కరెంట్‌ అఫైర్స్‌

భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా జాతికి అంకితం చేశారు.

Published : 06 Jul 2022 01:35 IST

నేవీ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ జాతికి అంకితం

భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా జాతికి అంకితం చేశారు. తూర్పు తీరంలో నిఘాకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ లోహ విహంగం ఉపయోగపడుతుంది. 

ఐఐటీ హైదరాబాద్‌ దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌ లేకుండా వాహనాలను నడిపే సాంకేతికతలపై ప్రయోగాలకు వేదికను (టెస్ట్‌బెడ్‌) అందుబాటులోకి తెచ్చింది. జాతీయ మిషన్‌లో భాగంగా ఇక్కడ సైబర్‌ ఫిజికల్‌ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం టీహాన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భవిష్యత్తు నావిగేషన్‌ వ్యవస్థలతో పాటు మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు, తొక్కకుండానే వెళ్లే సైకిళ్లు రూపొందిస్తున్నారు.

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ విడుదల చేసిన స్టార్టప్‌ స్టేట్‌ ర్యాంకుల్లో దేశంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే టాప్‌ పెర్ఫార్మర్స్‌ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 26 కార్యాచరణ సూత్రాల కొలమానంగా 100 మార్కులకు ఈ ర్యాంకులు ప్రకటించారు.

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘టాప్‌ డాక్టర్స్‌ ఇన్‌ సౌత్‌-2022’ అనే అంశంపై ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో దక్షిణాదిన ఉత్తమ వైద్యుల్లో ఒకరుగా డాక్టర్‌ ఎ.నరేంద్రకుమార్‌ ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం తెలంగాణలో వైద్యవిద్య అదనపు సంచాలకులు, వనపర్తి బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్న ఉందకోటి రాముడు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రాముడు 1994లో దిల్లీ పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. 2018 నుంచి దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌లో ఏఎస్‌ఐగా సేవలు అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని