప‌డి బ‌త‌క‌డ‌మని... పెళ్లి కాకుండా ప్రేమ‌లో మాత్ర‌మే సంతోషంగా ఉంటామ‌ని సూర్య చెబుతాడు. క‌లిసుండ‌క‌పోతే చ‌చ్చిపోతామ‌నుకున్న‌ప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని, ఏడాది త‌ర్వాత కూడా ఇద్ద‌రికీ అలా అనిపించిన‌ప్పుడు, ఇక్క‌డే పెళ్లి చేసుకుందామ‌ని చెబుతాడు. సూర్య అలా చెప్ప‌డానికి కార‌ణ‌మేమిటి? అప్పుడు విడిపోయిన ఆ ఇద్ద‌రూ మ‌ళ్లీ  క‌లిశారా? వైశాలి కోసం ఏడాది త‌ర్వాత నేపాల్ వెళ్లిన సూర్య‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే: సంక్లిష్ట‌త‌తో కూడిన ప్రేమ‌క‌థ ఇది. పేరుకు త‌గ్గ‌ట్టుగానే రెండు మ‌న‌సులు ప్రేమ‌లో ప‌డి ప‌డి లేస్తాయి. ఒక‌సారి ప్రేమ‌లో ప‌డ‌టం స‌గ‌టు సినిమాల్లో చూసిందే. కానీ ఇందులో రెండుసార్లు ఒక‌రినొక‌రు ప్రేమించుకోవ‌డ‌మే ప్ర‌త్యేక‌త‌. ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి త‌న మార్క్‌ను,  మేధస్సునీ ప్ర‌ద‌ర్శిస్తూ క‌థ‌, క‌థ‌నాన్ని నడిపించారు. అందులో కొత్త‌ద‌నం క‌నిపించినా... చాలా స‌న్నివేశాలు సామాన్య ప్రేక్ష‌కుడికి అర్థం కాని, అందుకోలేని విధంగా అనిపిస్తాయి. తొలి స‌గ‌భాగం సూర్య‌, వైశాలి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల‌తో సాగుతుంది. కోల్‌క‌తా నేప‌థ్యం కొత్త అనుభూతిని పంచుతుంది. భయంగా ఉన్నట్లు న‌టిస్తూ ప్రేమించ‌డం అనే కాన్సెప్ట్ కొత్త‌గానే ఉన్న‌ప్ప‌టికీ... దాని చుట్టూ అల్లిన స‌న్నివేశాల్లో మాత్రం కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదు. హాస్యం కోసం చేసిన ప్ర‌య‌త్నాలు కూడా పెద్ద‌గా ఫ‌లించ‌లేదు. విరామానికి ముందు నేపాల్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు మాత్రం చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. అయితే ద్వితీయార్ధంలో ప్రేమ‌జంట మ‌రోసారి ప్రేమించుకోవాల్సి రావ‌డంతో... తొలిభాగంలోని స‌న్నివేశాల్నే మ‌రోసారి తెర‌పై చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది. హాస్యం కోసం చేసిన ప్ర‌య‌త్నాలూ ఆకట్టుకోలేదు. మెమొ‌రీ లాస్ చుట్టూ అల్లిన డ్రామా క‌థ‌కి కీల‌కం. 

ఎవ‌రెలా చేశారంటే: శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌విల న‌ట‌న చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. వారిద్ద‌రూ త‌మ పాత్ర‌ల‌కి ప్రాణం పోశారు. తెర‌పై సూర్య‌, వైశాలి పాత్రలే క‌నిపిస్తాయి. ప్రేమ‌క‌థ‌ల‌కి కెమిస్ట్రీ కీల‌కం. శ‌ర్వా, సాయిప‌ల్ల‌విల మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పండింది. ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్‌, సునీల్ త‌దిత‌ర హాస్య‌బృందం ప‌రిధి మేర‌కు న‌వ్వించింది. ప్రియా రామ‌న్ క‌థానాయ‌కుడికి త‌ల్లిగా క‌నిపించింది. ఆమె పాత్ర‌కి ప్రాధాన్యం ప‌రిమిత‌మే అయినా చ‌క్క‌టి భావోద్వేగాలు పండించింది. ముర‌ళీ శ‌ర్మ క‌థానాయిక తండ్రిగా క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌త స్థాయిలో ఉంది. జ‌య‌కృష్ణ గుమ్మ‌డి కెమెరా కోల్‌క‌తా, నేపాల్ అందాల్ని, భూకంపం నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని చాలా బాగా చూపించింది. పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా చాలా బాగుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం తాజాద‌నాన్ని పంచింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి రాసుకున్న క‌థ, క‌థ‌నాలు కొత్త‌గానే ఉన్న‌ప్ప‌టికీ.. వాటిల్లో సంక్లిష్ట‌త చాలాసార్లు గంద‌ర‌గోళంగా అనిపిస్తుంది. 

రివ్యూ: పడి పడి లేచె మనసు 

బ‌లాలు:

+ క‌థా నేప‌థ్యం

+ శ‌ర్వా, సాయిప‌ల్ల‌విల న‌ట‌న

+ పాట‌లు 

+ ఛాయాగ్ర‌హ‌ణం

+ విరామానికి ముందు స‌న్నివేశాలు 

బ‌ల‌హీన‌త‌లు:

- ద్వితీయార్ధం 

- అతకని బ్రేకప్‌ సన్నివేశాలు

చివ‌రిగా: కొత్త నేప‌థ్యంలో సాగే ఓ ప్రేమ‌క‌థ‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.