ఒత్తిడిని చిత్తు చేద్దాం!

పరీక్షలు దగ్గర పడుతుంటే రకరకాల ఆలోచనలూ, ఒత్తిడితో సరిగా నిద్ర పట్టదు. దాంతో అనేక అనారోగ్య సమస్యలూ వస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే ఒత్తిడికి దూరంగా.. ప్రశాంతతకు దగ్గరగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.  

Updated : 31 Mar 2022 05:57 IST

పరీక్షలు దగ్గర పడుతుంటే రకరకాల ఆలోచనలూ, ఒత్తిడితో సరిగా నిద్ర పట్టదు. దాంతో అనేక అనారోగ్య సమస్యలూ వస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే ఒత్తిడికి దూరంగా.. ప్రశాంతతకు దగ్గరగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.  
* కొంతమంది ఎక్కువ సబ్జెక్టులూ, వాటిలో ఎక్కువ చాప్టర్లూ చదివేసెయ్యాలనే పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటారు. అది కుదరక నిరాశకు గురవుతుంటారు. అలాకాకుండా ఉండాలంటే ముందుగా చిన్న లక్ష్యాలను పెట్టుకుని అవి సాధించాక.. క్రమంగా పెద్ద లక్ష్యాల జోలికి వెళ్లాలి.
* చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కానీ సమయం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే చేయాల్సిన పనుల జాబితాను తయారుచేసుకుంటే ఒత్తిడి కాస్త తగ్గుతుంది.
* టైమ్‌ టేబుల్‌ వేసుకుంటే ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. సబ్జెక్టుల క్లిష్టతబట్టి సమయం కేటాయించేలా టైమ్‌ టేబుల్‌ వేసుకోవాలి.
* స్నేహితుల్లో కొందరు ఎప్పుడూ ప్రతికూలంగానే ఆలోచిస్తుంటారు. అలాంటివారి మాటలు మన మీదా ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తాయి. అంతేకాదు, మనలో ఒత్తిడినీ పెంచేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఇలాంటివారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
* జరిగిన విషయాల గురించీ, జరగబోయే వాటి గురించీ ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వర్తమానంలో మాత్రమే జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి.
* ‘నేనింతే.. ఇలాగే ఉంటా. నేను మారను’ అని కూర్చోవడం వల్ల పనులు కావు. ఒత్తిడీ పెరుగుతుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నించాలి.
*సమయ నిర్వహణ తెలిస్తే ఒత్తిడికి గురికారు. ఏ పనికి ఎంత సమయం అవసరమో అంతే కేటాయించాలి.
 ‘కాదు’ అని చెప్పలేని మొహమాటంతో ఒత్తిడి పెరిగిపోతుంది. మీరు చదువుకోవాలనుకుంటారు. స్నేహితులేమో కొత్త సినిమా వెంటనే చూడాలంటారు. ఇలాంటి పరిస్థితుల్లో  కచ్చితంగా ‘నో’ చెప్పడం వల్ల ఒత్తిడి ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని