సందేశాల సారం

జపాన్‌ దేశంలో అసంఖ్యాక ప్రజానీకం బౌద్ధం స్వీకరించింది. వాళ్లు బుద్ధుని బోధనలు శ్రద్ధగా విని, ఆచరించేవారు. టెట్సుజెన్‌ అనే పండితుడు అనేక బౌద్ధ గ్రంథాలను జపనీస్‌ భాషలోకి అనువదించాలనుకున్నాడు.

Published : 01 Feb 2024 00:13 IST

పాన్‌ దేశంలో అసంఖ్యాక ప్రజానీకం బౌద్ధం స్వీకరించింది. వాళ్లు బుద్ధుని బోధనలు శ్రద్ధగా విని, ఆచరించేవారు. టెట్సుజెన్‌ అనే పండితుడు అనేక బౌద్ధ గ్రంథాలను జపనీస్‌ భాషలోకి అనువదించాలనుకున్నాడు. ఆ పవిత్ర కార్యం కోసం ఆయన శిష్యులు, అనుచరులు కోట్లకొద్దీ ధనం సేకరించి అతనికి అందజేశారు. సరిగ్గా అప్పుడే జపాన్‌లో వరదలు రావడంతో ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. టెట్సుజెన్‌ ఈ పరిస్థితిని కళ్లారా చూశాడు. వెంటనే ఒక నిశ్చయానికి వచ్చి, తాను బౌద్ధగ్రంథాల ప్రచురణ కోసం సేకరించిన మొత్తాన్ని బాధితుల సేవకు వెచ్చించసాగాడు. అది నచ్చని కొందరు అనుయాయులు, శిష్యులు టెట్సుజెన్‌ను ఉద్దేశించి ‘మనం అనుకున్నట్టుగా మీరు సొమ్మును వినియోగించడం లేదు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఆ ధనాన్ని సేకరించాం. అది కాస్తా ఖర్చయిపోతే మళ్లీ సమకూరడం కష్టం’ అన్నారు.

టెట్సుజెన్‌ తల పంకించి.. ‘నిస్సహాయులకు సేవ చేయడమే అత్యున్నత మతంగా ప్రకటించాడు బుద్ధుడు. ఆయన సందేశాలను అందరికీ అక్షర రూపంలో చేరవేద్దామనుకున్నాను. ఆయన ఆలోచనలను ఆచరణలో చూపడం మరింత ఘనమైన పని కదా! అందుకే వరద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఆ మొత్తాన్ని వినియోగించాను. ఇదెంతో సముచితం అనిపించింది. పుస్తకాలు ప్రచురించకపోయినా ఫరవాలేదు ప్రాణాలను నిలబెట్టకపోతే ఎలా?!’ అంటూ సమాధానమిచ్చాడు. వాళ్లిక వాదించలేదు, వినమ్రంగా నమస్కరించారు.

శార్వరీ శతభిషం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని