జీవితాంతం నేర్చుకోవాలి!

మన ఆధ్యాత్మిక గురువు స్వామి రామతీర్థ ఒకసారి ఓడలో జపాన్‌ బయల్దేరారు. అదే ఓడలో 90 ఏళ్ల జపాన్‌ దేశస్థుడు ఉన్నాడు. అంత వయసులోనూ ఆయన చైనా భాషలో ఏదో రాసుకుంటూ వల్లె వేస్తున్నాడు.

Updated : 02 Nov 2023 05:35 IST

న ఆధ్యాత్మిక గురువు స్వామి రామతీర్థ ఒకసారి ఓడలో జపాన్‌ బయల్దేరారు. అదే ఓడలో 90 ఏళ్ల జపాన్‌ దేశస్థుడు ఉన్నాడు. అంత వయసులోనూ ఆయన చైనా భాషలో ఏదో రాసుకుంటూ వల్లె వేస్తున్నాడు. రామతీర్థ ఆశ్చర్యంగా ఆయన వద్దకు వెళ్లి ‘మహాశయా! ఇంత వార్ధక్యంలోనూ మీరు ఏదో రాస్తున్నారు? ఏమైనా సాయం కావాలా?’ అనడిగారు. అప్పుడా పెద్దాయన ‘అయ్యా! నేను చైనా భాష నేర్చు కుంటున్నాను. పలుకుతూ గనుక రాస్తే.. ఏ భాష అయినా చక్కగా వంటబడుతుంది అంటారు కదా!’ అని చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ‘ఈ వయసులో మీరు విశ్రాంతి తీసుకోకుండా ఇంత కష్టపడాలా? పైగా చైనా భాష చాలా కష్టమంటారు!’ అన్నారు రామతీర్థ. ఆ కాగితాన్ని మడిచి, పక్కన పెట్టి.. ‘జీవితమంటే ప్రవాహం, అది ఆగితే పాకుడు పడుతుంది. నిరంతరం సాగుతుండాలి. నేర్వాలన్న తపనే ఆ ప్రవాహాన్ని తేటగా ఉంచుతుంది. జిజ్ఞాస కూడా ఆధ్యాత్మికతలో భాగమే. బతికినన్నాళ్లూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఇవి నా మాటలు కాదు.. మా జెన్‌ గురువు ప్రబోధాలు. అందుకే.. నేను సజీవంగా ఉన్నంత వరకూ నేర్చుకుంటూనే ఉంటాను’ అని వివరించారు. ఆ మాటలు విన్న స్వామి రామతీర్థకు ఓ కొత్తపాఠం నేర్చుకున్నట్లయింది. రామకృష్ణ పరమహంస చెప్పిన ‘ఎంత కాలం జీవిస్తానో, అంతకాలం నేర్చుకుంటూనే ఉంటాను’ అన్న బోధ మనసులో మెదిలింది.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని