డేటా ఉద్యోగాలకు...ఎస్‌క్యూఎల్!
డేటా అనేది సమాచార నిధి మాత్రమే కాదు, ఉద్యోగావకాశాలకు వారధి కూడా! డేటాను సమర్థంగా నిర్వహించగలిగే నిపుణులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది
డేటా అనేది సమాచార నిధి మాత్రమే కాదు, ఉద్యోగావకాశాలకు వారధి కూడా! డేటాను సమర్థంగా నిర్వహించగలిగే నిపుణులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. ఈ రంగంలో కొలువులు ఆశించేవారికి ఎస్‌క్యూఎల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఉపయోగకరం. ఈ సర్టిఫికేషన్‌తో నేరుగా కొలువులు పొందే వీలుండటమే ఇందుకు కారణం. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే...
ఎస్‌క్యూఎల్ పూర్తి పేరు ‘స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్’. డేటాను అన్నివిధాలుగా నిర్వహించడంలో ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఐబీఎం కంపెనీ పరిశోధకులు 1970ల్లో సృష్టించారు. కోట్లకొద్దీ వివరాలుండే డేటాబేస్‌తో కమ్యూనికేట్ చేసేందుకు ఎస్‌క్యూఎల్ ఒక చక్కని మార్గం. కావాల్సిన సమాచారాన్ని పొందడం, అదనపు వివరాలు జోడించడం, అవసరం లేని విషయాలు తీసివేయడం, కొత్త డేటాబేస్ తయారుచేయడం వంటి అన్ని పనులనూ దీని సహాయంతో సులభంగా చేయవచ్చు. ఇది ఉపయోగించేవారికి చాలా సౌకర్యంగా ఉండే భాష.
అవసరాలేంటి?
బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్‌లో దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు. డేటా సైన్స్, బిగ్ డేటా టూల్స్ ఎస్‌క్యూఎల్‌పై ఆధారపడి ఉన్నాయి. డేటా సంబంధిత ఉద్యోగాల్లో నిలదొక్కుకోవాలంటే ఉండాల్సిన ముఖ్యమైన నైపుణ్యాల్లో ఎస్‌క్యూఎల్ ఒకటని కంపెనీలు భావిస్తుండటం.. దీని అవసరాన్ని మరింత పెంచుతోంది.
ప్రయోజనాలు
ఎస్‌క్యూఎల్‌తో ఉన్న ప్రధానమైన వెసులుబాటు ఏంటంటే.. కోడింగ్‌తో పరిచయం లేని వారు కూడా సులభంగా ఉపయోగించవచ్చు. అయితే ఏదైనా ఒక ప్రోగామింగ్ లాంగ్వేజ్‌తో పరిచయం ఉండటం ఉపకరిస్తుంది. డేటా నిర్వహణలో పెద్ద పెద్ద లైన్లతో కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ‘ఇన్‌సర్ట్ ఇన్‌టూ’, ‘సెలక్ట్’, ‘అప్‌డేట్’ వంటి పదాలతో, సులభమైన సింటాక్స్‌తో దీన్ని ఉపయోగించవచ్చు. పీసీ, ల్యాప్‌టాప్ వంటి అన్ని డివైజ్‌లలోనూ ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా దీన్ని వాడొచ్చు. ఇతర అప్లికేషన్లతో సులువుగా కలిసి పనిచేస్తుంది. అంతేకాదు, ఇది వేగంగా నేర్చుకోగలిగిన భాష. ఇతర లాంగ్వేజ్‌లతో పోలిస్తే తక్కువ సమయంలో పట్టు సాధించవచ్చు.
* వేగవంతమైన క్వెరీ ప్రాసెసింగ్ దీని మరో ప్రత్యేకత. అధిక మొత్తంలో డేటాను వేగంగా, సమర్థంగా రిట్రీవ్ చేయగలదు. క్లిష్టమైన ప్రశ్నలకూ సెకెండ్లలో సమాధానాలు చెప్పేస్తుంది. ఆపరేషన్స్ అన్నీ త్వరితగతిన జరుగుతాయి. ఎస్‌క్యూఎల్‌ను డెవలపర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు అధికంగా ఉపయోగిస్తుంటారు. ఎనలిటికల్ క్వెరీలను అడిగేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
మై ఎస్‌క్యూఎల్
తమ డేటాబేస్‌లకు ఎస్‌క్యూఎల్‌ను ఉపయోగించే పని లేకుండా చాలా కంపెనీలు బిల్ట్‌ఇన్ ఎస్‌క్యూఎల్ ఉన్న డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్నాయి. ‘మై ఎస్‌క్యూఎల్’ను ఒరాకిల్ సంస్థ అభివృద్ధి చేసి అందుబాటులో ఉంచింది. ఇది ఓపెన్ సోర్స్ అప్లికేషన్. అంటే ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. కంటెంట్‌ను వేగంగా తయారుచేయడానికి, మార్చడానికి చాలా వెబ్‌సైట్లు దీన్ని ఉపయోగిస్తూ ఉంటాయి. ఫేస్‌బుక్, గూగుల్, అడోబ్ వంటి ఎన్నో దిగ్గజ సంస్థలు దీని వినియోగదారులు.
ఉద్యోగావకాశాలు
ఈ రంగంలో చక్కని అవకాశాలు పొందేందుకు అన్ని ఎస్‌క్యూఎల్ కాన్సెప్టులు, థియరీలు నేర్చుకోవాల్సి ఉంటుంది. బీఈ, బీటెక్, ఎంసీఏ, ఇతర ఐటీ సంబంధిత డిగ్రీ, పీజీ కోర్సులు చేసినవారు దీన్ని నేర్చుకోవచ్చు. స్టార్టప్‌ల నుంచి పెద్దస్థాయి కంపెనీల వరకూ ఎస్‌క్యూఎల్ నిపుణుల అవసరం ఉంటుంది. వీరికిచ్చే జీతభత్యాలు వేగంగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇండీడ్ సంస్థ తాజా నివేదిక ప్రకారం.. భారత్‌లో ఒక ఎస్‌క్యూఎల్ డెవలపర్ సగటు జీతం ఏడాదికి రూ.4 లక్షల వరకూ ఉంది. ఫైనాన్స్, అకౌంటింగ్, వెబ్ డెవలప్‌మెంట్, డిజిటిల్ మార్కెటింగ్.. వంటి ఎన్నో రంగాల్లో ఎస్‌క్యూఎల్ వినియోగం అధికంగా ఉంది.
నేర్చుకోవడం ఎలా ?
ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కోర్సుల ద్వారా దీన్ని సులభంగా అధ్యయనం చేసే వీలుంది. ఆఫ్‌లైన్‌లో పలు ఇన్‌స్టిట్యూట్‌లు, ఆన్‌లైన్‌లో సింప్లీలెర్న్, ఎడ్యురేకా, యుడెమీ వంటి సంస్థలు దీనిపై వివిధ కోర్సులు నేర్పిస్తున్నాయి. ఏ విధంగా చేసినా సర్టిఫికేషన్ ఉండటమనేది ఉద్యోగాలు పొందడంలో మరింతగా కలిసొచ్చే అంశం. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజ సర్టిఫికేషన్లకు డిమాండ్ ఉంది. ఇందుకు పరీక్ష రాసి ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!
-
Politics News
Andhra News: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ