వెయ్యిమంది ఆకలితో అలమటిస్తున్నారా!

సత్యవాక్కు అనగానే ధర్మరాజు స్ఫురణకు వస్తాడు. అలాంటి యుధిష్ఠిరుడికి ఒకసారి తన కీర్తిప్రతిష్ఠలపై కించిత్తు అహం పొడచూపింది. అది పసిగట్టిన శ్రీకృష్ణుడు ఆ పాండునందనుడికి పాఠం నేర్పాలనుకున్నాడు.

Published : 13 Jul 2023 01:52 IST

సత్యవాక్కు అనగానే ధర్మరాజు స్ఫురణకు వస్తాడు. అలాంటి యుధిష్ఠిరుడికి ఒకసారి తన కీర్తిప్రతిష్ఠలపై కించిత్తు అహం పొడచూపింది. అది పసిగట్టిన శ్రీకృష్ణుడు ఆ పాండునందనుడికి పాఠం నేర్పాలనుకున్నాడు. ఓరోజు బలిచక్రవర్తి పరిపాలిస్తున్న పాతాళలోక పుర వీధుల్లో కృష్ణుడు, ధర్మరాజు నడుస్తున్నారు. దారిలో ధర్మజుడికి దాహమేయగా ఓ ఇంటిముందు నిలబడి నీళ్లడిగాడు. ఆ గృహిణి బంగారుచెంబులో నీళ్లు తెచ్చిచ్చింది. యుధిష్ఠిరుడు దాహం తీర్చుకుని చెంబును తిరిగివ్వబోయాడు. ఆమె సున్నితంగా నిరాకరిస్తూ ‘అయ్యో! ఒకరికిచ్చింది తిరిగి తీసుకోవడం మర్యాద కాదు’ అంది. ధర్మరాజు ఆశ్చర్యపోతూ ‘అమ్మా! ఇది స్వర్ణం. ఇంత విలువైంది ఎలా వదులుకుంటారు?’ అన్నాడు. దానికామె ‘స్వామీ! మీకు తెలియదా?! ఇది బలిచక్రవర్తి రాజ్యం. ఇక్కడెంత విలువైనదైనా ఒకసారి ఇస్తే, తిరిగి తీసుకునే ప్రసక్తే లేదు, క్షమించండి!’ అంటూ లోనికెళ్లిపోయింది. ఆశ్చర్యపోయాడు పాండుసుతుడు. తర్వాత వాళ్లిద్దరూ బలిచక్రవర్తి వద్దకు వెళ్లారు. శ్రీకృష్ణుడు ‘ఓ గొప్పవ్యక్తిని నీకు పరిచయం చేస్తున్నాను. భూలోకంలో దానధర్మాలతో ప్రఖ్యాతిగాంచిన పాండవ అగ్రజుడితడు. ధర్మజుడి రాజప్రాసాదం ముందు నిత్యం వెయ్యిమంది ఆకలి తీర్చుకుంటారు. అంతమందికి రోజూ అన్నదానం చేస్తాడు’ అన్నాడు. అంతే.. బలిచక్రవర్తి చెవులకు చేతులు అడ్డుపెట్టుకుంటూ ‘హతవిధీ! ఒక రాజ్యంలో వెయ్యిమంది అన్నం లేక అలమటిస్తున్నారా! పైగా ఆ రాజును మీరు గొప్పవారంటున్నారా! ఎంత ఆశ్చర్యం! ఇక్కడ దానం తీసుకునే వారే లేరు. దాతృత్వాన్ని చాటుకునే అవకాశమే లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఆ పాలనలో లోపముంది, పాలకుల్లో దక్షత కొరవడింది’ అన్నాడు. ఆ మాటల్లోని ధర్మసూత్రం అర్థమైన పాండు సుతుడిలో అహం తగ్గి, కొత్త పాఠం నేర్చుకున్నట్లయింది!

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని