తల మీద టెంకాయ కొడతారు

ఎవరి మీదైనా మరీ కోపం వస్తే.. ‘తల పగుల్తుంది జాగ్రత్త’ అనడం కద్దు. ఏదో కోపంతో అనే మాటది. అలాంటి విచిత్రమైన ఆచారం ఒకటుందంటే నమ్మలేం.

Updated : 09 Nov 2023 00:50 IST

వరి మీదైనా మరీ కోపం వస్తే.. ‘తల పగుల్తుంది జాగ్రత్త’ అనడం కద్దు. ఏదో కోపంతో అనే మాటది. అలాంటి విచిత్రమైన ఆచారం ఒకటుందంటే నమ్మలేం. తలను రాతితోనో, సుత్తితోనో కాదు కానీ.. నారికేళాన్ని నెత్తి మీద పగలకొడతారు. వింటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ!

మనదేశంలో ఉన్న అసంఖ్యాకమైన ఆచారాల్లో ఇదొకటి. ‘ఆది పెరుక్కు’ వేడుకల్లో భక్తుల తల మీద కొబ్బరికాయను పగలకొడ తారు. దీని వల్ల తెలిసీ తెలియక చేసిన పాప కర్మల నుంచి విముక్తి కలుగుతుంది, తనను తాను దేవుడికి అర్పించుకోవచ్చు- అంటారు. ఇందులో ఎవరి బలవంతం ఉండదు. దేవుణ్ణి మనసా వాచా ఆరాధించేందుకు ఇది ఉపకరిస్తుందని విశ్వసించేవాళ్లు తమంతట తాముగా వెళ్తారు. ఏదో ఒకరిద్దరు అనుకుంటున్నారా.. వేలాదిమంది అందుకోసం క్యూ కడతారంటే అతిశయం కాదు. తమిళనాడు మహాదానపురంలోని మహాలక్ష్మి దేవాలయంలో ఇలా చేస్తారు. కారూర్‌కు 23 కి.మీ. దూరంలో ఉందీ ఊరు. ఇక్కడ నిర్వహించే ‘ఆది పెరుక్కు’ ఉత్సవాల్లో పాటించే ఆచారమిది. ఇందుకోసం వచ్చిన భక్తుల్లో వారి వంతు వచ్చినప్పుడు.. ఒక పూజారి తల కదల కుండా పట్టుకోగా, రెండో పూజారి అతడి తల మీద టెంకాయ పగలకొడతాడు. రక్తం వస్తే పసుపు, విభూతి రాస్తారు. కొన్నిసార్లు పెద్ద గాయాలవుతుంటాయి. అలాంటప్పుడు కొందరు వైద్యుల వద్దకు పరుగు తీస్తారు. కానీ ఎక్కువమంది అలా చికిత్స చేయించుకుంటే.. అది దేవుడి పట్ల అపనమ్మకాన్ని సూచిస్తుందన్న భయంతో చికిత్స చేయించుకోక, దైవాన్నే ఆశ్రయిస్తారు. దీన్ని ‘థ్యాంక్స్‌ గివింగ్‌ ఫెస్ట్‌’గానూ వ్యవహరిస్తారు.

పురాణ కథలను అనుసరించి- పూర్వం కొందరు భక్తులు శివుణ్ణి ఎంతగా స్మరించినా.. పలకలేదు. దాంతో ఆదిశంకరుడి వలే మూడు కన్నులున్న నారికేళాన్ని తమ తల మీద పగలగొట్టుకున్నారు. దాంతో మహేశ్వరుడు ప్రత్యక్షమై.. వారి కోరికలను నెరవేర్చాడు. ఆ ఆచారమే నేటికీ కొనసాగుతోంది.

లేఖ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని