పిల్లవాడిని కొట్టిన త్యాగయ్య

త్యాగరాజస్వామికి ‘వర్త్‌ కొళంబు’ అంటే చాలా ఇష్టం. వాటిని మనం ‘వుస్తి’ కాయలు అంటాం. అవి ధనియాల ఆకృతిలో ఉంటాయి. కానీ పరిమాణంలో కొంచెం పెద్దగా ఉంటాయి.

Published : 17 Feb 2022 00:40 IST

త్యాగరాజస్వామికి ‘వర్త్‌ కొళంబు’ అంటే చాలా ఇష్టం. వాటిని మనం ‘వుస్తి’ కాయలు అంటాం. అవి ధనియాల ఆకృతిలో ఉంటాయి. కానీ పరిమాణంలో కొంచెం పెద్దగా ఉంటాయి. ఒకరోజు వాటిని ఎండబెట్టి అక్కడే తిరుగుతూ కూనిరాగాలు తీస్తున్నాడాయన.
ఇంతలో పక్కింటి పిల్లవాడు ఆటలాడుతూ పరుగెత్తుకుంటూ వచ్చి ఆరబోసిన వుస్తికాయల మీద కాలువేశాడు. అవి కాస్తా చెల్లాచెదురయ్యాయి. త్యాగయ్యకు అసంకల్పితంగా చెయ్యి లేచింది. ఆ పిల్లవాడి వీపున చిన్న దెబ్బ పడింది. దానికే భయపడి వాడు ఏడుస్తూ ఇంటికి పరుగెత్తాడు. త్యాగయ్యకు వెంటనే తన తొందరపాటు చర్యకు బాధేసింది. బహుశా ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ కీర్తన అప్పుడే స్ఫురించి ఉంటుందనీ, ఆ వేదనలోనే దానిని స్వరపరిచి ఉంటారని కొందరి ఊహ.

కాసేపటికి ఆ పిల్లవాడు తల్లిదండ్రులను వెంటబెట్టుకు వచ్చాడు. త్యాగయ్యకి వాళ్లను చూడగానే విషయం అర్థమైంది. వుస్తికాయల పక్కన వినయంగా నిలబడి, తాను ఏ శిక్షకైనా సిద్ధమేనన్నట్టు చూశాడు వాళ్లవంక. కానీ పిల్లవాడి అమ్మానాన్నలు ఆయనకు దగ్గరగా వచ్చి ‘స్వామీ! మీ చేతి దెబ్బలు తిన్నాడంటే మావాడు ఎంత అదృష్టవంతుడో! మాకు అంతటి ప్రాప్తం లేదుగా! మమ్మల్ని దీవించండి’ అంటూ త్యాగయ్యకు పాదాభివందనం చేసుకుని వెళ్లిపోయారు.

- శివ రాజేశ్వరి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని