close

తాజా వార్తలు

అయోధ్య కాండలో...తెలుగింటి ఆడపడుచులు

అనుకున్న లక్ష్యం దిశగా రామబాణంలా దూసుకుపోయిన మహిళలు వాళ్లు. అనుకోని కేసులో భాగస్వామ్యమయ్యారు. సర్వశక్తులూ ఒడ్డి స్త్రీశక్తిని చాటారు. అయోధ్య కేసులో తలపడిన..తలలు పండిన న్యాయవాదులతో కొందరు జూనియర్లూ పనిచేశారు. అందులో ఓ ఇద్దరు తెలుగు వనితలు. వారి పేర్లు విఎన్‌ఎల్‌ సింధూర, గవర్రాజు ఉషశ్రీ. అతిరథ న్యాయవాదులు, ఆరితేరిన వాదనలు... అన్నింటా వెన్నంటి ఉండి ఔరా! అనిపించుకున్నారు. ఆ మహిళామణుల అంతరంగం ‘వసుంధర’కు ప్రత్యేకం.


ఇంట్లో అంతా న్యాయవాదులే...
- విఎన్‌ఎల్‌ సింధూర

అయోధ్య కేసు... అంటేనే ఎంతటి ప్రతిష్ఠాత్మకమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం దేశంమొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. అలాంటి కేసులో పనిచేసిన సీనియర్‌ లాయర్‌ పీఎస్‌ నరసింహ దగ్గర జూనియర్‌గా  చేసే అవకాశం నాకు రావడం అదృష్టంగానే భావిస్తున్నా. ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడంలో నా పాత్రా ఉన్నందుకు గర్వంగా అనిపిస్తోంది. గతేడాది నవంబరు నుంచి ఈ పని ప్రారంభమైనా... ఈ సంవత్సరం మే నుంచి ఇంకా ఎక్కువగా కష్టపడ్డాం. దాంతో మా బృందమంతా రాత్రీపగలు అనే తేడా లేకుండా శ్రమించాల్సి వచ్చింది. అక్టోబరు నుంచి రోజూవారీ విచారణ మొదలైనప్పుడు పని పెరిగింది. ఈ కేసు వాదోపవాదాల్లో ప్రతిరోజూ బెంచ్‌ సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేసేది. తీర్పు దగ్గరపడేకొద్దీ అయిదుగంటల వరకు బెంచ్‌ కొనసాగింది. ఆ తరువాతే మా అసలు పని మొదలయ్యేది. ఆ రోజు జరిగిన వాదనల్లో మేం సమర్పించిన అంశాలకు మరో కొత్తది తోడయ్యేది. దానిపై పరిశోధన, విశ్లేషణ, చర్చలు జరిగేవి. ఉదయం ఎనిమిదిన్నరకు మా విధులు మొదలైతే, రాత్రి వరకు అవి సాగేవి. ఈ కేసు ద్వారా ఎన్నో కొత్త విషయాలు, కోణాలు తెలుసుకున్నాం. ఏ రోజూ అవేవీ భారంగా అనిపించలేదు. మా సీనియర్‌ న్యాయవాదులకు అవసరమయ్యే ఎన్నో విషయాలకు సంబంధించిన వివరాలను సేకరించి అందించడంలో చాలా చురుగ్గా ఉండేవాళ్లం. మేం పరిశోధించి, విశ్లేషించిన ప్రతీ అంశాన్ని డిజిటలైజేషన్‌ చేయడం, ఏరోజుకారోజు మారే విషయాలకు తగ్గట్లుగా సమాచారాన్ని అప్పటికప్పుడు అందించడం మా విధుల్లో భాగం. జీవితాంతం శిక్షణ తీసుకున్నంత అనుభవం ఈ ఒక్క కేసు ద్వారా పొందాం. తీర్పు ప్రకటించిన తరువాత మా కష్టం వృథాపోలేదని అనిపించింది. చాలా ఆనందంగా అనిపించినా... అంతలోనే రేపటి నుంచి ఈ పని ఉండదనే బాధ ఒక్కక్షణం కలిగింది. ఈ కేసులో నా పాత్రా ఉందనుకున్నప్పుడల్లా ఏదో సాధించాననే సంతృప్తి. ఇలాంటి అనుభవం మరే కేసులోనూ దొరకదు.


నాన్నను చూసే: మాది హైదరాబాద్‌. నాన్న గోపాలకృష్ణమూర్తి. అప్పటి హైదరాబాద్‌ కోర్టులో సీనియర్‌ కౌన్సిల్‌గా ఉండేవారు. చిన్నప్పటి నుంచి నాన్నను చూసిన నేను... ఇదే నా కెరీర్‌ అనుకున్నా. పుణెలో బీఎస్‌ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి, నాన్నతో కలిసి ఇక్కడ కోర్టులో పని చేసేదాన్ని. ఆ తరువాత న్యాయవాది యోగేష్‌రావితో పెళ్లై, దిల్లీ వెళ్లా. అత్తగారింట్లోనూ అంతా న్యాయవాదులే. మూడేళ్లక్రితం దిల్లీ కోర్టులో సీనియర్‌ న్యాయవాది శ్రీధర్‌ పోతురాజు దగ్గర జూనియర్‌గా పనిచేశా. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పీఎస్‌ నరసింహ దగ్గర చేస్తున్నా. న్యాయవాది అయినా... నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఉమా రామారావు శిష్యరికంలో కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నా. దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చా. ఇప్పుడూ అవకాశం ఉన్నప్పుడల్లా ప్రదర్శనలు ఇస్తుంటా.


రామ్‌లల్లా అని పిలుచుకునేవాళ్లం...

- గవర్రాజు ఉషశ్రీ

మేం అయోధ్య కేసును రామ్‌లల్లా అనీ పిలుచుకునేవాళ్లం. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ కేసు వాదనలు మొదలవడంతో మా అసలు పని ప్రారంభమైంది. గతేడాది సీనియర్‌ న్యాయవాదులు శ్రీధర్‌ పోతురాజు వద్ద జూనియర్‌గా చేరడంతో ఈ కేసులో భాగం అయ్యే అవకాశం వచ్చింది. జూనియర్‌ న్యాయవాదులమంతా ఓ బృందంగా కలిసి పని చేసేవాళ్లం. పరిశోధనాపరంగా ఎంతో కష్టపడ్డాం. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని కీ వర్డ్స్‌ను శోధించడం, వాటిని మళ్లీ విశ్లేషించడం... తరువాత నివేదికలను తయారుచేసి సీనియర్‌ న్యాయవాదికి అందించడం మా పని. లీగల్‌ నోట్స్‌ తయారుచేయడం, డ్రాఫ్టింగ్‌ వర్క్‌, టైపింగ్‌ సహా పరిశోధనల్ని నేను చేసేదాన్ని. తీర్పు తేదీ దగ్గర పడేకొద్దీ మా పని పెరిగింది. ఎప్పటికప్పుడు ఆ రోజు వాదనల్లో వచ్చే అంశాలను విశ్లేషించే పని మాకు అప్పగించేవారు. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత మాది. అర్ధరాత్రి వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఉడతాభక్తిగా   చేసినా... ఈ కేసు ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. తక్కువ సమయంలో స్మార్ట్‌గా పనిచేయడం, పనిలో వేగం, చురుగ్గా ఉండటం, సహనం వంటివెన్నో నాకు ఇకపై ఉపయోగపడతాయని అనుకుంటున్నా. జీవితాంతం పనిచేసినా... ఇంత అనుభవం రాదేమో. మా సీనియర్‌ న్యాయవాది శ్రీధర్‌   అందించిన సహకారం, నేను చేసిన ప్రతి పనిని మెచ్చుకుంటూ... ప్రోత్సహించడం ఎప్పటికీ మర్చిపోలేను. తీర్పు ప్రకటించిన రోజు కలిగిన ఆనందం అంతాఇంతా కాదు. ఈ కేసులో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞురాలినే.


ఆసక్తితో ఇటువైపు... మాది భీమవరం. బీటెక్‌, ఆ తరువాత ఎంబీఏ పూర్తి చేశా. న్యాయవాది అవ్వాలనుకుని ఎల్‌ఎల్‌బీ చదివా. నాన్న జి.నారాయణరాజు. దిల్లీ, మినిస్ట్రీ ఆఫ్‌ లా అండ్‌ జస్టిస్‌ లెజిస్లేటివ్‌ విభాగానికి సెక్రటరీగా పనిచేసేవారు. 2016లో అమ్మతో కలిసి దిల్లీ వెళ్లా. అయోధ్య కేసులో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు నాన్న ఒకటే చెప్పారు. ‘నిన్ను నువ్వు మెరుగుపరచుకోవడానికి ఇది సరైన అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకో’ అన్నారు. నాన్న మాటల్ని తు.చ. తప్పకుండా పాటించా. ఈ కేసు నాలో ఆత్మవిశ్వాసాన్నీ పెంచింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.