భారత్‌ డైనమిక్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) 45 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 28 Aug 2023 00:07 IST

ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) 45 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులను బట్టి ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంఎస్సీ, ఎంబీఏ, డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఎంపికైనవారిని కార్పొరేట్‌ ఆఫీస్‌ (గచ్చిబౌలి), కంచన్‌బాగ్‌ (హైదరాబాద్‌) భానూర్‌ (సంగారెడ్డి జిల్లా), ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా), విశాఖపట్నం యూనిట్లలో నియమిస్తారు. మొత్తం 45 పోస్టుల్లో.. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ- ఎలక్ట్రానిక్స్‌-15, మెకానికల్‌-12, ఎలక్ట్రికల్‌-4, కంప్యూటర్‌ సైన్స్‌-1, సైబర్‌ సెక్యూరిటీ-2, కెమికల్‌-2, సివిల్‌-2, బిజినెస్‌ డీఈవీ-1, ఆప్టిక్స్‌-1, ఫైనాన్స్‌-2, వెల్ఫేర్‌ ఆఫీసర్‌-2, పబ్లిక్‌ రిలేషన్స్‌-1 ఉన్నాయి.
27.07.2023 నాటికి ఎంటీ ఫైనాన్స్‌/ వెల్ఫేర్‌ ఆఫీసర్‌/ జేఎం పోస్టులకు 28 సంవత్సరాలు, మిగతా ఖాళీలు అన్నింటికీ 27 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, బీడీఎల్‌ పర్మనెంట్‌ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు లేదు.
మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు రూ.40,000-1,40,000, వెల్ఫేర్‌ ఆఫీసర్‌/ జేఎం (పబ్లిక్‌ రిలేషన్స్‌) పోస్టులకు రూ.30,000-1,20,000 వేతనం ఉంటుంది. మూల వేతనంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, బేసిక్‌ మీద 33 శాతం పెర్క్స్‌, పనితీరు ఆధారంగా చెల్లింపులు, పీఎఫ్‌, గ్రాట్యుటీ, వైద్య సదుపాయాలు మొదలైనవి ఉంటాయి.

ఎంపిక ఎలా?

అభ్యర్థులను రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ సీబీఓటీ), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులో పేర్కొన్న విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసి.. వారికి సీబీఓటీ నిర్వహిస్తారు. సీబీఓటీ తేదీ, ప్రదేశాన్ని అడ్మిట్‌కార్ట్‌లో తెలియజేస్తారు. ఈ కార్డ్‌ను అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ సమాచారాన్ని అభ్యర్థి ఈమెయిల్‌కు తెలియజేస్తారు.

  •  సీబీఓటీ ప్రశ్నపత్రంలో రెండు పార్ట్‌లు, 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-1లోని 100 ప్రశ్నలు సంబంధిత విభాగాలకు చెందిన సబ్జెక్టుల నుంచి ఇస్తారు. పార్ట్‌-2లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు చెందిన 50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు.
  •  అభ్యర్థుల ఎంపికలో సీబీఓటీకి 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. సీబీఓటీలో యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 50 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. రాత పరీక్ష మార్కుల ఆధారంగా 10:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రతి దశలోనూ కటాఫ్‌ మార్కులు ఉంటాయి.
  •  రాత పరీక్షను పది కేంద్రాల్లో (బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, చెన్నై, దిల్లీ, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి, త్రివేండ్రం, విశాఖపట్నం) నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు దగ్గరలోని పరీక్ష కేంద్రాన్ని ఆన్‌లైన్‌ దరఖాస్తును నింపే సమయంలోనే ఎంపిక చేసుకోవాలి.  
  •  అన్ని పోస్టులకూ రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఎంపికచేస్తారు. వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుకు మాత్రం అదనంగా తెలుగులో కూడా రాత పరీక్షను నిర్వహిస్తారు. దీంట్లోని పార్ట్‌-1లో సబ్జెక్టు సంబంధిత, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-2లో తెలుగు ప్రావీణ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి.

సన్నద్ధతకు ...

పార్ట్‌-1లోని 100 ప్రశ్నలు సబ్జెక్టుకు సంబంధించినవే ఉంటాయి. ఇవన్నీ డిగ్రీ, పీజీలో చదివిన సబ్జెక్టుల నుంచే వస్తాయి. వీటి మీద పట్టు సాధించాలి. ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి.

  •  పార్ట్‌-2లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు చెందిన 50 ప్రశ్నలుంటాయి. ఇవి అభ్యర్థి తార్కిక పరిజ్ఞానాన్ని, విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. పాత ప్రశ్నపత్రాలను పూర్తిచేయడం ద్వారా ఆప్టిట్యూడ్‌ నైపుణ్యాన్ని సమీక్షించుకోవచ్చు.
  •  పరీక్ష వ్యవధి రెండు గంటల్లో అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించడం సాధన చేయాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధన అవసరం.  
  •  అన్ని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరి.

దరఖాస్తుకు చివరి తేదీ: 20.09.2023
వెబ్‌సైట్‌:  https://bdl-india.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని