ఈ కోర్సులతో ఏ అవకాశాలు?

మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదువుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో సోషియాలజీ/ సోషల్‌ వర్క్‌ చదివినవారికి సోషల్‌ వర్క్‌లో పీజీ చేయడానికి ప్రాధాన్యం ఉంటుంది.

Updated : 09 Jan 2024 06:24 IST

డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. తర్వాత సోషల్‌ వర్క్‌/ ఇండస్ట్రియల్‌ సైకాలజీలో పీజీ చేయాలనుంది. ఈ కోర్సులతో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

కరీమున్నీసా

  • మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదువుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో సోషియాలజీ/ సోషల్‌ వర్క్‌ చదివినవారికి సోషల్‌ వర్క్‌లో పీజీ చేయడానికి ప్రాధాన్యం ఉంటుంది. డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినప్పటికీ మీకు సోషల్‌ వర్క్‌ సబ్జెక్టుపై ఆసక్తి ఉంటే, పీజీ సోషల్‌ వర్క్‌లో ప్రవేశం పొందవచ్చు. సోషల్‌ వర్క్‌ చేసినవారికి ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి. ఈ కోర్సులో పీజీ చేసినవారు ప్రైవేటు రంగంలో సోషల్‌ వర్కర్‌, ఫ్యామిలీ కౌన్సెలర్‌, హాస్పిటల్‌ కౌన్సెలర్‌, డీ అడిక్షన్‌ కౌన్సెలర్‌గా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే,  కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. పీజీలో ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదవాలంటే, ముందుగా ఎంఏ/ ఎమ్మెస్సీ సైకాలజీలో ప్రవేశం పొంది, ఇండస్ట్రియల్‌ సైకాలజీని ఒక స్పెషలైజేషన్‌గా చదవాలి. చాలా యూనివర్సిటీల్లో పీజీలో సైకాలజీ చదవాలంటే, డిగ్రీలో సైకాలజీ కచ్చితంగా చదివి ఉండాలి. కొన్ని యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలో సైకాలజీ చదవకపోయినా పీజీ సైకాలజీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదివినవారికి ప్రైౖవేటు రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విద్యార్హతతో హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆర్గనైజేషనల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌, టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌, బిహేవియర్‌ అనలిస్ట్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌ ప్రాక్టీస్‌ మేనేజర్‌, ఎంప్లాయీ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌, ఇండస్ట్రియల్‌ సైకలాజికల్‌ కౌన్సెలర్‌, కన్సల్టెంట్‌, రిసెర్చ్‌ అనలిస్ట్‌ లాంటి కొలువులకు అర్హత ఉంటుంది. ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదివినవారికి ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో అతి తక్కువ ఉద్యోగాలే అందుబాటులో ఉన్నాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని