దేశానికి తెలంగాణే స్ఫూర్తి

ప్రధానాంశాలు

దేశానికి తెలంగాణే స్ఫూర్తి

పాలనలో కేంద్రం, ఇతర రాష్ట్రాలు మనల్ని అనుసరిస్తున్నాయి
గుర్తుండిపోయేలా ప్లీనరీ నిర్వహిస్తాం
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో స్ఫూర్తి పొంది వాటిని కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని చూసి సరిహద్దులోని ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో కలిసేందుకు ముందుకొస్తున్నారన్నారు. ఒకప్పుడు ‘నేడు బెంగాల్‌ చేసే పనిని రేపు భారత్‌ చేస్తుంది’ అనే నినాదం ఉండేదని, ఇప్పుడు ‘తెలంగాణ ఏం చేస్తుందో.. రేపు భారత్‌ అదే చేస్తుంది’ అనేలా పరిస్థితి మారిందన్నారు. తెరాస 20 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని పార్టీ ద్విదశాబ్ది వేడుకతో పాటు, పార్టీ అధ్యక్ష ఎన్నిక..రెండు ముఖ్యమైన ఘట్టాలు నెలరోజుల్లో జరగనున్నాయన్నారు.

హైదరాబాద్‌  హెచ్‌ఐసీసీలో ఈ నెల 25న తెరాస ప్లీనరీని కలకాలం గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని తెలిపారు. గురువారం ఆయన హెచ్‌ఐసీసీలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణారావు, గాంధీ, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు బండి రమేశ్‌, గ్యాదరి బాలమల్లు, మేయర్‌ విజయలక్ష్మి, మాజీ మేయర్‌ రామ్మోహన్‌ తదితరులు, వివిధ విభాగాల అధికారులు ఆయన వెంట ఉన్నారు. హెచ్‌ఐసీసీ ప్రదర్శనశాలల వద్ద గల 8 ఎకరాల స్థలాన్ని చూశారు. వేదిక, సభాప్రాంగణం, ఆహ్వాన ప్రాంతం, నమోదు, భోజనశాల తదితరాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం ఆయన సన్నాహకాలపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రభుత్వ పరిపాలన దేశం గర్వించేరీతిలో, గొప్పగా సాగుతోంది. కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. రైతుబంధు పథకాన్ని చూసి కేంద్రం పీఎం కిసాన్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. మిషన్‌ భగీరథను చూసి జల్‌జీవన్‌ను తెచ్చింది.  టీఎస్‌ ఐపాస్‌ నుంచి స్ఫూర్తి పొంది ఇన్వెస్ట్‌ ఇండియా ప్రారంభించింది’’ అని అన్నారు.  ప్లీనరీ నిర్వహణకు సంబంధించి ఈనెల 17న పార్టీ శాసనసభ, పార్లమెంటు సభ్యుల సమావేశం నిర్వహిస్తామని  కేటీఆర్‌ వెల్లడించారు. ప్రజాప్రతినిధులకు పాసులు ఇస్తామన్నారు. పాసులు, గుర్తింపు కార్డులున్న వారినే ప్లీనరీకి అనుమతిస్తామన్నారు.

ప్లీనరీకి కమిటీలు..

ప్లీనరీ కోసం పార్టీ తరఫున కమిటీలను ఏర్పాటు చేశామని కేటీఆర్‌ వెల్లడించారు. మంత్రి సబితారెడ్డి నేతృత్వంలో రంజిత్‌రెడ్డి, అరికపూడి గాంధీ, విజయలక్ష్మిలతో ఆహ్వానకమిటీ, గ్యాదరి బాలమల్లు అధ్యక్షతన మాగంటి గోపీనాథ్‌, నవీన్‌ కుమార్‌, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొంతు రామ్మోహన్‌లతో సభా ప్రాంగణ కమిటీ,  ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు నాయకత్వంలో వాలంటీర్ల కమిటీ, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ ప్రధానకార్యదర్శి బండి రమేశ్‌లతో పార్కింగు కమిటీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన భోజన కమిటీ ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ అధ్యక్షతన కర్నె ప్రభాకర్‌తో మీడియా కమిటీలుంటాయన్నారు. నగర అలంకరణ, హోర్డింగుల ఏర్పాట్ల కోసం మంత్రులు తలసాని, మల్లారెడ్డి, సబితారెడ్డి, మహమూద్‌ అలీల నేతృత్వంలో ఏర్పాట్లు సాగుతాయన్నారు.


17న తెరాస ప్రవాస విభాగాల సమావేశం

ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లోని తెరాస ప్రవాస విభాగాల ప్రతినిధులతో ఈ నెల 17న ఉదయం 9 గంటలకు దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త మహేశ్‌ బిగాల గురువారం తెలిపారు. హుజూరాబాద్‌ నుంచి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగిస్తారని వెల్లడించారు. హుజూరాబాద్‌ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ అభ్యర్థిత్వానికి ఎన్నారైలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని మహేశ్‌ చెప్పారు.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని