సృష్టి... శక్తి

అమ్మానాన్నలను మురిపిస్తుంది. బంధుమిత్రులను అక్కున చేర్చుకుంటుంది. బాధ్యతల్లో ఆకాశంలో సగమంటుంది. బంధంలో సర్వం తానవుతుంది. ఉన్న రెండు చేతులతోనే వంద పనులు చేస్తూ ఒక్క మెదడుతో వెయ్యి తలపోస్తూ.. ఆసరా అందిస్తూ.. బాసటగా నిలుస్తూ... ఆమె లేనిదే జీవం లేదు... జీవితమే లేదు...  ఆమె సకల చరాచర సృష్టికీ మూలం...  ఆమె ఆదిపరాశక్తి.

Published : 03 Mar 2022 00:45 IST

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అమ్మానాన్నలను మురిపిస్తుంది. బంధుమిత్రులను అక్కున చేర్చుకుంటుంది. బాధ్యతల్లో ఆకాశంలో సగమంటుంది. బంధంలో సర్వం తానవుతుంది. ఉన్న రెండు చేతులతోనే వంద పనులు చేస్తూ ఒక్క మెదడుతో వెయ్యి తలపోస్తూ.. ఆసరా అందిస్తూ.. బాసటగా నిలుస్తూ... ఆమె లేనిదే జీవం లేదు... జీవితమే లేదు...  ఆమె సకల చరాచర సృష్టికీ మూలం...  ఆమె ఆదిపరాశక్తి.

అతులంతత్ర తత్తేజః సర్వదేవశరీరజం
ఏకస్థం తదభూన్నారీ వ్యాపలోకత్రయం త్విషా

మహిషాసురమర్దినిగా ఆదిపరాశక్తి ఆవిర్భావ సందర్భంలోని శ్లోకమిది. ఆయా దేవతల శక్తియుక్తుల కలబోతగా అమ్మవారు రూపుదాల్చింది. ఆ శక్త్యంశే నేటి స్త్రీమూర్తి అంటే అతిశయం కాదు.

సకల కళలకు నిలయమైన వాణి, సమస్త లోకాలకూ సిరులనందించే పూబోణి లక్ష్మి స్త్రీకుల తిలకాలే. గౌరి పాణిగ్రహణంతోనే శివుడు అఖిల లోకాలకూ ఆదిదేవుడయ్యాడు.

రాధగా ప్రేమసాగరంలో ఓలలాడించినా, సీతగా సహనశీలబలంతో కన్నీటి సంద్రానికి ఎదురీదినా అది స్త్రీకే చెల్లింది.

‘న స్త్రీరత్న సమం రత్నం’ అన్నది చాణక్య సూత్రం కాగా.. ‘స్త్రీ మూలం హి ధర్మః’ అంటుంది మనుస్మృతి. ‘కరణేషు మంత్రీ’ అన్న ఒక్కమాటతో స్త్రీ నిర్ణయాలకు ఎంత గౌరవమిచ్చారో అర్థమవుతుంది. పురాణాలేవీ స్త్రీని దుర్బలగా చిత్రించలేదు. తన ధర్మాన్ని పాటించడంలో ఏ పాత్రా ఆత్మనిర్భరత కోల్పోలేదు.

సీత - సాధికారత

వనవాసానికి రాముడి వెంట కోరి మరీ వెళ్లింది సీత. రావణ ధిక్కారమే కాదు, నాటి పరిస్థితులననుసరించి అగ్నిప్రవేశమూ చేసింది. నిండు చూలాలిగా ఆశ్రమంలో అడుగుపెట్టి ఒంటిచేత్తో లవకుశులను పెంచి ప్రయోజకులను చేసి రాముడికి అప్పజెప్పింది. రాముడి పిలుపును సకారణంగా తిరస్కరించింది. ఇహపర ధర్మాలను సంతృప్తిగా నిర్వర్తించానని చెప్పి భూమిలో ఐక్యమైంది. ఇది స్త్రీగా తన నిర్ణయాలపై తనకున్న సాధికారతకు చిహ్నమే కదా!

న్యాయకోవిదులూ అవాక్కయ్యారు

మరపురాని మరో నారి ద్రౌపది. ద్రుపదుని వరపుత్రిక. స్వాభిమాన సుయోధనుడు, ద్రౌపది తనను ఎగతాళి చేసినట్లుగా భ్రమపడ్డాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. నిండు సభలో ద్రౌపదికి జరిగిన పరాభవం దుస్సహమే. తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా- అంటూ పాంచాలి అడిగిన ప్రశ్నకు న్యాయకోవిదులు సైతం జవాబివ్వలేకపోయారు. అరణ్య, అజ్ఞాతవాసాలను లెక్కచేయక పతులను అనుసరించిందామె. రోజంతా భీకర యుద్ధంలో పాల్గొని అలసి నిద్రిస్తున్న ఉపపాండవులను అధర్మంగా వధించిన అశ్వత్థామను సైతం క్షమించగలగడం ఆమెకే చెల్లింది. సైరంధ్రిగా విరాటుని కొలువులో సేవలందించిన, మహారాణిగా యావత్‌ భూమండలాన్ని పాలించినా స్థితప్రజ్ఞతతో మెలగడం ఆమెకే చెల్లింది. అలా ద్రౌపది శోకం ధార్తరాష్ట్రుల వినాశనానికి దారితీసింది.

ఇంద్రుడికి లొంగని దమయంతి

దమయంతి అపురూప సుందరి. దిక్పాలకులు సైతం తమ చూపులు నిలుపుకునేంతటి అందగత్తె. సాక్షాత్తు ఇంద్రుడే చేపడతానన్నా లొంగలేదు. మనసా వాచా ప్రేమించిన నలమహారాజునే వరించిన పట్టుదల ఆమె సొంతం. కలిదేవుని పట్ల నలుడు చేసిన అపచారమో గ్రహచారమో.. దుస్థితి కలిగినా నిబ్బరాన్ని కోల్పోలేదు. మదిలో గూడు కట్టుకున్న ఆవేదనతో అహల్య రాయిగా మారినా, ఆమె చేసిన తపస్సు నిజాన్ని నిరూపించింది. ఆ సహనమే ఆమె బలమైనది. నిండైన ప్రేమతో కృష్ణుణ్ణి సత్యభామ కొంగున ముడి వేసుకుంటే, భక్తితో తనవాడిని చేసుకుంది రుక్మిణి. స్త్రీ సహజ అపార ప్రేమకు ఇద్దరూ చిహ్నాలే. వైశాలి నగరవధువు ఆమ్రపాలి, బుద్ధుని అష్టాంగమార్గాన్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకుని ఆయన నుంచే ప్రశంసలందుకుంది.

వాళ్లకు వాళ్లే సాటి

యముణ్ణి సైతం మెప్పించి సత్యవంతుణ్ణి బతికించుకోవడమే కాక అత్తింటి గర్భశోకాన్ని నిలువరించింది సావిత్రి. కామంతో తప్పటడుగులు వేయబోతున్న భర్తకు మాటల చాతుర్యంతో అడ్డంకులు సృష్టించింది మండోదరి. జగద్గురు ఆదిశంకరులతో వాదనకు సిద్ధపడ్డ భర్త(మండనమిశ్రుడు) ఓటమి సహించలేని ఉభయభారతి తన సౌశీల్యంతో, ఆత్మవిశ్వాసంతో, శంకరుల విజయాన్ని కొద్దిసేపు ఆపి, సభలో పతి ప్రతిష్ఠను నిలబెట్టింది. ఛత్రపతి శివాజీ, ఆదర్శ పాలకుడైతే ఆయనను అంత మహోన్నతంగా తీర్చిదిద్దింది తల్లి జిజియాబాయి. వీరే కాదు, గార్గి, మైత్రేయి, అహల్య- ఇలా విశిష్ట మహిళలెందరో!

బాధలైనా, బాధ్యతలైనా సునాయాసంగా స్వీకరించగలిగే తత్వం స్త్రీలది. ఆ పరిధి భర్త, పిల్లలతోనే ముగిసిపోదు. జన్మభూమి, ప్రజల శ్రేయస్సు కోసం పోరాటానికి సిద్ధపడింది ఝాన్సీరాణి లక్ష్మీబాయి. రుద్రమదేవిని రుద్రదేవుడిలా పెంచుకున్నాడు గణపతిదేవుడు. ఆమె పురుషులకు దీటుగా ధీరతను చాటి చరిత్రలో నిలిచిపోయింది.

వ్యష్టి శ్రేయస్సు కాదు సమష్టి శ్రేయస్సే గొప్పదని ప్రాణత్యాగంతో తెలియజేసింది లకుమాదేవి.  

గగనంలో సగమనడంతోనే ఆగిపోలేదు స్త్రీ విస్తృతి. దేశప్రగతిని దశదిశలా చాటడంలో ఉన్న ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటోంది. ప్రతీ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. సమాజాన్ని చైతన్యపరిచే రచనలు చేయగలదు, అంతరిక్షాన్ని చుట్టిరాగలదు. ఇంటాబయటా విజయఢంకా మోగించగలదు.

అయితే ఒక్కమాట...

మనుస్మృతిలో చెప్పినట్లుగా ఏ స్త్రీ అయితే తనను తాను రక్షించుకోగలనన్న నమ్మకంతో ఉంటుందో ఆమె మాత్రమే సురక్షితంగా ఉన్నట్టు లెక్క. అలాంటి పరిపూర్ణ సాధికార మహిళా ఆవిష్కారానికి వేచిచూద్దాం.

- పార్నంది అపర్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని