భారత్‌ చిరస్మరణీయ విజయం..
close

తాజా వార్తలు

Updated : 19/01/2021 16:14 IST

భారత్‌ చిరస్మరణీయ విజయం..

బ్రిస్బేన్‌: టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో రిషభ్‌ పంత్‌ (89నాటౌట్‌; 138 బంతుల్లో 9x4, 1x6), వాషింగ్టన్‌ సుందర్‌(22) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు.

ఆదిలో నెమ్మదిగా ఆడినా..

4/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మంగళవారం ఐదోరోజు ఆట కొనసాగించిన టీమ్‌ఇండియా ఆదిలోనే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(7) వికెట్‌ కోల్పోయింది. అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ (91;146 బంతుల్లో 8x4,2x6), పుజారా(56; 211 బంతుల్లో 7x4) జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు. అప్పటికి టీమ్‌ఇండియా స్కోర్‌ 83/1గా నమోదైంది. భోజన విరామం తర్వాత ధాటిగా ఆడిన గిల్ శతకానికి చేరవలో ఉండగా లైయన్‌ బౌలింగ్‌లో స్మిత్‌ చేతికి చిక్కాడు. దీంతో 114 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే కెప్టెన్‌ అజింక్య రహానె(24) పెవిలియన్‌ చేరాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆపై రెండో సెషన్‌ పూర్తయ్యే సమయానికి భారత్‌ 183/3తో నిలిచింది.

పంత్‌, సుందర్‌ మెరుపు బ్యాటింగ్‌..

ఇక మూడో సెషన్‌లో టీమ్‌ఇండియా విజయానికి 144 పరుగులు చేయాల్సి ఉండడంతో మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందని అంతా అనుకున్నారు. పుజారా, పంత్‌ ఆ విధంగానే ఆడారు. వారిద్దరూ వికెట్‌ కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే, జట్టు స్కోర్‌ 228 పరుగుల వద్ద పుజారా నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే మయాంక్‌ అగర్వాల్‌ (9) స్వల్ప స్కోరుకు పెవిలియన్‌ చేరాడు. అప్పటికి టీమ్‌ఇండియా 265/5 స్కోర్‌తో నిలిచింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలోనే భారత్‌ విజయానికి 62 పరుగులు అవసరమైన వేళ పంత్‌తో జోడీకట్టిన వాషింగ్టన్‌ సుందర్‌(22; 29 బంతుల్లో 2x4,1x6) ధాటిగా ఆడాడు. పంత్‌ సైతం బౌండరీలు బాదడంతో టీమ్‌ఇండియా విజయానికి చేరువైంది. ఈ క్రమంలోనే సుందర్, శార్దూల్‌ ఠాకూర్‌ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. అప్పటికే భారత్‌ గెలుపు ఖాయమైంది. హేజిల్‌వుడ్‌ వేసిన 97వ ఓవర్‌ చివరి బంతికి బౌండరీ కొట్టిన పంత్‌ భారత్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. దీంతో పంత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 369 ఆలౌట్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 336 ఆలౌట్‌

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 294 ఆలౌట్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 329/7

ఇవీ చదవండి..

అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు.. 

ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని