
తాజా వార్తలు
భారత్ విజయం అమితానందాన్నిచ్చింది: మోదీ
దిల్లీ: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ చారిత్రక విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ట్విటర్ వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. ఈ విజయం అమితానందాన్నిచ్చిందని ఆటగాళ్లను కొనియాడారు.
‘‘ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించడం అత్యంత సంతోషాన్ని కలిగించింది. ఆటగాళ్ల ఎనర్జీ, ఆట పట్ల తమకున్న అభిరుచి, పట్టుదల, గెలవాలనే సంకల్పం టోర్నీ ఆద్యంతం ప్రతిబింబించింది. టీమిండియాకు అభినందనలు. రాబోయే టోర్నీల్లోనూ మీరు మరిన్ని విజయాలు సాధించాలి’’ అని మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు.
కేసీఆర్, జగన్, కేటీఆర్, పవన్ అభినందనలు
ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభినందనలు తెలియజేశారు. జట్టులో కీలక ఆటగాళ్లు గాయాల బారినపడినా పరిమిత వనరులతో ఇండియా జట్టు అద్భుతం చేసిందని కేసీఆర్ ప్రశంసించారు. ఈ విజయం చిరస్మరణీయంగా మిగిలిపోతుందన్నారు. కెప్టెన్ రహానే, జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గబ్బా టెస్టులో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. జట్టుకు అభినందనలు తెలిపారు. దేశం గర్వించే విజయం సాధించారని జగన్ కొనియాడారు.
అటు మంత్రి కేటీఆర్ కూడా టీమిండియాను ప్రశంసించారు. ‘‘అద్భుతమైన జట్టు.. అసాధారణమైన గేమ్!! టీమిండియా.. మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం. 2021 సంవత్సరాన్ని అద్భుతంగా ప్రారంభించారు’’ అని కేటీఆర్ కొనియాడారు. ఆస్ట్రేలియాపై ఆ దేశంలోనే భారత జట్టు సిరీస్ గెలుపొందడం చరిత్రాత్మకమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. టీమ్ ఇండియాకు తనతో పాటు జనసేన తరఫున అభినందనలు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన ఈ విజయం యువక్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతుందన్నారు. కీలక ఆటగాళ్లు గాయాలపాలైనా.. అంతర్జాతీయ వేదికలపై తొలి అడుగులు వేస్తున్న ఆటగాళ్లు చూపిన ప్రతిభ, కలసికట్టుగా విజయం కోసం పోరాడిన విధానం ప్రశంసనీయమని పవన్ కొనియాడారు.
ఇవీ చదవండి..
ధోనీని అధిగమించి పంత్ కొత్త రికార్డు..