కాకిపై రాముడి బ్రహ్మాస్త్రం

‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?’ అనే ప్రయోగం మనకు తెలిసిందే. అదలా ఉంచితే.. శ్రీరాముడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడనే సంగతి మీకు తెలుసా? శ్రీరాముడి లాంటి మహావీరుడు.

Published : 17 Aug 2023 00:06 IST

‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?’ అనే ప్రయోగం మనకు తెలిసిందే. అదలా ఉంచితే.. శ్రీరాముడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడనే సంగతి మీకు తెలుసా? శ్రీరాముడి లాంటి మహావీరుడు, పురుషోత్తముడు ఒక సాధారణ కాకి మీద బ్రహ్మాస్త్రం వేయడమేంటని ఆశ్చర్యం కలిగినా.. అది నిజమే నంటుంది వాల్మీకి రామాయణం. దాని ప్రకారం సీతారాములు వనవాసంలో ఉండగా ఒకరోజు స్వామి- సీతమ్మ ఒడిలో తల పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆవిడ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ పరవశిస్తోంది. ఆ సమయంలో హఠాత్తుగా ఒక కాకి వచ్చి ఆవిడ స్తనం మీద పొడిచింది. భర్తకు నిద్రాభంగం కారాదని సీతామాత కాకిని నిశ్శబ్దంగా తోలింది. అది పోయినట్టు పోయి మళ్లీ వచ్చి అమ్మవారి స్తనాల్ని గాయపరచసాగింది. ఆమె శరీరం నుంచి ప్రవహిస్తున్న రక్తం మేనుకి చల్లగా తాకడంతో కోదండరామయ్యకు మెలకువ వచ్చింది. ఇంత జరుగుతుంటే తనను ఎందుకు లేపలేదని సీతమ్మపై చిరుకోపం చూపాడు రామయ్య.

స్వామి మేల్కొన్న తర్వాత కూడా ఆ కాకి మళ్లీ మళ్లీ వచ్చి సీతను పొడిచేందుకు ప్రయత్నించింది. తాను అదిలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహించిన రామయ్య- ఒక దర్భ పోచను బ్రహ్మాస్త్రంగా మంత్రించి వదిలాడు. బ్రహ్మాస్త్రం వెంట పడేసరికి కాకి రక్షణ కోసం ముల్లోకాలూ తిరిగింది. విష్ణువు అవతారమైన శ్రీరాముడి అస్త్రాన్ని ఎవరు మాత్రం నిరోధించగలరు? బ్రహ్మాదులు ‘నువ్వే వెళ్లి స్వామి శరణు కోరు’ అని సలహా ఇచ్చారు. దాంతో కాకి తిరిగొచ్చి స్వామి పాదాలపై పడి తప్పు క్షమించమని వేడుకుంది.

శ్రీరాముడు ‘నిన్ను క్షమించడానికి అభ్యంతరం లేదు. కానీ ఒకసారి వదిలిన అస్త్రాన్ని ఉపసంహరించలేను. దీన్ని ఎటు మళ్లించమంటావో నువ్వే చెప్పు.. ఆ విధంగా నిన్ను కాపాడుతాను’ అన్నాడు.

పశ్చాత్తాపం చెందిన కాకి ‘అమ్మవారికి బాధ కలిగించిన నాకు శిక్ష పడాల్సిందే.. కనుక నా కుడి కంటిపై అస్త్రాన్ని ప్రయోగించు తండ్రీ’ అంటూ ప్రార్థించింది. రాముడలాగే చేశాడు. అందువల్లే కాకులకు ఒక కన్ను కనబడదని పురాణాలు చెబుతున్నాయి.

చంద్రప్రతాప్‌ కంతేటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని