Updated : 05 Jul 2022 04:29 IST

సామాజిక సంస్కరణల సారథులు!

ఆధునిక భారతదేశ చరిత్ర

ఆధునిక భారతదేశ చరిత్రలో రాజా రామ్‌మోహన్‌ రాయ్‌తో మొదలైన మత, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు స్వాతంత్య్రానంతరం అంబేడ్కర్‌ కాలం వరకు కొనసాగాయి. ఆ పోరాటాల ద్వారా జాతిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంచేందుకు సంఘసంస్కర్తలు జీవితాంతం శ్రమించారు. సాంఘిక, లింగ సమానత్వంతోనే జాతి ఐక్యత, అభివృద్ధి సాధ్యమని త్రికరణశుద్ధిగా నమ్మారు. స్త్రీలపట్ల వివక్షను నిరసించారు. సామాజిక దురాచారాలను దునుమాడి ప్రజలను అభ్యుదయ భావాలవైపు నడిపించారు. సమాజంలో స్పష్టమైన మార్పు తీసుకువచ్చారు. అలాంటి మహనీయులు, వారు చేసిన ఉద్యమాలపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి.

మత, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు - సంఘసంస్కర్తలు

పందొమ్మిదో శతాబ్దం తొలి అర్ధభాగంలో రాజా రామ్‌మోహన్‌ రాయ్‌ ప్రచారం చేసిన అభ్యుదయ భావాలకు దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ మద్దతు ఇచ్చాడు. వాటిని బెంగాల్‌ అంతటా విస్తరింపజేసేందుకు కృషి చేసి తత్త్వబోధిని సభ (1839)ను స్థాపించి, తత్త్వబోధిని పత్రిక (1843)ను నిర్వహించాడు. రాయ్‌ స్థాపించిన బ్రహ్మసమాజంలో చేరి 1866 వరకు దానికి తిరుగులేని నాయకుడిగా మార్గనిర్దేశం చేశాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలను వివరిస్తూ బ్రహ్మధర్మం అనే గ్రంథం రాశాడు. సహచరుడు కేశవ్‌ చంద్రసేన్‌తో సాంఘిక సంస్కరణల విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో బ్రహ్మసమాజం రెండుగా చీలిపోయింది. దేవేంద్రనాథ్‌ నాయకత్వంలో ‘ఆది బ్రహ్మసమాజం’, కేశవ్‌ చంద్రసేన్‌ ఆధ్వర్యంలో ‘బ్రహ్మసమాజ్‌ ఆఫ్‌ ఇండియా’ ఏర్పడ్డాయి.

ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌

ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ (1820-1891) నిరాడంబరుడు, విద్యావేత్త, మహిళా హక్కుల పోరాటవాది, మానవతావాది. జీవితాన్ని మహిళా చైతన్యం కోసం అంకితం చేసిన సంస్కర్త. తాడిత పీడిత వర్గాలపై ఆయన సానుభూతి అపారం. వితంతు వివాహాలకు అనుకూలంగా అలుపెరుగని పోరాటం చేశాడు. విద్యాసాగర్‌ సాగించిన మహోద్యమం ఫలితంగానే అప్పటి గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ వితంతు వివాహ చట్టం - 1856ను తీసుకువచ్చి వితంతువుల వివాహాలను చట్టబద్ధం చేశాడు. బాల్య వివాహాలు, బహుభార్యత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు.

జ్యోతి రావు ఫులే

సంఘసేవకుడైన జ్యోతి రావు గోవిందరావ్‌ ఫులే (1827-1890) అణగారిన ప్రజలు, స్త్రీ జనోద్ధరణ, కుల నిర్మూలనకు జీవితాన్ని అంకితం చేసిన మహాత్ముడు, సామాజిక తత్త్వవేత్త, ఉద్యమకారుడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ‘సత్యశోధక్‌ సమాజ్‌’ను స్థాపించాడు. బాలికల కోసం మొదటి పాఠశాలను పుణెలో ప్రారంభించాడు. ఆయన ‘గులాంగిరి’ అనే పుస్తకాన్ని రచించాడు. ‘దీనబంధు’ పత్రికను నడిపాడు.

దయానంద సరస్వతి

దయానంద సరస్వతి (1824-1883) అసలు పేరు మూలశంకర్‌. వేదాలు నిత్యనూతనమని, వేదకాలపు జీవితం పరిశుద్ధమని, వేద ధర్మమే ధర్మమని విశ్వసించాడు. మతంలో విగ్రహారాధన, కర్మకాండ, పురోహిత వర్గం ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. సమాజంలో బాల్య వివాహాలు, కులవ్యవస్థ, అస్పృశ్యత తగదన్నాడు. కులాంతర వివాహాలు, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. 1875లో బొంబాయి ప్రధాన కేంద్రంగా ఆర్యసమాజాన్ని స్థాపించాడు (తర్వాత లాహోర్‌కి మార్చారు). ఇతర మతం అవలంబించిన హిందువులను తిరిగి హిందూ మతంలో చేర్చుకునేందుకు ‘శుద్ధి ఉద్యమం’ ప్రారంభించాడు. ‘గోబ్యాక్‌ టు ది వేదాస్‌’ అనేది ఆయన నినాదం. విద్యను ప్రోత్సహించడానికి ఆర్యసమాజం ‘దయానంద ఆంగ్లో వేదిక్‌ స్కూల్స్‌’ను ప్రారంభించింది. దయానంద బహు గ్రంథ రచయిత. ఈయన భావాలు, తత్త్వచింతన ‘సత్యార్థ ప్రకాశిక’లో ప్రతిబింబిస్తాయి. ఆర్యసమాజానికి ఇది ప్రామాణిక గ్రంథం.

రామకృష్ణ పరమహంస

రామకృష్ణ పరమహంస (1834-1886) అసలు పేరు గదాధర్‌ ఛటోపాధ్యాయ. దక్షిణేశ్వర్‌లోని కాళికామాత ఆలయంలో అర్చకుడు. సర్వమత సారాన్ని గ్రహించిన జ్ఞాని. దేవుడొక్కడే, అతడు సర్వాంతర్యామి, అన్ని మతాల సారం ఒక్కటే, మానవుడే మాధవుడి మూర్తి, మానవసేవే మాధవసేవ అని ప్రబోధించాడు. కోర్కెలు త్యజించాలని, సత్ప్రవర్తనే మోక్ష మార్గమని, నిష్కల్మష భక్తితో ధ్యానిస్తే భగవత్‌ సాక్షాత్కారం లభిస్తుందని బోధించాడు. రామకృష్ణ నిరాడంబరత, పవిత్రత, బోధనా పటిమ వల్ల అనేక మంది యువకులు ఆయన శిష్యులయ్యారు. ఆయన ప్రియశిష్యుడు స్వామి వివేకానందుడు.

వివేకానందుడు

వివేకానందుడి (1863-1902) అసలు పేరు నరేంద్రనాథ్‌ దత్తా. రామకృష్ణ పరమహంసకు అత్యంత ఇష్టమైన శిష్యుడు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల మహాసభలో ప్రసంగించి హిందూ మత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాడు. కులం, అస్పృశ్యత, అంధ విశ్వాసాలను వ్యతిరేకించాడు. స్వేచ్ఛా, సమానత్వం కలిగి ఉండాలని ప్రజలకు బోధించాడు. భారతీయ వేదాంత తత్త్వ ప్రచారానికి రామకృష్ణ మఠం (1887, బారానగర్‌)ను, తన గురువు బోధనల ప్రకారం మానవ సేవ కోసం రామకృష్ణ మిషన్‌ను (1897, బేలూరు) స్థాపించాడు.

అనిబిసెంట్‌

ఇంగ్లండ్‌లో పుట్టి కాలక్రమంలో థియోసాఫికల్‌ సొసైటీ (దివ్య జ్ఞాన సమాజం)లో చేరిన అనిబిసెంట్‌ (1847-1933), ప్రధానంగా భారతీయ మహిళల అభివృద్ధికి కృషి చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో 1875లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్‌ ఆల్కాట్‌లు దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. తర్వాత మద్రాసు వచ్చి అడయార్‌ ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. 1893లో ఇండియా వచ్చిన అనిబిసెంట్‌ ప్రాచీన హిందూమత పునరుజ్జీవనానికి దివ్యజ్ఞాన సమాజం ద్వారా కృషి చేశారు. ఆమె బెనారస్‌లో సెంట్రల్‌ హిందూ కాలేజీని స్థాపించారు. అది 1916 నాటికి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంగా వృద్ధి చెందింది. దేశానికి ఆమె చేసిన సేవకు గుర్తింపుగా 1917లో భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనిబిసెంట్‌ నిర్వహించిన పత్రికలు న్యూ ఇండియా, కామన్‌ వీల్‌. ఆమె రాసిన గ్రంథం యాన్‌ ఇంట్రడక్షన్‌ టు యోగి (An introduction to yogi).సమకాలీన సమాజంలో హిందువులతో పాటు మహ్మదీయులు, పార్శీలు, సిక్కుల్లో కూడా కొందరు మహామహులు మత సామాజిక సంస్కరణల కోసం ఉద్యమించారు.

సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌

సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ (1817-1898) ఆంగ్లేయ కంపెనీ ఉద్యోగి. భారతీయ ముస్లింల మత సాంఘిక జీవనం ఆధునిక పాశ్చాత్య, శాస్త్ర విజ్ఞానాన్ని పొందడం ద్వారానే మెరుగవుతుందని విశ్వసించాడు. పాశ్చాత్య విద్యకు ముస్లింలను దగ్గర చేసే లక్ష్యంతో అలీగఢ్‌ ఉద్యమం ప్రారంభించాడు. తన భావాలను తహరిక్‌-ఇ-అఖ్లాక్‌ అనే పత్రిక ద్వారా ప్రచారం చేశాడు. 1875లో అలీగఢ్‌లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్‌ కళాశాలను స్థాపించాడు. అది 1920 నాటికి అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది.

మరికొందరు మహామహులు

దుర్గారామ్‌ మెహతాజీ, దడోబా పాండురంగ 1849లో మహారాష్ట్రలో పరమహంస మండలిని స్థాపించారు. ఏకేశ్వర ఉపాసన, మానవ సమానత్వం వీరి ఆదర్శాలు. డాక్టర్‌ ఆత్మారామ్‌ పాండురంగ మత సాంఘిక సంస్కరణలే లక్ష్యంగా 1867లో ప్రార్థనా సమాజాన్ని స్థాపించాడు. ఎం.జి.రనడే, ఆర్‌.జి.భండార్కర్‌, ఎస్‌.జి.చందవర్కర్‌, కె.టి.తెలాంగ్‌ లాంటి మహామహులు ఈ సంఘంలో సభ్యులు. ఈ సంస్థ సాంఘిక సమానత్వం, స్త్రీల అభివృద్ధి కోసం కృషి చేసింది. కొద్ది కాలంలోనే పుణె, సూరత్‌, అహ్మదాబాద్‌, కరాచీ, కొల్హాపూర్‌లో శాఖలు ఏర్పడ్డాయి. దక్షిణాదిలో కూడా ఈ సంస్థ కార్యక్రమాలు వ్యాపించాయి. మద్రాస్‌ ప్రెసిడెన్సీలో కందుకూరి వీరేశలింగం (1848 - 1919) ఈ సంస్థతో ప్రభావితమై సంస్కరణోద్యమం ఆరంభించాడు. వీరేశలింగం బహుముఖ ప్రజ్ఞాశాలి. 130కి పైగా గ్రంథాలు రాశాడు.

ఆధునిక భారతదేశంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జాతి జాగృతిలో సమసమాజం, జన హక్కుల కోసం అలుపెరగని ఉద్యమాలు నడిపిన మహోన్నత సంస్కర్త. 19, 20 శతాబ్దాల నాటి మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు హేతువాదం, మానవతావాదంపై ఆధారపడ్డాయి. మతంతో అనుసంధానం చేసుకొని సంస్కర్తలందరూ స్త్రీ జనోద్ధరణ, సాంఘిక సమానత్వం, జాతి సామరస్యానికి కృషి చేశారు. ఫలితంగా భారత జాతి కొత్త చైతన్యాన్ని సంతరించుకుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం తొణికిసలాడాయి. ఈ నూతన ఉత్తేజం వారిని కార్యోన్ముఖులను చేసి తెల్లదొరల దోపిడీ పాలనకు వ్యతిరేకంగా మాతృభూమి స్వేచ్ఛ కోసం సాగుతున్న స్వాతంత్రోద్యమం వైపు నడిపించింది.

https://tinyurl.com/57m6ejyt

ప్రిపరేషన్‌ టెక్నిక్‌

రీజనింగ్‌లో ఇచ్చే ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నల్లో ఆప్షన్లను చూసి ఆన్సర్‌ కనిపెట్టాలని చూస్తే సమయం వృథా అవుతుంది. ప్రాక్టీస్‌తో లాజిక్‌ పెంచుకొని సమస్యను పరిష్కరిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇచ్చిన ఆప్షన్ల నుంచి సమాధానాన్ని రాబట్టేందుకు ప్రయత్నించాలి


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని