దొంగే అరుస్తున్నట్లుంది.. భాజపా వ్యవహారం!

ప్రధానాంశాలు

దొంగే అరుస్తున్నట్లుంది.. భాజపా వ్యవహారం!

దళితబంధును ఆపిన వారిది పది రోజుల ఆనందం
హుజూరాబాద్‌ ప్రచార సభల్లో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: ‘‘దళితబంధును ఆపిన భాజపా కేవలం పది రోజులపాటు ఒక రకమైన ఆనందాన్ని పొందొచ్చు.. అంతిమంగా అందరికి పథకం ఫలాలు అందుతాయి’’అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట సహా పలుచోట్ల నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడుతూ.. దొంగతనం చేసిన వ్యక్తే ‘దొంగా..దొంగా’ అని అరుస్తున్నట్లుగా భాజపా వ్యవహారముందని ఆక్షేపించారు. దళితబంధును ఆపమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి కోరారని.. భాజపా దళిత, గిరిజన, ముస్లిం, క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని హరీశ్‌రావు ఆరోపించారు. మాణికం ఠాగూర్‌ హుజూరాబాద్‌ ప్రచారానికి వచ్చి తెరాసను తిట్టిపోస్తున్నాడని.. కాంగ్రెస్‌, భాజపాలు ఒక్కటయ్యాయి అనేందుకు ఈ సంఘటనే నిదర్శనమన్నారు. వారిది రహస్య ఒప్పందమని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల తరువాత దళితబంధు యథావిధిగా అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రమంత్రులు వచ్చి హుజూరాబాద్‌ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో పలుకుబడి ఉంటుందన్న ఈటల రాజేందర్‌ పెరిగిన ధరల్ని తగ్గించగలరా..? అంటూ ప్రశ్నించారు. కార్మికుల శ్రమను దోచుకునే పార్టీ భాజపా అని.. కొన్నిరోజుల్లోనే 16 సార్లు ఇంధన ధరల్ని పెంచిన భాజపాకు ఎందుకు ఓటు వెయ్యాలని ఆయన ప్రశ్నించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని