close

త్రిమూర్తులు... ఒకే శిలపైన!

ఏ ఊళ్లోనూ బ్రహ్మదేవుడి ఆలయాలు కనిపించవు. అలాగే శివకేశవులు ఒక చోట ఉండటమూ అరుదే. తిరుపతి దగ్గర గుడిమల్లంలోని పరశురామేశ్వరస్వామి ఆలయంలో మాత్రం త్రిమూర్తులు ఒకే విగ్రహంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు.
లయాలను ఎక్కువశాతం చతురస్రాకారంలో నిర్మించినా... పరశురామేశ్వరాలయం మాత్రం ఏనుగు వెనుక భాగాన్ని పోలి ఉంటుంది. అంతరాలయం ముఖ మండపం కంటే గర్భాలయం లోతులో ఉంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన పీఠంలోనే స్వామి ఉంటాడు. స్వామికి అభిషేకం చేసిన నీరు వెళ్లేందుకు చిన్నరంధ్రం ఉన్నా... ఆ నీరు ఎటు వెళ్తుందో ఎవరికీ అంతుచిక్కదు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు మారేటప్పుడు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకేలా ఆలయాన్ని నిర్మించారు. అంతరాలయ గోడలపై గణపతి, దక్షిణామూర్తి, అభయహస్త వేంకటేశ్వరస్వామి, చతుర్ముఖ బ్రహ్మ, చండీశ్వరుడు, విష్ణుదుర్గ కొలువై ఉంటారు. ఈ నిర్మాణాలు ప్రధానంగా పల్లవులూ చోళుల శిల్పశైలిని పోలి ఉంటాయి. ఇక్కడ తూర్పు నుంచి పడమరకు దర్శనమిచ్చేలా సూర్య దేవుడి ఆలయం ఉంటుంది.. పక్కనే ఆనందవల్లి అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఉంటాయి. ఈ గుడి మండపం దక్షిణాన ఉండటంతో దాన్ని ద్వారశిల ముఖద్వారం అంటారు. దేవాలయ విమానతలం ఇటుకలతో కట్టిన లింగం లాగా ఉండటంతో దాన్ని లింగాకృతి విమానంగా పిలుస్తారు. 1911లో గోపీనాథ్‌ అనే పురావస్తు శాస్త్రవేత్త గుడిమల్లం ఆలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినా... దీన్ని ఎవరు నిర్మించారో చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు.
ఉజ్జయినిలో లభించిన రాగి నాణేలపైన ఈ విగ్రహాన్ని పోలిన చిత్రం ఉంది. మధురలోని పురాతన వస్తు ప్రదర్శనశాలలోనూ అలాంటి విగ్రహమే కనిపిస్తుంది. క్రీ.శ.842 నుంచీ చోళులూ, పల్లవులూ, రాయల చంద్రగిరి రాజుల కాలం వరకూ ఈ గుళ్లో విశేష పూజలు జరిగేవట.
తరువాత కూడా కొన్నాళ్లు కొనసాగినా... 1954 నుంచి పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది. అప్పటినుంచి 2009 వరకు ఏ పూజలూ జరగలేదు. గ్రామస్థులు పోరాడడంతో 2009 నుంచి మళ్లీ పూజలు జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తారు.
స్థల పురాణం
తండ్రి ఆజ్ఞమేరకు పరశురాముడు తల్లిని సంహరించినా... తండ్రి ఇచ్చిన వరంతోనే మళ్లీ తల్లిని బతికించుకుంటాడు. ఆ తరువాత తల్లిని సంహరించిన పాపం నుంచి ప్రాయశ్చిత్తం కోసం రుషులను కలిస్తే... వారు తపస్సు చేయాలని సలహా ఇస్తారు. దాంతో దట్టమైన అరణ్యంలో పరశురాముడు ఓ వైపు తపస్సు చేస్తూనే మరోవైపు శివలింగానికీ నిత్యం పూజలు జరిపిస్తుంటాడు. ఇందుకోసం ఓ సరోవరాన్నీ సృష్టించుకుంటాడు. అందులో రోజుకో పుష్పమే పూసేది. ఆ పువ్వుతోనే శివుడికి అభిషేకం చేసేవాడు. బ్రహ్మ భక్తుడైన చిత్రసేనుడనే ఓ యక్షుడిని సరోవరంలోని పుష్పానికి కాపలాగా ఉంచుతాడు. ఓ రోజు పరశురాముడు సరోవరానికి రావడం ఆలస్యమవుతుంది. దీంతో యక్షుడు పుష్పాన్ని తెంపి శివుడికి పూజచేస్తాడు. ఆలస్యంగా అక్కడికి చేరుకున్న పరశురాముడు పుష్పం లేకపోవడంతో యక్షుడిపై కోపంతో అతడితో యుద్ధానికి తలపడతాడు. ఆ మహా సంగ్రామం పద్నాలుగేళ్లు సాగుతుంది. వారి మధ్య పోరు ఎంతకీ తెగకపోవడంతో పరమశివుడు ప్రత్యక్షమై... ఇద్దరి భక్తికీ మెచ్చి, రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు. అప్పటినుంచీ యక్షుడి రూపంలో బ్రహ్మ, విష్ణువుగా పరశురాముడు, శివుడు ఒకే విగ్రహంలో పరశురామేశ్వరస్వామి రూపంలో ఉద్భవిస్తారు. యుద్ధ సమయంలో అక్కడ భారీ గుంత ఏర్పడుతుంది. దీంతో ఆ ప్రాంతానికి గుడిపల్లం అనే పేరు వచ్చింది. క్రమంగా అదే గుడిమల్లంగా మారింది. ఇక్కడ స్వామివారికి యజ్ఞోపవీతం ఉండదు.

ఏకశిలపై...
ప్రపంచమంతటా శివాలయాల్లో పరమేశ్వరుడు లింగరూపంలోనే దర్శనమిస్తే... ఇక్కడ మాత్రం పురుషాంగం ఆకారంలో కనిపిస్తాడు. కింద యక్షుడి రూపంలోని బ్రహ్మ, మధ్యలో పరశురాముడిగా విష్ణువు, లింగ రూపంలో పైన శివుడు ఒకే విగ్రహంలో కొలువై ఉంటారు. వేటకు గుర్తుగా పరశురాముడి ఓ చేతిలో మృగం తల, మరో చేతిలో పానీయం ఉంటుంది. భుజంపైన గొడ్డలి ధరించి ఉంటాడు. చెవులకు రింగుల లాంటి ఆభరణాలు ఉంటాయి. స్వామివారు జుట్టును తలపాగాలాగా చుట్టుకుని ఉంటాడు. విగ్రహంపైన నాగపడగ ఉంటుంది. ఈ విగ్రహం రెండో శతాబ్దం నాటి దైవారాధనను తెలియజేస్తోంది.
ఎలా చేరుకోవాలంటే...
తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి 22 కిలోమీటర్లు, రేణిగుంట స్టేషన్‌ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం. విమానాశ్రయం నుంచి 16 కిలోమీటర్లూ శ్రీకాళహస్తికి 32 కిలోమీటర్లు దూరంలో గుడిమల్లం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా రేణిగుంటకి చేరుకోవాలి. అక్కడినుంచి బస్సుల్లో కానీ, ఆటోల్లో కానీ ఆలయానికి చేరుకోవచ్చు.

- మాలోతు సురేష్‌, ఈనాడు జర్నలిజం స్కూలు


కర్పూర హారతి ఎందుకంటే?

ఇంట్లోనే కాదు, గుళ్లో కూడా పూజంతా అయ్యాక దేవుడికి కర్పూరంతో హారతి ఇవ్వడం, దాన్ని మనం కళ్లకు అద్దుకోవడం ఓ సంప్రదాయంగా పాటిస్తాం. ఇలా హారతి ఇవ్వడం వెనుక ఆధ్యాత్మిక చింతనే కాదు, శాస్త్రం కూడా ఉంది. శుభప్రదంగా ఇచ్చే హారతిని మంగళహారతి అని అంటారు. కర్పూరం వెలిగించిన కొన్ని క్షణాలకు అది ఉత్పతనం చెందుతుంది. అంటే... ఘనపదార్థం వాయుపదార్థంగా మారుతుంది. ‘కర్పూరం ఎలా అయితే కరిగిపోతుందో అదేవిధంగా మాలోని మలినాలూ లోపాలూ పోగొట్టుకుని మమ్మల్ని నీకు సమర్పించుకుంటున్నా’మని తెలియజేసేందుకే హారతి ఇచ్చి కళ్లకు అద్దుకుంటాం. శాస్త్రపరంగా చెప్పాలంటే... హారతిని గుండ్రంగా తిప్పడం వల్ల గాల్లో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. కలుషితమైన గాలి స్వచ్ఛంగా మారుతుంది. దాన్ని కళ్లకు అద్దుకున్నప్పుడు మనకు తెలియకుండానే కర్పూర వాసనను పీలుస్తాం. ఆ వాసన శ్వాస సంబంధ సమస్యల్ని నివారిస్తుందనీ కళ్లకూ చలువ చేస్తుందనీ చెబుతారు. కర్పూర వాసన మనసుకీ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. గుళ్లకు ఎక్కువమంది వస్తారు. దాంతో ఆ పరిసరాల్లో సూక్ష్మక్రిములూ చేరతాయి. హారతి తీసుకోవడం వల్ల ఆ కాలుష్యమూ తగ్గుతుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.