ధర్మజుని ఆక్షేపించిన ముంగిస

అశ్వమేధ యాగానంతరం ధర్మరాజు బ్రాహ్మణులకు గొప్ప దానాలు చేసి సంతృప్తు లను చేశాడు. వారంతా ధర్మరాజుని ప్రశంసిస్తుండగా అక్కడికొక ముంగిస వచ్చి ‘సక్తుప్రస్థుడు చేసిన మహా దానం ముందు ఈ అశ్వ మేధం దిగదుడుపే’ అంటూ విమర్శించింది.

Published : 27 Jul 2023 00:01 IST

శ్వమేధ యాగానంతరం ధర్మరాజు బ్రాహ్మణులకు గొప్ప దానాలు చేసి సంతృప్తు లను చేశాడు. వారంతా ధర్మరాజుని ప్రశంసిస్తుండగా అక్కడికొక ముంగిస వచ్చి ‘సక్తుప్రస్థుడు చేసిన మహా దానం ముందు ఈ అశ్వ మేధం దిగదుడుపే’ అంటూ విమర్శించింది.

కురుక్షేత్రంలో అతిథి పూజలతో యముడు సంతుష్టుడయ్యేలా చేసి సకుటుంబంగా బ్రహ్మలోకానికి వెళ్లిన సక్తుప్రస్థుడి కథ అందరికీ తెలిసిందే. కానీ ధర్మజుడి దానాలనే విమర్శించే సాహసం చేసిన ముంగిస ఎవరంటే..

ఒకసారి జమదగ్ని మహర్షి పితృదేవతలకు శ్రాద్ధకర్మ చేసేందుకు కొత్త కుండలో పాలను నిల్వ చేసి తన పనిలో తానున్నాడు. అంతలో క్రోధం ఒక భూతం రూపంలో వచ్చి కుండను పడతోయడంతో పాలు ఒలికిపోయాయి. శ్రాద్ధకర్మకు విఘాతం కలిగింది. అంత జరిగినా జమదగ్ని భూతం మీద కోపగించుకోలేదు. ఆయన శాంత స్వభావానికి భూతం మెచ్చుకుని, ‘భృగు సంతతి వారందరికీ కోపం ఎక్కువంటారు. అది అసత్యమని రుజువు చేశావు. నేను ఓడిపోయాను, క్షమించు. నన్ను శపించకు’ అని ప్రాధేయపడింది.

‘నువ్విక్కడి నుంచి త్వరగా వెళ్లిపో! లేదంటే పితృదేవతలు వచ్చి నిన్ను శపిస్తారు’ అని భూతాన్ని పంపించేశాడు జమదగ్ని. జరిగింది తెలుసుకున్న పితృ దేవతలు కోపగించుకుని ‘అలాంటి భూతాన్ని శిక్షించకుండా వదిలేశావు కాబట్టి నువ్వు ముంగిసవై జన్మించు’ అని జమదగ్నికి శాపమిచ్చారు.

శాప విముక్తి చెప్పమని ప్రార్థించాడు జమదగ్ని. దయ తలచిన పితృదేవతలు ‘ధర్మాన్ని అధర్మంగా నిరూపించి పండితులను ఒప్పించినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది’ అంటూ శాపవిమోచనం చెప్పారు. ఆ విధంగా ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగాన్ని ఆక్షేపించి పండితులైన బ్రాహ్మణులను మెప్పించడంతో ముంగిస రూపంలో ఉన్న జమదగ్నికి శాపవిముక్తి కలిగింది.

ఉమామహేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని