
తాజా వార్తలు
ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
విజయానికి 324 పరుగుల దూరంలో భారత్
ఇంటర్నెట్‌డెస్క్: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న భారత్×ఆస్ట్రేలియా నిర్ణయాత్మక చివరి టెస్టుకు వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆటలో 23 ఓవర్లు తుడిచిపెట్టుకుపోయాయి. తొలిరోజు ఆటలో కూడా వర్షం కారణంగా ఓ సెషన్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితేనేం, నాలుగో రోజు ఆటలో భారత్‌దే పైచేయి. చారిత్రక విజయానికి టీమిండియా 324 పరుగుల దూరంలో నిలిచింది.
21/0 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా.. మహ్మద్ సిరాజ్ (5/73), శార్దూల్ ఠాకూర్ (4/61) ధాటికి 294 పరుగులకే కుప్పకూలింది. స్టీవ్‌స్మిత్ (55), వార్నర్ (48) టాప్ స్కోరర్లు. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని టీమిండియా ముందు ఆతిథ్య జట్టు 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి 1.5 ఓవర్లకు 4/0తో నిలిచింది. తొలి ఓవర్లోనే రోహిత్ (4*) బౌండరీ బాది మంచి లయలో ఉన్నట్లు కనిపించాడు. గిల్ జాగ్రత్తగా ఆడుతున్నాడు.
చెలరేగిన సిరాజ్, శార్దూల్
ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (48), హ్యారిస్ (38) తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్, స్మిత్ వేగంగా పరుగులు సాధిస్తూ తమ ఉద్దేశాన్ని చెప్పారు. కానీ సిరాజ్ ఒకే ఓవర్లో లబుషేన్, వేడ్‌ను ఔట్ చేసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. దీంతో ఆసీస్ లంచ్ విరామానికి ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేసింది.
అనంతరం గ్రీన్ (37)తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయిదో వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. గ్రీన్ జాగ్రత్తగా ఆడగా, స్మిత్ వేగంగా ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న స్మిత్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పైన్‌తో కలిసి గ్రీన్ నిలకడగా ఆడటంతో ఆసీస్ 227/5తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే శార్దూల్‌తో కలిసి సిరాజ్ చెలరేగడంతో 294 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది.
స్కోరు వివరాలు
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 369
భారత్ తొలి ఇన్నింగ్స్: 336
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 294
భారత్ రెండో ఇన్నింగ్స్: 4/0