కేంద్రీయ ఆసుపత్రుల్లో.. నర్సింగ్‌ ఆఫీసర్లు

కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న ప్రముఖ ఆసుపత్రుల్లో సేవలు అందించే అవకాశం వచ్చింది. నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Published : 16 Aug 2023 00:03 IST

కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న ప్రముఖ ఆసుపత్రుల్లో సేవలు అందించే అవకాశం వచ్చింది. నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో విజయవంతమైతే ఆకర్షణీయ వేతనం పొందవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అఖిలభారత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్‌)ల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రకటన వెలువడింది. బీఎస్సీ నర్సింగ్‌,   జీఎన్‌ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు అర్హులు. ఈ ఉద్యోగావకాశం వచ్చినవారు విధుల్లో చేరిన వెంటనే నెలకు సుమారు రూ.80 వేల వేతనం అందుకోవచ్చు.

తాజా ప్రకటనలో పరీక్ష విధానం మారింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండూ ఉంటాయి. గతంలో స్టేజ్‌-1 మాత్రమే ఉండేది.

ఇటీవలే తెలంగాణలో భారీ సంఖ్యలో నర్సు ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించారు. ఇంచుమించు అదే సన్నద్ధతతో ఎయిమ్స్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. వీటిని నర్సింగ్‌ ఆఫీసర్స్‌ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్టు (ఎన్‌ఓఆర్‌సెట్‌)లో చూపిన ప్రతిభతో నింపుతారు. పరీక్షలో సాధించిన స్కోరు ఆరు నెలల వరకు చెల్లుతుంది. ఈ వ్యవధిలో ఎయిమ్స్‌ల్లో కొత్త ఖాళీలు ఏర్పడితే ఈ స్కోరుతో భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఖాళీల వివరాలు ప్రకటించనప్పటికీ వేలల్లో ఉండే అవకాశం ఉంది. గతంలో 3000కు పైగా పోస్టుల భర్తీ చేయడమే ఇందుకు కారణం. మొత్తం పోస్టుల్లో 80 శాతం మహిళలకే దక్కుతాయి. మిగిలిన 20 శాతం పురుషులతో నింపుతారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నార్‌సెట్‌ నిర్వహిస్తారు.

నియామకాలు

పరీక్షలో అర్హత సాధించినవారి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. అనంతరం మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా పోస్టులు కేటాయిస్తారు. ఇలా అవకాశం వచ్చినవారిని కేంద్రప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరికి పే స్కేల్‌ లెవెల్‌ 7 ప్రకారం రూ.44,900 మూలవేతనం అందిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం. అంటే మొదటి నెల నుంచే వీరు సుమారు రూ.80 వేలు వేతనం అందుకోవచ్చు.

ఎయిమ్స్‌ కేంద్రాలు: బఠిండా, భోపాల్‌, భువనేశ్వర్‌, బీబీనగర్‌, బిలాస్‌పుర్‌, దియోఘర్‌, గోరఖ్‌పుర్‌, జోధ్‌పుర్‌, కల్యాణి, మంగళగిరి, నాగ్‌పుర్‌, న్యూదిల్లీ, పట్నా, రాయ్‌ బరేలీ, రాయ్‌పుర్‌, రాజ్‌కోట్‌, రిషికేష్‌, విజయ్‌పుర్‌ (జమ్మూ).

ఈ స్కోరుతో ఎయిమ్స్‌లతోపాటు దిల్లీలోని సఫ్తర్‌జంగ్‌ హాస్పిటల్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్యూబర్‌కొలోసిస్‌ అండ్‌ రెస్పిరేటరీ డిసీజెస్‌ల్లో ఖాళీలనూ నింపుతారు.

పరీక్ష ఇలా..

ఇది రెండు దశల్లో ఉంటుంది. ముందు ప్రిలిమ్స్‌ నిర్వహిస్తారు. దీని వ్యవధి 90 నిమిషాలు. మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ఇందులో 80 సబ్జెక్టుకు సంబంధించినవే ఉంటాయి. మిగిలిన 20 జనరల్‌ నాలెడ్జ్‌, ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. వాటిలో సరైనదాన్ని గుర్తించాలి. ప్రతి సరైన జవాబుకు ఒక మార్కు. తప్పు సమాధానానికి మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. పరీక్షలో అర్హత కోసం.. జనరల్‌, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులు 50 శాతం, ఓబీసీలు 45, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు పొందాలి. దివ్యాంగులైతే వారి కేటగిరీ అనుసరించి అదనంగా మరో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. సబ్జెక్టు విభాగంలో అడిగే ప్రశ్నలు బీఎస్సీ నర్సింగ్‌ నాలుగేళ్ల సిలబస్‌ నుంచే ఉంటాయి. అందువల్ల ఆ పాఠ్యపుస్తకాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు. అలాగే గతంలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు, ఎమ్మెస్సీ నర్సింగ్‌ ప్రవేశ పరీక్షల్లోని ప్రశ్నలు బాగా సాధన చేసినవారు ఎక్కువ మార్కులు పొందవచ్చు. ప్రిలిమినరీ అర్హత కోసమే. తుది ఎంపికలో ఈ మార్కులు పరిగణనలోకి తీసుకోరు.

మెయిన్స్‌: ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారి జాబితా నుంచి కేటగిరీల వారీ ఉన్న ఖాళీలకు 5 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్‌కు అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. ఈ పరీక్షలో అర్హత కోసం.. జనరల్‌, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులు 50 శాతం, ఓబీసీలు 45, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు పొందాలి. దివ్యాంగులైతే వారి కేటగిరీ అనుసరించి అదనంగా మరో 5 శాతం సడలింపు వర్తిస్తుంది.


ముఖ్య వివరాలు

అర్హత: బీఎస్సీ నర్సింగ్‌ / పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎంతోపాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం.

వయసు: 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు 25 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీలకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యుఎస్‌ రూ.2400. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: సీబీటీ స్టేజ్‌-1 సెప్టెంబరు 17, స్టేజ్‌-2 అక్టోబరు 7.

వెబ్‌సైట్‌: https://nursingofficer.aiimsexams.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని