చదువుకుందాం... ఉచితంగా...

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు... ఎన్ని ప్రశ్నలు సాధన చేసినా సరిపోదు. దీనికోసం బోలెడు పుస్తకాలు, టెస్ట్‌ సిరీస్‌ల వంటివి కొంటూ ఉంటారు. ఇది గమనించిన కొన్ని ఆన్‌లైన్‌ సంస్థలు యాప్స్‌ సాయంతో నాణ్యమైన మెటీరియల్‌,

Updated : 31 Aug 2022 05:47 IST

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు... ఎన్ని ప్రశ్నలు సాధన చేసినా సరిపోదు. దీనికోసం బోలెడు పుస్తకాలు, టెస్ట్‌ సిరీస్‌ల వంటివి కొంటూ ఉంటారు. ఇది గమనించిన కొన్ని ఆన్‌లైన్‌ సంస్థలు యాప్స్‌ సాయంతో నాణ్యమైన మెటీరియల్‌, మాక్‌టెస్టులు, లైవ్‌ క్లాసులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటి ద్వారా కొత్తతరహా ప్రశ్నలు సాధన చేసే అవకాశం ఉండటమే కాకుండా, మన సాధన ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకునే అవకాశమూ దొరుకుతుంది. మరి అవేంటో మీరూ ఒకసారి చూసేయండి. 

మాకర్స్‌
ప్రధానంగా మాక్‌ టెస్టులు రాయాలనుకునే వారికి ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎస్‌ఎస్‌సీ, రైల్వేస్‌, బ్యాంకింగ్‌, టీచింగ్‌, డిఫెన్స్‌, సివిల్‌ సర్వీసెస్‌, పోలీస్‌, ఇంజినీరింగ్‌, ఇతర కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో 60కి పైగా పరీక్షలకు ఇందులో మాక్‌టెస్టులు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్‌లో లభించే వీటిని... అసలైన పరీక్షల సమయం ఎంత ఉంటుందో అంతే సమయానికి రాసే వీలుంది. కొత్తగా వస్తున్న ప్రశ్నపత్రాల సరళిని అనుసరించి వీటిని తయారుచేస్తున్నారు. పరీక్ష పూర్తయిన అనంతరం మన స్కోరు, చేసిన తప్పులు, పర్సంటైల్‌, ర్యాంకు... ఇలా అన్నింటినీ యాప్‌ ఒకేచోట చూపిస్తుంది. అంతేకాక రోజువారీ వర్తమాన వ్యవహారాలు ఏమున్నాయో కథనాలు లభిస్తాయి. ఏరోజు సమాచారం ఆరోజు చదివేసుకుని క్విజ్‌లో కూడా పాల్గొనొచ్చు. 

ఆలివ్‌బోర్డ్‌
రోజువారీ కరెంట్‌ అఫైర్స్‌ను ఫ్లాష్‌కార్డ్స్‌లా చదువుకునే అవకాశం కల్పిస్తుందీ యాప్‌. దేశవ్యాప్తంగా నిర్వహించే దాదాపు అన్ని పరీక్షల గురించి ఇందులో సమాచారం దొరుకుతుంది. ప్రాక్టీస్‌ సెషన్స్‌తో కూడిన లైవ్‌ క్లాసులను నిర్వహిస్తున్నారు. టాపిక్‌ వారీగా, ప్రశ్నల స్థాయిని అనుసరించి విడివిడిగా మాక్‌టెస్టులు రాసే వీలుంది. ముఖ్యమైన పరీక్షలకు ఉచితంగా ఈ-బుక్స్‌ అందిస్తున్నారు. డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా స్టడీ నోట్స్‌ ఇస్తున్నారు. మనం రాసిన పరీక్ష ఫలితం వెంటనే కనిపించడమే కాకుండా, ఇతర విద్యార్థులతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ పరీక్షకు ఎలా చదవాలనే అంశంపై టాపర్లతో తరగతులు నిర్వహిస్తున్నారు.  

గైడ్లీ
బ్యాంకింగ్‌ పరీక్షలకు చదువుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని సృష్టించారు. ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ వంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్‌ అయ్యేవారికి చాలా ఉపయోగపడుతుంది. మెటీరియల్‌, ప్రశ్నలు పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. ప్రతిరోజూ మనం యాప్‌లో ఏం చేశామనేది ఒకచోట కనిపిస్తుంది. నెలవారీ కరెంట్‌ అఫైర్స్‌, వివిధ టాపిక్స్‌ కోసం ప్రత్యేకంగా మెటీరియల్‌ దొరుకుతుంది. కావాలనుకుంటే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం ద్వారా ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌ను వాడుకునే వీలుంది. పరీక్షలకు ఎలా చదవాలనే అంశంపై నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తూ ఈ సంస్థ చేస్తున్న వీడియోలు యూట్యూబ్‌లోనూ లభిస్తున్నాయి. 

టెస్ట్‌ బుక్‌
ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఇది అన్నివిధాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ ఇంగ్లిష్‌, హిందీతోపాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. చాలావరకూ మాక్‌టెస్టులు ఉచితం, అంతకంటే ఎక్కువ కంటెంట్‌ను వినియోగించుకోవాలి అనుకుంటే కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 

* ఫ్యాకల్టీ చెప్పే లైవ్‌ క్లాసులు వినడంతోపాటు ప్రతి టాపిక్‌కు... ముందే తయారుచేసి ఉంచిన పాఠాలను సబ్జెక్ట్‌వారీగా చదువుకునే అవకాశం ఉంది. పరీక్షలు రాసేటప్పుడు ఆ ఎగ్జామ్‌ అసలైన యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ఎలా ఉంటుందో అదేమాదిరిగా ఇవీ కనిపిస్తాయి. దానివల్ల నిజమైన పరీక్ష రాస్తున్న భావన, శ్రద్ధ కలుగుతాయనే ఉద్దేశంతో దీన్నలా తయారుచేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని