నౌకాదళంలో చేరతారా?

భారతీయ నౌకాదళం పరిమిత కాల సేవల నిమిత్తం అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్‌, పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు వీటికి పోటీ పడొచ్చు.

Updated : 18 Oct 2023 03:16 IST

భారతీయ నౌకాదళం పరిమిత కాల సేవల నిమిత్తం అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్‌, పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు వీటికి పోటీ పడొచ్చు. అకడమిక్‌ మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ నిర్వహించి, విధుల్లోకి తీసుకుంటారు. ఈ అవకాశం వచ్చినవారికి సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలు దక్కుతాయి.  

గ్జిక్యూటివ్‌, ఎడ్యుకేషన్‌, టెక్నికల్‌ బ్రాంచీల్లో 224 ఖాళీలు ఉన్నాయి. జనరల్‌ సర్వీస్‌, ఏటీసీ, పైలట్‌, లాజిస్టిక్స్‌.. తదితర విభాగాల్లో వీటిని భర్తీ చేస్తారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి, అకడమిక్‌ ప్రతిభతో అభ్యర్థులను వడపోస్తారు. ఒక్కో పోస్టుకు కొంత మందిని చొప్పున ఎంపిక చేసి, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్‌ మార్కులు పొందినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికలో ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి ప్రాధాన్యం. అన్ని పోస్టులకూ 60 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్వ్యూలో విజయవంతమైనవారికి నేవల్‌ అకాడెమీ, ఎజిమాళలో వచ్చే జూన్‌ నుంచి 44 వారాలపాటు తర్ఫీదునిస్తారు. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారికి లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. అందువల్ల తొలి నెల నుంచే వీరు రూ.లక్షకు పైగా వేతనం పొందవచ్చు. ప్రొబేషన్‌ వ్యవధి రెండేళ్లు. వీరు పదేళ్లు విధుల్లో కొనసాగుతారు. అనంతరం పనితీరు, సంస్థ అవసరాల ప్రకారం మరో నాలుగేళ్లు పొడిగిస్తారు. ఆ తర్వాత ఉద్యోగం నుంచి వైదొలగాలి.

విభాగాలవారీ ఖాళీలు, అర్హతలు

ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: జనరల్‌ సర్వీస్‌ హైడ్రో క్యాడర్‌ విభాగంలో 40 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ 8, నేవల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ 18, పైలట్‌ 20 ఖాళీలు ఉన్నాయి. వీటికి బీఈ/బీటెక్‌ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పది, ఇంటర్‌, ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే పది లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లోనూ 60 శాతం ఉండాలి. లాజిస్టిక్స్‌ విభాగంలో 20 ఖాళీలకు బీఈ/బీటెక్‌/ఎంబీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ(ఐటీ) లేదా ఫైనాన్స్‌/ లాజిస్టిక్స్‌/ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌/ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ 60 శాతం మార్కులు తప్పనిసరి.

ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌: మొత్తం 18 ఖాళీలు. వీటికి నిర్దేశిత విభాగాల్లో బీఎస్సీ/ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్‌ 60 శాతం మార్కులు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లో 30, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లో 50, నేవల్‌ కన్‌స్ట్రక్టర్‌ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. వీటికి నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్‌ 60 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు.

వయసు: పై అన్ని పోస్టులకూ ఆ విభాగాన్ని బట్టి జులై 2, 1999/2000 - జనవరి/జులై 1, 2003/2005 మధ్య జన్మించాలి.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 29.

వెబ్‌సైట్‌:www.joinindiannavy.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని