యశస్వి స్కాలర్‌షిప్పులకు దరఖాస్తు చేశారా?

మీరు తొమ్మిదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులా? ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విభాగాలకు చెందినవారా? అయితే పీఎం యశస్వి స్కాలర్‌షిప్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published : 15 Aug 2023 00:09 IST

మీరు తొమ్మిదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులా? ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విభాగాలకు చెందినవారా? అయితే పీఎం యశస్వి స్కాలర్‌షిప్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో మెరిస్తే ఆర్థిక ప్రోత్సాహం అందుకోవచ్చు. ఎలాంటి రుసుమూ చెల్లించకుండా దరఖాస్తు చేసుకుని, పరీక్ష రాసుకోవచ్చు. ఆ వివరాలు...

మేటి విద్యా సంస్థల్లో చదువుతోన్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఆర్థికంగా ప్రోత్సహించే లక్ష్యంతో పీఎం యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్పులను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. వీటి ఎంపిక కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్పులను రాష్ట్రాలవారీగా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 1401, తెలంగాణలో 1001 మందికి ఈ అవకాశం దక్కుతుంది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఎంపిక చేసిన అత్యుత్తమ పాఠశాలల విద్యార్థులకే అవకాశముంది. ఆ పాఠశాలల వివరాలు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో రాష్ట్రాలు, జిల్లాల వారీ అందుబాటులో ఉంచారు.

పరీక్ష ఇలా..

దీన్ని ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకూ 4 ఆప్షన్లు ఇస్తారు. వ్యవధి రెండున్నర గంటలు. మొత్తం వంద ప్రశ్నలు. వీటికి వంద మార్కులు. మ్యాథ్స్‌ 30, సైన్స్‌ 25, సోషల్‌ 25, జనరల్‌ అవేర్‌నెస్‌/నాలెడ్జ్‌ 20 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నపత్రం చేతికిస్తారు. పెన్నుతో సరైన జవాబు ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎనిమిది, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం వారికి పదో తరగతి సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.    

పరీక్షలో అర్హత సాధించడానికి కనీసం 35 శాతం మార్కులు పొందాలి. అర్హులు నేషనల్‌ స్కాలర్‌షిప్పు పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం యశస్వి ప్రోత్సాహకాలు అందిస్తారు. రాష్ట్రాల వారీ మెరిట్‌ లిస్టు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

అర్హులెవరంటే..

ఓబీసీ, ఈబీసీ, డీనోటిఫైడ్‌ కుటుంబాలకు చెందిన బాలలు, సంచార జాతులకు చెందిన పిల్లలై ఉండాలి. గుర్తించిన టాప్‌ క్లాస్‌ పాఠశాలలో చదువుతుండాలి. 2022-23 విద్యా సంవత్సరంలో 8 లేదా 10 పూర్తి చేసుకున్నవారే దరఖాస్తు చేసుకోవాలి. తొమ్మిదో తరగతి విద్యార్థులైతే ఏప్రిల్‌ 1, 2007 - మార్చి 31, 2011 మధ్య జన్మించినవారై ఉండాలి. అదే ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నవారైతే ఏప్రిల్‌ 1, 2005 - మార్చి 31, 2009 మధ్య జన్మించాలి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించరాదు.

ఎంపికైతే..

ఈ స్కాలర్‌షిప్పులకు ఎంపికైనవారికి 9, 10 తరగతుల్లో ఏడాదికి రూ.75,000 ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో రూ.1,25,000 చెల్లిస్తారు.


దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 17

పరీక్ష తేదీ: సెప్టెంబరు 29

పరీక్షలు: ఏపీ, తెలంగాణల్లో అన్ని పాత జిల్లా కేంద్రాల్లోనూ రాసుకోవచ్చు.

వెబ్‌సైట్‌: https://yet.nta.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని