ఒకే ఒక్క నవ్వు

షింగాన్‌ మందిరంలో జెన్‌ మాస్టరుగా సేవలందించిన మొకుగెన్‌ తన బాధ్యతలు మరెవరికైనా అప్పగించాల్సిన సమయం వచ్చింది. వేరొకరిని జెన్‌ గురువుగా ఎంపిక చేసేందుకు శిష్యులందరితో సమావేశమయ్యాడు.

Published : 08 Jun 2023 00:05 IST

షింగాన్‌ మందిరంలో జెన్‌ మాస్టరుగా సేవలందించిన మొకుగెన్‌ తన బాధ్యతలు మరెవరికైనా అప్పగించాల్సిన సమయం వచ్చింది. వేరొకరిని జెన్‌ గురువుగా ఎంపిక చేసేందుకు శిష్యులందరితో సమావేశమయ్యాడు. మొకుగెన్‌ ఏ పనైనా నిర్దుష్టంగా పూర్తిచేస్తాడు. కానీ సరదా, సంతోషం అనేవి తెలియదు. ఆయన ఒక్కసారైనా నవ్వగా ఎవరూ చూడలేదు. ‘మీరంతా నా దగ్గర పదేళ్లకు పైగా అభ్యాసం చేశారు. జెన్‌కు నిజమైన నిర్వచనం ఏమిటో చెప్పండి! ఎవరు స్పష్టంగా చెబితే అతణ్ణే నా వారసుడిగా నిర్ణయిస్తాను’ అన్నాడు.

శిష్యులంతా కాఠిన్యం ఉట్టిపడుతున్న గురువు ముఖంలోకి ఒకసారి చూసి తల దించుకున్నారు. ఏ ఒక్కరూ సమాధానం చెప్పేందుకు సుముఖంగా లేరు. మొకుగెన్‌ ఒక్కొక్కరినీ నిశితంగా గమనిస్తున్నాడు. చివరికి అతడి దృష్టి ఎంఖో మీద నిలిచింది. ఇక తప్పదన్నట్టుగా ఎంఖో లేచి కాస్త దూరంలో ఉన్న మంచం వద్దకు వెళ్లాడు. దాని పక్కనున్న బల్ల మీదికి చెయ్యి పోనిచ్చాడు. అతడేం చేయ బోతున్నాడో అర్థంగాక అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఎంఖో ఒక ఔషధ సీసాను కాస్త ఇవతలికి జరిపాడు. ఆ చేష్టతోనే గురువుకు జవాబు చెప్పదలచాడు ఎంఖో. అది చూసిన మొకుగెన్‌ ముఖం మరింత తీవ్రంగా మారింది. ‘అంటే నేను ఔషధం సేవించాలనా? నీకు అర్థమైంది ఇంతేనా?’ అన్నాడాయన గద్దించినట్లుగా.

ఎంఖో వెంటనే ఇవతలికి తీసిన ఔషధాన్ని మళ్లీ యథాస్థానంలో పెట్టేసి.. ‘తమరు నవ్వితే ఒకసారి చూడాలని’ అన్నాడు. అంతే మొకుగెన్‌ ముఖంలో ఒక అద్భుత చిరునవ్వు విరిసింది. ‘ఓరి దుర్మార్గుడా! ఇన్నేళ్లుగా నా దగ్గరే ఉంటున్నావు! కానీ నన్ను సంపూర్ణంగా చూడనేలేదు. సర్లే.. ఈ వస్త్రాలూ, పాత్రలూ స్వీకరించు! ఇకపై జెన్‌ గురువుగా బాధ్యతలు నిర్వహించా ల్సింది నువ్వే’ అన్నాడు. అక్కడ అందరి ముఖాల్లో నవ్వులు విరబూశాయి.

వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని